సమాధులు పిలుస్తున్నాయ్ !

Sharing is Caring...

Sheik Sadiq Ali…………………………………………….

ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, మల్లూరు అడవుల్లో నా దృష్టికి వచ్చిన అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, ఏటూరునాగారం-భద్రాచలం రహదారిలో, మంగపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో మల్లూరు కొండలున్నాయి. ఆ కొండల మీద సుదూరాల వరకూ కన్పించే కోట గోడలున్నాయి. ఆ కోటలో డోలమైన్లుగా పిలువబడే వేలాది సమాధులు ఉన్నాయి.

అలాగే కోట దిగువ భాగంలోనూ లెక్కించటానికి వీలుకానన్ని సమాధులు, వాటిని దాటి వెళితే కన్పించే శిఖాంజనేయుడు ఒక పక్క, అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్న చింతామణి అనే జలధార మరో పక్క, మరికొంచెం దూరం వెళ్తే హేమాచలం గా ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం (స్రవించే విగ్రహం) ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చించబోయే అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించినవే.

ఈ కొండల్ని రెండేళ్ళ క్రితం తొలిసారిగా సందర్శించా. మళ్ళీ మొన్న మా బృందంతో కలిసి వెళ్లి చూశా. అక్కడికి వెళ్ళడానికి ముందు 30 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న దామర వాయి లోని 145 ఆదిమానవులవి అని చరిత్రకారులు చెప్తున్న సమాధులు (డోలమైన్లు) కూడా చూసొచ్చా.

మల్లూరు కొండలను చేరుకోవటానికి కిలోమీటర్ దూరం నుంచే ఆ కొండలు, వాటి మీద చుట్టూ కోటగోడలు కన్పిస్తుంటాయి. అవి చూడ్డానికి తిరుమల కొండ శిఖరాల్లా కన్పిస్తుంటాయి కానీ, సహజ సిద్ధంగా కాకుండా మానవ నిర్మితం లా ఉన్నాయి. దగ్గరిగా వెళ్తే కానీ, వాటి మర్మం మనకు అర్ధం కాదు. వాటి గురించి కూడా ఇదే వ్యాసంలో మున్ముందు రాస్తా. వీటి గురించి రాసే ముందు కొండలు,గుట్టల విషయంలో నా పూర్వానుభవం కొంచెం చెప్తాను.

అది చెప్పకపోతే నేను చెయ్యబోయే విశ్లేషణకు క్రెడిబిలిటీ ఉండదు. గతంలో నేను హిమాలయాలు,ఆరావళి పర్వతాలు,పశ్చిమ కనుమలు,మదుమలై అడవులు, దండకారణ్యం,నల్లమల అడవుల్లో పలుమార్లు సంచరించాను. ఇకపోతే తిరుమల సప్తగిరుల్లో ఎన్ని వందలసార్లు తిరిగానో నాకే లెక్కలేదు.

ఈ అనుభవాలన్నీ మల్లూరు కొండల్లో నేను చూసిన, చేసిన పరిశోధనల్లో బాగా ఉపకరించాయి. హేమాచల నారసింహ ఆలయానికి వెళ్ళేదారిలో కిలోమీటర్ ముందుగానే ఎడమవైపున శిఖాంజనేయ  స్వామీ ఆలయానికి వెళ్ళడానికి అడవిలో కాలిబాట ఒకటి ఉంటుంది. ఆ బాటలో 200 మీటర్లు లోపలికి వెళ్ళగానే సమాధులు మొదలవుతాయి.సమాధుల మీద గుండ్రటి రాళ్ళు పరిచి ఉంటాయి.

అలాగే దారిపొడవునా పెద్ద రాళ్ళ గుట్టలు ఉంటాయి. ఆ రాళ్ళు పట్టుకొని ఎక్కడం మొదలు పెడ్తే అలా అలా ఎక్కుతూ ఉంటే కొండ శిఖరాన ఉన్న కోట గోడల వరకు చేరుకుంటాం.సరిగ్గా ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. సమాధుల మీద పరచిన రాళ్ళు, కొండలా ఏర్పడిన రాళ్ళు ఒకేలా ఉన్నాయి. అలాంటి రాళ్ళను నా జీవితకాలంలో ఎక్కడా,ఏ అడవిలోనూ చూడలేదు. మల్లూరు చుట్టుపక్కల కానీ,వరంగల్ జిల్లాలో కానీ ,తెలంగాణాలోని ఏ ఇతర జిల్లాలో కానీ ఎప్పుడూ చూడలేదు.

చిన్న చిన్న గులకరాళ్ళు ముద్దలు ముద్దలు గా,కుప్పలు కుప్పలుగా సిమెంటు లోనో, సున్నంలోనో కలిపి (కాంక్రీటు చేసినప్పుడు సిమెంట్,ఇసుక,కంకర కలిపి ముద్ద చేసి ఎండ పెడితే ఎలా ఉంటుందో అలా) కృత్రిమంగా రాయిలా తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి.

ఈ గులక రాళ్ళు నదీ పరివాహక ప్రాంతాల్లోనో,సముద్ర తీరాల్లోనో తప్ప మరెక్కడా కన్పించవు. చిత్రంగా రాళ్ళే తప్ప ఎలాంటి గవ్వల ఆనవాళ్ళు లేవు. మరో విశేషం ఏమిటీ అంటే , ఈ బండలకు మధ్యమధ్యలో రంధ్రాలు ఉన్నాయి. వాటి మధ్యలో మట్టిని కాల్చి తయారు చేసిన గొట్టాల లాంటివి ఉన్నాయి. అవి కూడా కొన్ని అంగుళాల పరిమాణంలోనే ఉన్నాయి.

ఈ మల్లూరు గుట్టలను ఆనుకొని కిలోమీటర్ దూరంలో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంటుంది.ఇప్పుడు కిలోమీటర్ దూరంలో ఉందీ అనుకుంటే ,కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితం అది ఖచ్చితంగా ఈ కొండలను అనుకునే ప్రవహించింది అనుకోవాలి.అలాంటప్పుడు ఈ కొండరాళ్ళలో కన్పించే గులకరాళ్ళు ఆ నదీ ప్రవాహంలోంచి వచ్చినవే అనుకోవచ్చు.

ఇక్కడ కొంచెం విరామం ఇచ్చి ఒకసారి చరిత్రలోకి తొంగి చూద్దాం. హేమాచల నరసింహ స్వామి క్షేత్రం గురించి చెప్పే సందర్భంలో శాతవాహన వంశానికి చెందిన దిలీప శాతకర్ణి 76 వేలమంది సైనికులతో ఈ కొండ మీద కోటలో నివాసమున్నాడని చెప్తారు. అలాగే ఆరో శతాబ్దం నాటికి చిన్న చోళ చక్రవర్తి ఇక్కడ రాజ్యం ఏలాడు  అంటారు.

ఇక కాకతీయుల కాలంలో గోన గన్నారెడ్డి ఇక్కడ స్థావరం ఏర్పర్చుకున్నాడని చరిత్రకారులు చెబుతారు. ఇది ఎంతవరకు వాస్తవమో కాని,వందల,వేల ఏళ్ళ క్రితమే ఇక్కడ మానవ సంచారం,నివాసం,కోట ఉన్నాయనేది మాత్రం నిర్వివాదాంశం.మరో కీలకమైన అంశం ఏమిటీ అంటే,1323 వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల వరుస దాడులు,ఓటమి తర్వాత వరంగల్ కోటను విడిచి పెట్టిన కాకతీయులు చత్తీస్ గడ్ కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం మల్లూరు కొండల్లో నివాసమున్నారా?

తాత్కాలిక ప్రాతిపదికన కోటను నిర్మించారా?లేక శిధిలమైన కోటను పునర్నిర్మించారా అనేది ఒక ప్రశ్న.తక్కువ వ్యవధిలో కొండరాళ్ళతో కోటను నిర్మించటం  సాధ్యం  కాదు కాబట్టి గులకరాళ్ళతో కలిపి మిక్సింగ్ బండలు తయారు చేసి తాత్కాలిక ప్రాతిపదికన కోటను నిర్మించారా? అసలు వాళ్ళేనిర్మించారా? లేక మరెవరైనా నిర్మించారా?

అలా అయితే ఏ కాలంలో నిర్మించారు? ఈ రాళ్ళను చూస్తే మాత్రం అవి సహజ సిద్ధమైనవి కావనీ,కృత్రిమంగా తయారు చేసినవనీ స్పష్టంగా అర్ధమవుతుంది. మరి అలాంటప్పుడు అక్కడున్న వేలాది సమాధులు ఎవరివి? చరిత్రకారులు భావిస్తున్నట్లు ఆదిమ మానవులవీ, 5 వేల ఏళ్ళ క్రితం నాటివీ కావా? ఒకవేళ ఆ కాలం నాటివే అనుకుంటే గులక రాళ్ళ మిశ్రమంతో కృత్రిమ కొండలు,రాళ్ళు సృష్టించే విద్యను అప్పటికే వాళ్ళు నేర్చుకున్నారా?

ఎక్కడ గుండ్రటి రాళ్ళతో సమాధులు కన్పించినా అవి ఆదిమ మానవుల సమాధులే అని చెబుతున్న చరిత్రకారులు మల్లూరు సమాధులకు ఏ రకమైన వివరణ ఇస్తారు?అసలు మన దగ్గర దీర్ఘ చతురస్త్రాకారపు సమాధులు ఎప్పుడు మొదలయ్యాయి? పైన రాళ్ళు కప్పే సమాధుల ఆచారం ఏ కాలం వరకు కొనసాగింది?ఇలా అనేకానేక ప్రశ్నల సమాహారమే ఈ కథనం.  చరిత్ర అధ్యయనంలో మరో కోణం అవసరం ఉంది. 

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!