Spy beloons …………………………..
గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ సమయంలో అదేంటో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇటీవల చైనా బెలూన్ ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తమైంది. ఆ అసాధారణ వస్తువు కనిపించిన ద్వీపాలు.. భారత్ క్షిపణి పరీక్షా కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయి. చైనా తదితర దేశాలకు ఇంధనం, ఇతర సామగ్రి జల రవాణాకు కీలకమైన మలక్కా జలసంధీ వాటికి సమీపంలోనే ఉంటుంది.
అండమాన్ నికోబార్ ద్వీపాలపై ఆ వస్తువు అకస్మాత్తుగా ప్రత్యక్షమైందని, మధ్యలో అనేక భారత రాడార్ వ్యవస్థలను తప్పించుకుందని పలువురు అధికారులు చెప్పినట్లు వార్తాకథనాలు వచ్చాయి. అసలు ఆ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది ? దాని ఉద్దేశం ఏంటి? కూల్చేయాలా ? వద్దా? అనే దానిపై ఒక నిర్ణయానికి రాకముందే.. అది సముద్ర గగనతలంలోకి వెళ్లిపోయింది.
వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్ కావొచ్చని అప్పట్లో భావించారు. అమెరికా- చైనా వ్యవహారంతో.. భారత అధికారులు సైతం గతేడాది జరిగిన వ్యవహారాన్ని తాజాగా పునఃసమీక్షిస్తున్నారు.
మున్ముందు ఈ తరహా ఘటనలను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, తద్వారా వేగంగా స్పందించేందుకు వీలుగా ఇప్పటికే చర్యలు మొదలు పెట్టారు.
అండమాన్ లేదా మరేదైనా ప్రాంతంలో మళ్లీ అలాంటి వస్తువు కనిపిస్తే.. దానిని జాగ్రత్తగా అధ్యయనం చేసి, గూఢచర్య వస్తువుగా తేలితే.. దానిని కూల్చేసే అవకాశం ఉంది. వాటిని కూల్చేసేందుకు అమెరికా మాదిరి ఖరీదైన సైడ్ విండర్ క్షిపణులు కాకుండా.. యుద్ధ విమానాలు, లేదా భారీ మెషిన్ గన్లు అమర్చిన రవాణా విమానాల ను ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ముందే చెప్పుకున్నట్టు ఈ తరహా బెలూన్లు వాడకం ఎప్పటినుంచో ఉన్నదే. అమెరికన్ సివిల్ వార్ వంటి సంఘర్షణల సమయంలో నిఘా ప్రయోజనాల కోసం ఉపయోగించారు.మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి వీటి వాడకం విస్తృతంగా వ్యాపించింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్, చైనాపై నిఘాను పెట్టేందుకు US వందలాది బెలూన్లను ప్రయోగించింది.
మానవరహిత డ్రోన్లు, ఉపగ్రహాల పెరుగుదలతో వీటి వినియోగం తగ్గినప్పటికీ , అనేక దేశాలు ఇప్పటికీ గూఢచారి బెలూన్లను ఉపయోగిస్తున్నాయి. చైనా దశాబ్దాలుగా తన స్వంత భూభాగానికి సమీపంలో నౌకలు, గూఢచారి విమానాల ద్వారా US నిఘా గురించి ఫిర్యాదు చేసేది. ఈ నిఘా వ్యవహారం అప్పుడప్పుడు ఘర్షణలకు దారితీసింది. నాడు నిఘాను వ్యతిరేకించిన చైనా ఇపుడు తానే ఆ పని చేస్తున్నది.