అప్పట్లో ఆపాట పెద్ద దుమారమే రేపింది!

Sharing is Caring...

The big controversy………………………… 

భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వివాదానికి గురైన పాట “చోళీ కే పీచే క్యా హై”. చాలామంది ఈ పాటను విని ఉండవచ్చు. 1993 లో విడుదలైన “ఖల్ నాయక్‌” చిత్రంలోని  హిందీ పాట ఇది. అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ ఈ పాటను పాడారు. 

ఈ పాటను ప్రముఖ రచయిత ఆనంద్ బక్షి రాయగా … లక్ష్మీకాంత్ ప్యారేలాల్ బాణీ సమకూర్చారు. ఈ పాటలో నాటి ప్రముఖ తారలు మాధురీ దీక్షిత్, నీనా గుప్తా నటించారు. ఇది ఒక ఐటెం సాంగ్ వంటిదే. అప్పట్లో ఈ పాట పెను సంచలనం సృష్టించింది. సినిమా విడుదల కంటే ముందుగా ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అయ్యాయి.

పాట, సంగీతం ఆకర్షణీయంగా ఉండటంతో ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాదాపు కోటి క్యాసెట్లను వారంలోనే టిప్స్ సంస్థ అమ్మిందని అంచనా. అది కూడా అప్పట్లో ఒక రికార్డు. ఈ క్రమం లోనే నిర్మాత దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ కార్యాలయంలో ఐటీ శాఖ సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ పాట బూతుల మయంగా ఉందని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

దాదాపు 32 సామాజిక సంస్థలు ఈ పాట ను నిషేదించాలని డిమాండ్ చేశాయి. సుభాష్ ఘాయ్ కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేఖలు రాశాయి. మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వడం తో ఈ పాట దేశ వ్యాప్తంగా మరింతగా పాపులర్ అయింది. తెలియని వాళ్ళు కూడా క్యాసెట్లు కొన్నారు. పత్రికల్లో .. రేడియాల్లో ఇదే అంశంపై చర్చలు నడిచాయి. అంత వ్యతిరేకత వచ్చినా సినిమాలో ఆ పాట ఉండి తీరాలనే పట్టుదలతో నిలబడ్డాడు సుభాష్.  

బీజేపీ మద్దతు దారుడు.. న్యాయవాది ఛుగ్ ఈ పాట ను నిషేదించాలని కోర్టు కెక్కారు. కొన్ని రోజుల పాటు వాదోపవాదాలు నడిచాయి. ఇది జానపద గీతమని… రాజస్థాన్ ప్రాంతంలో పలు వేడుకల సందర్భంగా మహిళలు కూడా పాడుతుంటారని .. ఇందులో అశ్లీలం ఏమి లేదని సుభాష్ తరపు న్యాయవాదులు వాదించారు.  ఛుగ్ సమర్ధవంతంగా తన వాదనను వినిపించలేకపోయారు. విచారణ సందర్భంగా ఒకరోజు ఆయన కోర్టుకు ఆలస్యంగా వచ్చారు. కోర్టు కేసును కొట్టేసింది.

రామానంద్ సాగర్ నిర్మించిన టెలివిజన్ ధారావాహిక ‘రామాయణ్’లో రావణ పాత్ర పోషించిన అరవింద్ త్రివేది అప్పట్లో పార్లమెంటు సభ్యుడు. సెన్సార్‌ షిప్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన  “ఈ రోజు కేవలం చోళీ వెనుక ఏమి ఉంది అని అడుగుతున్నారు. రేపు వారు నిజంగా చోళీ వెనుక ఉన్నది చూపుతారు. అప్పుడు మనం ఏమి చేస్తాము?” అని కామెంట్ చేశారు.

అప్పటి బీజేపీ ఎంపీ ఉమాభారతి కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత సినిమా పూర్తై సెన్సార్ కి వెళ్ళినపుడు .. సినిమా చూసిన సభ్యులు విమర్శలు ఏమి చేయలేదు. ఈ పాట సాహిత్యాన్ని .. దాన్ని చిత్రీకరించిన విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. చిత్రీకరణలో అసభ్యత .. అశ్లీలం లేదు కాబట్టి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

కాకపోతే పాటలోమూడు, నాలుగు చోట్ల కటింగ్స్ ను సూచించారు. సుభాష్ అంగీకరించలేదు. చివరికి రెండు కటింగ్స్ కు సుభాష్ ఒప్పుకున్నారు. ఆ విధంగా ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా విడుదలయ్యాక విజయం సాధించింది. విడుదలకు ముందే విపరీతమైన పబ్లిసిటీ రావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. పాట యూట్యూబ్ లో ఉంది… చూడండి. 

——-K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!