Costly tea …………………………
అస్సాం టీ పౌడర్ కి ప్రపంచ వ్యాప్తంగా అమితమైన డిమాండ్ ఉంది. ఈ ఏడాది మనోహరి బ్రాండ్ కిలో తేయాకు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. డిబ్రూఘర్ జిల్లాకు చెందిన “మనోహరి గోల్డ్ టీ” ఉత్పత్తి చేసిన తేయాకు కు కిలో రూ.99,999 ధర పలికింది. గౌహతి టీ వేలం సెంటర్లో ఈ వేలం పాట నిర్వహించారు.
ప్రతి ఏటా ఈ బ్రాండ్ తేయాకు కు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది నమోదు అయిన రికార్డును మనోహరి గోల్డ్ తేయాకు ఈ ఏడాది కూడా అధిగమించింది. వేలంలో అధిక ధరకు సౌరవ్ టీ ట్రేడర్స్ సంస్థ మనోహరి గోల్డ్ తేయాకును కొనుగోలు చేసింది. 2020 లో మనోహరి గోల్డ్ తేయాకు కిలో 75 వేల రూపాయలకు అమ్ముడైంది. 2019 లో ఇదే బ్రాండ్ తేయాకు ధర రూ. 50 వేలు పలికింది.
2018లో ఇదే మనోహరి బ్రాండ్ తేయాకు కిలో ధర వేలంపాటలో 39,000 రూపాయల వరకు వెళ్ళింది. అపుడు కూడా సౌరభ్ టీ ట్రేడర్స్ సంస్థే ముందుకొచ్చి కొనుగోలు చేసింది. ఇక 2020లో మాత్రం .. విష్ణు టీ కంపెనీ అధిక బిడ్‌ను వేసి 1 కిలో తేయాకును 75 వేలకు దక్కించుకుంది.
ప్రత్యేకంగా మనోహరి టీ ఎస్టేట్ ఈ తరహా తేయాకు ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటినుంచి మనోహరి గోల్డ్ టీకి డిమాండ్ పెరిగిందని ఎస్టేట్ యజమాని రాజన్ లోహియా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తేయాకుకు ఆదరణ ఉందని అంటున్నారు. ఈ ఏడాది తాము మనోహరి గోల్డ్ తేయాకును 2 కిలోల కంటే కొంచెం ఎక్కువగా ఉత్పత్తి చేశామని వివరించారు.
దీని సాగు సాధారణ తేయాకు తరహాలో ఉండదు. ఈ తేయాకు ఉత్పత్తి కష్టతరం .. ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ తేయాకుతో తయారుచేసిన టీ రుచి అమోఘంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి లో హెచ్చుతగ్గులు ఉంటాయి. వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ ఉన్న టీ ని మనోహరి ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది.
తేయాకుకు ఇంత పెద్ద ధర పలకడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రత్యేకమైన టీ కి చాలా డిమాండ్ ఉంది. దీని ఉత్పత్తి కూడా తక్కువగా ఉందని సౌరభ్ టీ ట్రేడర్స్ సీఈఓ ఎంఎల్ మహేశ్వరి చెబుతున్నారు. తేయాకు తోట యజమాని ఉత్పత్తిని ప్రైవేట్‌గా విక్రయించడానికి నిరాకరించడంతో వేలంలో పాల్గొన్నామని అంటున్నారు.