ఖరీదైన స్నేహాలు .. జాక్వెలిన్ vs సుకేష్ !!

Sharing is Caring...

రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం  పెంచుకున్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్ ఈడీ విచారణలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కార్యాలయం పేరు చెప్పి సుకేశ్‌.. తనతో స్నేహం పెంచుకున్నాడని జాక్వెలిన్‌ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

అలాగే తాను తమిళనాడు మాజీ సీఎం జయలలిత బంధువునని కూడా చెప్పుకున్నాడట. నటి జాక్వెలిన్‌కు తమ పరిచయం సందర్భంగా సుకేష్ ఖరీదైన గిఫ్ట్‌లు కూడా ఇచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే ఈడీ రెండు సార్లు విచారించింది. విచారణలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఈడీ ఆ వివరాలను ఛార్జ్‌షీట్‌లో పొందు పర్చింది.

కొద్దిరోజుల క్రితమే ఈ ఛార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. చార్జీ షీట్ లోని  వివరాల ప్రకారం.. సుకేశ్ తనను తాను ‘శేఖర రత్నవేలు’గా  పరిచయం చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో సుకేష్ పలుమార్లు జాక్వెలిన్‌ తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అతని ఫోన్ కాల్స్ కి ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో హోమ్ మంత్రి కార్యాలయం నుంచి అన్నట్టుగా ఒక ఫేక్ కాల్ ద్వారా మేకప్‌ ఆర్టిస్ట్‌ షాన్‌ ముథాతిల్‌ కు ఫోన్ చేయించి అతను ఒక వీఐపీ అని చెప్పించాడు.

అలా జాక్వెలిన్‌ తో పరిచయం చేసుకున్నాడు. అక్కడ నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు సుఖేష్ జాక్వెలిన్‌తో పూర్తి టచ్‌లోనే ఉన్నారని ఈడీ దర్యాప్తులో తేలింది.సుకేష్ నుంచి కోట్లాది రూపాయల ఖరీదైన కానుకలు తీసుకున్నట్లు ఈడీ జాక్వెలిన్ విచారణ సమయంలో చెప్పిందట. వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్ , డిజైనర్‌ బ్యాగ్‌లు వంటివి ఆ జాబితాలో ఉన్నాయట.

ఇక బెంగుళూరుకు చెందిన చంద్రశేఖర్‌పై 15 కేసులు ఉన్నాయి.విలాసవంతమైన జీవనశైలి కి అలవాటు పడ్డాడు.  చెన్నై..బెంగుళూరు లో అనేక మందిని కోట్లలో మోసం చేశాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఆగస్టు 23న సుకేష్‌పై మనీలాండరింగ్ కేసు నమోదయింది. ఫోన్‌ స్పూఫింగ్‌ టెక్నాలజీతో ప్రముఖులకు అతడు ఫోన్‌ చేసి పరిచయం చేసుకునేవాడు.సుఖేష్ కాల్ చేసినపుడు  అవతలి వ్యక్తి కాలర్‌ ఐడీలో ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్‌ వస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో వారు అది నిజమని నమ్మి మోసపోయేవారు.

జైల్లో నుంచి కూడా సుకేష్‌  మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ నేతల బంధువుని అని చెప్పుకుంటూ ఎంతోమందిని మోసం చేసాడనే ఆరోపణలున్నాయి. అక్టోబర్‌లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసిన తర్వాత జాక్వెలిన్ వివాదాల్లో చిక్కుకుంది. జాక్వెలిన్‌తో కలసి  ప్రయాణం చేసేందుకు సుఖేశ్‌ ఏకంగా స్పెషల్‌ ఫ్లైట్‌ను బుక్‌ చేశాడని ….  దీనికి రూ. 8 కోట్లు ఖర్చుపెట్టాడని అంటారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!