రాజు గారి భోగాలే వేరు కదా !

Sharing is Caring...

King Charles ……

ఎలిజబెత్ రాణి 2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజు కాబోతున్నారు. 73 ఏళ్ళ చార్లెస్ కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.బ్రిటన్ రాజ కుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు | రాణి గా మారిపోతారు.

చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్ హామ్ ప్యాలెస్ లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు.

అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్ ను  రెండో పెళ్లి చేసుకున్నారు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన చార్లెస్.. ఇకపై కింగ్ చార్లెస్ 3 గా వ్యవహరిస్తారు. అలాగే 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 పాస్పోర్టు లేకుండా ఏదేశమైనా వెళ్లవచ్చు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రయాణించవచ్చు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి చార్లెస్ కి పాస్ పోర్ట్ అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్చగా విహరించవచ్చు.

రాజుకి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక ఆదేశాలు  జారీ చేస్తారు.  బ్రిటన్లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. బ్రిటన్ రాజు ఎప్పుడు ఓటింగ్ లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా,రాజు రాజకీయ వ్యవహారాల్లో  తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

రాజు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

బ్రిటన్ రాజు  కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఒక ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నియమితులై మొదటి మహిళగా నిలిచారు.

ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ 2 పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఆ పదవిలో సైమన్ ఆర్మిటేజ్ కొనసాగుతున్నారు. కొత్త రాజు చార్లెస్ పట్టాభిషేకం కోసం సైమన్ పద్యాలు రాస్తారు.

రాజు గారికి  వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీల కోసం ప్రత్యేకంగా  రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ ఆయా కంపెనీలకు ,వ్యక్తులకు గొప్ప గౌరవాన్ని అందిస్తుంది. రాయల్ వారెంట్ కారణంగా ఆయా సంస్థల అమ్మకాలు పెరిగే అవకాశాలుంటాయి.  

బర్బెర్రీ, క్యాడ్ బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి. ఇక రాజ కుటుంబం ఖర్చుల కోసం సావరిన్ గ్రాంట్ పేరిట నిధులు కేటాయిస్తారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో  102.4 మిలియన్ల పౌండ్స్  రాజ కుటుంబం ఖర్చు చేసింది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!