ఆ ఇంట్లో ……. …………….(కథానిక)

Sharing is Caring...

కాలింగ్ బెల్ కొట్టాను …. ఎవరో అమ్మాయి వచ్చి తలుపు తీసింది.ఆమె వాలకం చూస్తే  పని అమ్మాయిలా ఉంది.   ‘సార్ రమ్మన్నారు’ అని  చెప్పా……’ వెళ్లి హాల్లో కూర్చోండి’ అంది. ఆ అమ్మాయి  లాన్ లో నుంచి ఇంటి వెనుక వైపుకి వెళ్ళింది.

అది చాలా ఓల్డ్ బిల్డింగ్. లోపలకు వెళ్లాను. సున్నం కొట్టించి ఎన్నాళ్లు అయిందో.  కూర్చున్న 15 నిమిషాలకు ఆయన వచ్చారు. లేచి నిలబడి  విష్ చేసాను.”మీరు లోపలికి  ఎలా వచ్చారు ? ” అన్నాడాయన  ఆశ్చర్యంగా . “ఎవరో అమ్మాయి డోర్ తీసి … ఇక్కడ కూర్చోమని చెప్పింది.”  అన్నాను జవాబుగా. “ఇక్కడ అమ్మాయిలు ఎవరూ లేరే ?”  అయన గొణుక్కున్నట్టుగా అన్నాడు .

ఆ మాట వినగానే నా గుండె గుభిల్లుమంది .”అన్నట్టు మీరు ఎవరు ?” అడిగాడు ఆయన. “ఉదయం  ఫోన్ చేస్తే రమ్మన్నారు కదా  ఇంటర్వ్యూకి ” చెప్పాను.”రమ్మని చెప్పానా ?” అని ఆయన బుర్ర గోక్కున్నాడు. ‘ఇదేందీ రాంగ్ అడ్రెస్ కొచ్చానా ? డౌట్ వచ్చింది.”కూర్చోండి వస్తాను” అని లోపలికి  వెళ్ళాడు. అంతలో ఆ అమ్మాయి కాఫీ కప్పుతో వచ్చింది. ఏం మాట్లాడకుండా టేబుల్ పై పెట్టి వెళ్ళింది.

ఆయనేమో ఇక్కడ ఎవరూ అమ్మాయిలు  లేరంటాడు … మరి ఈ అమ్మాయి ఎవరు ? కొంపదీసి దెయ్యం కాదు కదా.. ఈ పాత బంగ్లా  తీరు చూస్తుంటే ఏదోలా ఉంది. ఇక్కడ మనుష్యులు కూడా తేడా నా ఏంటి ? టీపాయ్  పైన కాఫీ . పొగలు కక్కుతోంది.  తాగేస్తే ఓ పనై పోతుంది కదా . కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను.

సరిగ్గా ఇరవై నిమిషాలకు పెద్దాయన  వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. “చెప్పండి ఏమిటి పని “అని అడిగేడు. “మీరు ఆత్మల  మీద పరిశోధన చేస్తున్నారు కదా ! ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. “”ఓహో  … అలాగా … నైస్ ..” అన్నాడు. “ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ?” అన్నాను. “అడగండి” అన్నారాయన.

“ఆత్మలు ఎలా ఉంటాయి ?  మీరెప్పుడైనా చూసారా ?” అడిగాను.”మంచి ప్రశ్న. నేను జవాబు చెప్పేముందు అసలు మీ అభిప్రాయం ఏమిటి ?  ఆత్మలు ఉన్నాయనుకుంటున్నారా ? లేవనుకుంటున్నారా ? ”  ఎదురు ప్రశ్న వేసాడు ఆయన.  “ఉన్నాయనే అనుకుంటున్నా.” చెప్పాను.

“ఏమైనా స్టడీ చేశారా ?  సారీ అడగడం మర్చిపోయా … మీరు కాఫీ తాగుతారా ? టీ నా ” అడిగేడు ఆయన.  ‘ఇపుడే తాగాను’ అని చెప్పబోయి టీపాయ్ వైపు చూసా.  అక్కడ ఖాళీ కప్పు లేదు.  అంతే … మరు క్షణం వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ కప్పు ఎలా మాయమైంది ? ఆ అమ్మాయి మళ్ళీ రాలేదుగా ? “హలొ ఏమిటి ఆలోచిస్తున్నారు ? ఏం తాగుతారో చెప్పలేదు ” పిలిచాడు ఆయన.

“టీ బెటర్”  అన్నా.   “జస్ట్….  ఇపుడే వస్తా ” అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. ఎందుకో ఇక్కడ ఉండటం మంచిది కాదేమో … కాసేపు ఉంటే మరే చిత్రాలు జరుగుతాయో ?అంతే… ఆ ఆలోచన రాగానే బయటకొచ్చేసాను . లాన్ లో ఆ అమ్మాయి ఎదురైంది. “అయిపోయిందా..  ఇంటర్వ్యూ” అడిగింది  అదోలా చూస్తూ… ఆ చూపులో ఏదో  తేడా ఉంది.

గేటు దాటి రోడ్డు పైకొచ్చానో లేదో  ముందుగా కారు వచ్చి ఆగింది.  అందులోంచి ఒకతను దిగాడు. అతను అచ్చం ఆ పెద్దాయనలాగానే ఉన్నాడు. బహుశా ఆయన కొడుకేమో ? అతను నావైపు చూసి ‘రిపోర్టర్ రవి మీరేనా ?’  అని అడిగేడు.. ‘అవును సార్’ అన్నాను .

‘సారీ … అనుకోకుండా బయటకు వెళ్ళా. మీరు వచ్చి ఎంత సేపు అయింది ?’
‘గంట అవుతుంది… ఇప్పటి దాకా లోపల కూర్చున్నా .. మీ ఫాదర్ తో మాట్లాడాను. ‘ చెప్పాను.
‘మా ఫాదర్ తోనా ? ‘అతను ఆశ్చర్య పోతూ అన్నాడు.
‘మీ ఫాదర్ కాదా ? అచ్చం మీలాగే ఉన్నారే ?’

‘అవును. ఆయన నాలాగే ఉంటారు  కానీ ఆయన చనిపోయి ఏడాది దాటింది.’  ఆయన మాటలు వినగానే  గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది. అంటే ఇప్పటివరకు మాట్లాడింది ఆత్మతోనా ? ‘కొంచెం అర్జెంటు వర్క్ ఉంది … ఫోన్ చేసి మళ్ళీ వస్తా’   అనేసి అక్కడనుంచి వచ్చేసా.

——-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!