A movie based on a true story…………………………………………
ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
మాస్ ప్రేక్షకులు ఇష్టపడే మసాలా ఇందులో ఇసుమంత కూడా కనిపించదు. మలయాళ టాప్ హీరో మమ్ముట్టి నటించిన సినిమా ఇది. పోలీస్ టీమ్ లీడర్ గా తన ఇమేజ్ కి భిన్నంగా మమ్ముట్టి నటించాడు. సినిమా లో ఒకటి రెండు స్త్రీ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అది కొద్దీ నిమిషాల పాటే. ఇక పాటలు కూడా లేవు. నేపధ్య సంగీతం మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది.
2014 ఎన్నికల్లో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన గురించి దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం ఆధారం గా ఈ సినిమా తీశారు. నక్సల్స్ ఎవర్ని టార్గెట్ చేస్తారు ? మందు పాతరలు ఎలా పేలుతాయి? వంటి అంశాలపై అవగాహన లేమి .. నక్సల్స్ ను ఎదుర్కొనే వ్యూహాలపై శిక్షణ లేని పోలీసులు ఎన్నికల డ్యూటీ లో ఎదుర్కొనే ఇక్కట్ల ను దర్శకుడు ఖలీద్ రహమాన్ అద్భుతంగా తెర పైకి ఎక్కించారు. కనీస వసతి కూడా లేకుండా చిన్నఎన్నికల బూత్ లోనే ఉంటూ ఎన్నికల డ్యూటీ నిర్వహిస్తారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా కథ నడుస్తుంది.
ఎన్నికల డ్యూటీ కి వెళ్లిన పోలీసుల దగ్గర మందుగుండు సామాగ్రి పరిమితంగా ఉంటుంది. లాఠీలు ఎక్కువగా ఉంటాయి. ఒక రాత్రి వేళ నక్సల్స్ కాల్పులు జరిపితే వీరు కూడా రెచ్చిపోయి ఎదురు కాల్పులకు దిగుతారు.
దీంతో బుల్లెట్స్ ఎనిమిది మాత్రమే మిగులుతాయి. టీమ్ లీడర్ మమ్ముట్టి పై అధికారులకు మందుగుండు సామాగ్రి గురించి తెలియ జేస్తాడు. కేరళ నుంచి ఆ మందు గుండు సామాగ్రి వస్తుండగా రైల్లోనే మాయమవుతుంది. చివరికి ఎలాంటి మందుగుండు సామాగ్రి లేకుండానే లాఠీలతోనే పోలీసులు విధులు నిర్వహిస్తారు.
మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసీలను వెళ్లగొట్టే రాజకీయాల గురించి,అమాయకులను పట్టుకుని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్న తీరు గురించి దర్శకుడు సూచన ప్రాయంగా చెబుతాడు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన అభ్యర్థి,అతని అనుచరులకు మమ్ముట్టి టీమ్ లాఠీలతోనే జవాబు చెప్పిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సినిమా కొంత భాగం కేరళలో.. మరికొంత బస్తర్ అడవుల్లో చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో నటులు కూడా నక్సల్స్ తమను ఏమైనా చేస్తారేమో అని భయపడ్డారట.సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఎలాంటి హంగులు . ఆకర్షణలు లేకపోయినా సూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఉంది చూడండి.
నోట్ …. ఇదే కథను తెలుగులో తీస్తే ….ఎలాఉంటుందో ఊహించుకోండి