Ramana Kontikarla …………….
షోలే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అసాధారణ విజయం.. వెండి తెర తెరమరుగయ్యేంతవరకూ చెప్పుకునే, నిల్చిపోయే పోయే బ్లాక్ బస్టర్. అలాంటి షోలే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. రచయితలు సలీంఖాన్-జావేద్ అక్తర్ రచనా పటిమ, రమేష్ సిప్పి స్క్రీన్ ప్లే … డైరెక్షన్ లో తెరకెక్కిన షోలే బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టింది.
ఈ సినిమాలో కీలక పాత్ర గబ్బర్ సింగ్ దే. ఆ పాత్ర లేకపోతే .. ఆ విధంగా పాత్రను మలచక పోతే సినిమా తుస్సుమనేది. పాత్ర రూపకల్పన, అంజాద్ నటన నభూతో నభవిష్యత్ అన్నరీతిలో సాగాయి. అందుకే సినిమా మొత్తాన్నీ గబ్బర్ పాత్ర హైజాక్ చేసింది. అసలు ఈ పాత్రకు ప్రేరణేంటి..? గబ్బర్ పాత్ర వెనుక నిజమైన గబ్బరెవరు..?
గబ్బర్ సింగ్ పాత్రకు ఓ నిజమైన బందిపోటు కథే ప్రేరణ. 1950 దశకంలో గబ్రా అనే బందిపోటుపేరు చెబితేనే మధ్యప్రదేశ్ ప్రజలు గజగజా వణికే వారు. 1926లో భిండ్ జిల్లా డాంగ్ లో జన్మించిన గబ్రా… జస్ట్ 24 ఏళ్లకే పేరుమోసిన బందిపోటుగా మారాడు. అప్పట్లో మూడు రాష్ట్రాల పోలీసులకు నిద్రలేకుండా చేశాడు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకూ టార్గెట్ అయ్యాడు. సినిమాలో మాదిరిగానే . ఆనాడే అతణ్ని పట్టుకున్నవారి 50 వేల రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించాయి ప్రభుత్వాలు.
గబ్రా బందిపోటుగా ఎంత క్రూరుడో అంతే భక్తిపరుడు.తన కులదైవానికి ఒళ్లు గగుర్పొడిచే మొక్కులు మొక్కుకునేవాడు. అలా 116 మంది ముక్కులు కోసి కులదేవతకు సమర్పిస్తానని మొక్కుకున్నాడట గబ్రా. ఆ క్రమంలోనే అనేకమంది పోలీస్ అధికారుల ముక్కులు, చెవులు కోసి ఆ దేవతకు అర్పించి అన్నంత పనీ చేశాడు. అంతటి భయంకరమైన చరిత్ర గబ్రాది. ఆ రోజుల్లో గబ్రా గురించి కథలు కథలు గా చెప్పుకునేవారట.
1950ల కాలంలో మధ్యప్రదేశ్ ఐజీ గా ఉన్న కే.ఎఫ్. రుస్తం జీ తన డైరీలో గబ్రా గురించి కొన్ని విషయాల్ని రాసుకున్నారు. ఆ డైరీ ప్రకారం గబ్రా చేస్తున్న ఆకృత్యాలతో భిండ్, గ్వాలియర్, చంబల్, ఎటావా, ధోల్ పూర్ వంటి ప్రాంతాల్లో జనం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేవారే తప్ప..గబ్రా ఆచూకీ మాత్రం పొరపాటున కూడా పోలీసులకు చెప్పేవారు కాదట.
1955 వరకూ కూడా గబ్రా కళ్యాణ్ సింగ్ గుజ్జార్ అనే మరో బందిపోటు ముఠాలో సభ్యుడిగా పని చేసేవాడు.అప్పటికే ఒక ప్రత్యేక స్టయిల్తో బందిపోటుగా తన ఉనికిని చాటుకున్న గబ్రా.. తానే ఓ ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
గబ్రా అరాచకాలతో…. నాటి చంబల్ లోయలో ఆర్తనాదాలకు ఆనాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కూడా తలపట్టుకుంది. ఎలాగైనా అతణ్ని పట్టుకోవాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. అలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గబ్రా కోసమే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించింది.
1959లో ఒక పోలీస్ ఆఫీసర్ గబ్రాను మట్టుబెట్టడంలో చాకచక్యం ప్రదర్శించాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అప్పటికే ప్రధానమంత్రి నెహ్రూకు స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి. ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్. నెహ్రు గబ్రా ను పట్టుకునేందుకు పంపిన ప్రత్యేక అధికారి.. ఆయన నాయకత్వం లోనే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేసింది.
ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ టాస్క్ ఫోర్స్ టీం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలన్నీ జల్లెడ పట్టింది. చంబల్ లోయలోని ఓ గ్రామానికి చెందిన రాంచరణ్ అనే ఓ వ్యక్తి పోలీసులకు అందించిన సమాచారంతో పోలీసుల వేట మొదలైంది.

అదిగో ఆ గబ్రా కథనే స్ఫూర్తిగా తీసుకుని సలీంఖాన్-జావేద్ అక్తర్ చేసిన ప్రతిసృష్టే బ్లాక్ బస్టర్ షోలేలోని… లెజెండరీ గబ్బర్ సింగ్ పాత్ర!

