అలా ‘మిస్సమ్మ’ నుంచి ఆమెను తప్పించారు !

Sharing is Caring...

సుప్రసిద్ధ నటి భానుమతిది  విలక్షణమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న సినిమా పరిశ్రమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని భానుమతి అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. ఆమె చాలా నిక్కచ్చి మనిషి.  

ఈ నిక్కచ్చితనం తోనే మిస్సమ్మ సినిమా మిస్ అయింది. మిస్ అయిందనేకంటే  విజయా చక్రపాణి తప్పించారని అనుకోవచ్చు. చక్రపాణి ఎంత మేధావి అయినా తన మాటను లెక్కపెట్టని వారిని సినిమాల్లో నుంచి తీసిపడేసేవాడని అంటారు. ఇదేమి రహస్యం కాదు. సంగీత దర్శకుడు రాజేశ్వరరావు కి ఆయనకు అలాగే చెడింది.అలాగే మరికొందరితో కూడా. 

ఇక భానుమతి విషయానికొస్తే విజయా వారి మిస్సమ్మ సినిమాలో మేరీ పాత్ర ను తొలుత భానుమతి చేశారు.నాలుగు రీళ్ల కు పైగా  సినిమా కూడా పూర్తయింది. ఆరోజు వరలక్ష్మీ వ్రతం. పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకొని షూటింగ్ కి భానుమతి కొంచెం ఆలస్యంగా వెళ్లారు. నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి భానుమతిపై కోప్పడ్డారు. ఆలస్యమైనందుకు క్షమాపణ చెప్పమన్నారు.

భానుమతి అందుకు ‘ససేమిరా’ అన్నారు. తాను ముందురోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ చెప్పినప్పుడు .. రేపు  ఆలస్యంగా వస్తానని ప్రొడక్షన్ సిబ్బందికి నోట్ రాసి … మీకు ఇవ్వమని చెప్పానని భానుమతి గట్టిగా జవాబు చెప్పింది. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

దీంతో చక్రపాణికి మరింత కోపమొచ్చి తీసిన నాలుగు రీళ్ళను కాల్చిపడేశారు. భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకొని సినిమా పూర్తి చేశాడు. అయితే తన తప్పు ఉంటే మటుకు ఏమాత్రం సంకోచించకుండా భానుమతి క్షమాపణ చెప్పేవారని ఆమెను బాగా ఎరిగిన వారు అంటారు. మొత్తానికి ఆమె మిస్సమ్మ నుంచి తప్పుకున్నారు.

ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమాలలో ఒకటైన మిస్సమ్మ అప్పట్లో ఘన విజయం సాధించింది. తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచి పోయింది. బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ మైత్రా నాటకం మన్మోయీ గర్ల్స్ హైస్కూల్…. శరదిందు బందోపాధ్యాయ నవల డిటెక్టివ్‌కు అనుసరణ.  రెండింటి లోని కొన్ని పాత్రలను తీసుకుని మార్పు చేర్పులతో చక్రపాణి .. పింగళి అద్భుతమైన స్క్రిప్ట్ సమకూర్చారు.

భానుమతి మిస్ అయిన పాత్రను సావిత్రి అద్భుతంగా చేసింది. భానుమతి తర్వాత సావిత్రిని అభినందించారు.  ఇదే సినిమాను తమిళంలో మిస్సియమ్మ పేరుతో తీశారు. ఇందులోనూ సావిత్రే ముఖ్య పాత్ర పోషించింది.ఏవీఎమ్ వారు ఈ చిత్రాన్ని హిందీలో మీనాకుమారి మేరి పాత్ర పోషించగా “మిస్ మేరి” పేరుతో  నిర్మించారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్. ఇదే కథను తిరగేసి మరగేసి ముళ్ళపూడి .. రావికొండల రావు రాయగా బాపు ‘పెళ్ళిపుస్తకం’ గా తీశారు. అది కూడా హిట్ అయింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!