ఏకలవ్యుడి తాండవ నృత్యం !

Sharing is Caring...

ఏకలవ్యుడి  సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ . దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట.

రాదు .. లేదు ..కాదు ..తెలీదు వంటి పదాలు కృష్ణ డిక్షనరీ లో లేవు. వెంటనే నృత్య దర్శకుడు శ్రీను ను పిలిపించి ఇంటి దగ్గర మూడు రోజులు ప్రాక్టీస్ చేశారట కృష్ణ. ఈ కథ కృష్ణ కు బాగా నచ్చింది కాబట్టి కొంచెం కష్టమైనా ఇష్టపడి నేర్చుకున్నారు. 

మామూలుగా తాండవ నృత్యం చేయడం అంత సులభమైన విషయం కాదు.శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో చేయాలి. ఆవేశం అది ముఖంలో కనిపించాలి.  సినిమాలో ఈ నృత్యాన్ని పేరిణి రీతిలో చిత్రీకరించారు. పేరిణి తాండవ శైలికి సంబంధించింది.

తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడం అంటారు. లయ విన్యాసాన్నితెలియ జేస్తూ … భావప్రకటనకు అనువైన భంగిమ గల నృత్యంతో ప్రారంభమై ఆంగికాభినయం తో ముగుస్తుంది.  కృష్ణ క్లాసికల్ డాన్సర్  కాకపోయినా ఏకాసంధాగ్రాహి .. డైలాగులు కూడా ఒక సారి చూసి టక టకా చెప్పేస్తారు. అదే రీతిలో నృత్యభంగిమలను ఆకళింపు చేసుకుని డాన్స్ మాస్టారు శీను చెప్పిన రీతిలో …… అదరగొట్టేలా చేశారు.

అభిమానులు థియేటర్లో ఆపాట చూసి పులకించిపోయారు. కృష్ణ హావభావాలు .. ముఖకవళికలు .. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఏకలవ్య కృష్ణ కేరీర్ లో ప్రత్యేక సినిమా అయింది.

“మ్రోగింది ఢమరుకం…మేల్కొంది హిమనగం ”  అంటూ సాగే ఈ నృత్యగీతాన్నీ మల్లెమాల రాశారు. చిత్రం ప్రారంభంలోనే ఈ తాండవ నృత్య సన్నివేశం వస్తుంది.  దర్శకుడు విజయారెడ్డి ఈ పాటను అద్భుతంగా తెరపైకి ఎక్కించారు. మామ మహదేవన్ అందించిన బాణీలో బాలు తన గాత్రాన్ని అందించారు.

అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ అది.కృష్ణ అభిమానులకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి. అప్పట్లో ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. చదువురాని బోయవాడు తాండవ నృత్యం చేయడం ఏమిటి ? పెద్ద గ్రాంథిక పదాలతో మాట్లాడటం సహజంగా లేదనేది ఆ విమర్శల సారాంశం. అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదు. సినిమా అంటేనే కల్పితం కాబట్టి ఆ మాత్రం రంగులు హంగులు ఉంటాయి.  ఈ సినిమా సెకండ్ రన్ లో కూడా బాగానే ఆడింది.

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!