ఎంపీటీసీ , జడ్పిటీసీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీ శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళింది. వెళుతుంది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో పరాజయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు దూరం గా ఉన్నట్టు ఓటర్లు. కార్యకర్తలు భావించే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నాయకులే అంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి.
ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోరాడుతూనే ఉండాలని ,అపుడే క్యాడర్ ను నిలబెట్టుకోగలమని అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి,యనమల, కూన రవికుమార్ తదితర నేతలు బాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం బహిష్కరణ నిర్ణయం కరెక్ట్ అన్న రీతిలో మాట్లాడారట. చంద్ర బాబు అధికారంలో లేని సమయంలో కూడా పార్టీని పదేళ్ల పాటు నడిపించారు. ఎన్నికల్లో పోటీ చేశారు. అదేసమయంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ పోటీ చేసింది. తెలంగాణ ఉద్యమం తీవ్రం గా ఉన్న సమయంలో కూడా పలు చోట్ల పార్టీ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. గెలుపోటములు ఎన్నికల్లో సహజం. సామర్థ్యం ఉన్న పార్టీ .. మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఇలాంటి రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నది. ఎవరు సలహా ఇచ్చారో అర్ధంకాక పార్టీ శ్రేణులు తికమక పడుతున్నాయి.
పార్టీ శ్రేణులు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో ఉండాలి. లేకపోతే అధికార పార్టీ వారిని ఆకర్షించే ప్రమాదం కూడా ఉంది. టీడీపీ కి గ్రామీణ ప్రాంతాల్లో మంచి బలం ఉంది. ఆ బలాన్ని నిలబెట్టుకునే ప్రక్రియ నుంచి తప్పుకుంటే పార్టీ ఇంకా బలహీన పడే అవకాశాలు పెరుగుతాయి. గ్రామసీమల్లో పట్టు పోకుండా ఉండాలంటే ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో పాల్గొనడం అవసరం. ఇక కొత్త ఎన్నికల కమీషనర్ పై విమర్శలు చేసి ప్రయోజనం లేదు. అంతకు ముందు కమీషనర్ లాగానే ఈమె కూడా ప్రభుత్వంలో పనిచేసి వచ్చింది. నిమ్మగడ్డ కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు కదా. కమీషనర్ తప్పులుంటే వాటిని సరి జేసే విధంగా పోరాడాలి అంతే కానీ బహిష్కరణ మంత్రం సరి కాదు. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న పార్టీ శ్రేణులు తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయం తో మరింత డీలా పడ్డాయి.
జయలలిత, జ్యోతిబసు ఎన్నికలను బహిష్కరించారని చెప్పడం బాగానే ఉంది కానీ నాడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వేరు. వాటికి ఇప్పటి పరిస్థితులకు పోలికే లేదు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. జమిలి ఎన్నికలు వచ్చే సూచనలు లేవు. మరి అప్పటి దాకా క్యాడర్ ను నిలుపుకోలేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. పని చేయని నాయకులను పక్కన బెట్టి .. కొత్త నేతలకు అవకాశం ఇచ్చి .. పార్టీ ని కొత్త పుంత తొక్కించాల్సింది పోయి పార్టీ బహిష్కరణ మంత్రం జపించడం సరికాదు అని ఒక తెలుగు దేశం నాయకుడు చెప్పారు. కాగా ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్న నాయకులు ఏమి చేయాలి ? ప్రచారం చేసుకోవాలా ?అక్కర్లేదా ? ఈ విషయం పై క్లారిటీ లేక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు నిర్ణయం సరి కాదేమో ..ఇపుడు పోటీ చేయలేమంటే 2024 లో చేయగలరా ? గ్రామసీమల్లో పార్టీ క్యాడర్ అప్పటి దాకా నిలుస్తుందా ?ఇవన్నీ కొత్త సందేహాలు.