Failure political party ………………………………………
శరత్ కుమార్ సినిమా పరిశ్రమలోకి రాకముందు స్టూడెంట్ గా ఉన్నదశలో ‘ బాడీబిల్డర్’ గా గుర్తింపు పొందారు. 1974లో “మిస్టర్ మద్రాస్ యూనివర్శిటీ” బిరుదును సంపాదించారు. కొన్నాళ్ళు బెంగళూరు లో తమిళ వార్తాపత్రిక దినకరన్ మార్కెటింగ్ విభాగంలో సైకిల్ బాయ్‌గా చేసాడు.గ్రాడ్యుయేట్ అయ్యాక అదే పత్రికలో రిపోర్టర్ గా చేశారు.
కొన్నాళ్ల తర్వాత చెన్నై వచ్చి ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం ప్రారంభించారు. 1986లో ‘సమాజంలో స్త్రీ ‘అనే తెలుగు సినిమాలో తొలిసారిగా నటించారు.. ఆ తర్వాత కొన్నిసహాయ పాత్రల్లో గుర్తింపు పొంది హీరో స్థాయికి ఎదిగారు. ఇటు తెలుగు అటు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. శరత్ కుమార్ 1996 సంవత్సరంలో డిఎంకె పార్టీలో చేరారు.
1998 పార్లమెంటు ఎన్నికల సమయంలో డిఎంకె ఆయనను తిరునల్వేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టింది. కానీ శరత్ కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2002లో డీఎంకే ఆయనను రాజ్యసభ కు పంపింది.. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరత్ డిఎంకె ను విడిచిపెట్టారు.
శరత్ తన భార్య రాధికతో కలిసి ఏఐఏడీఎంకేలో చేరి ఆ పార్టీ తరపున జోరుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన భార్య రాధిక ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని పార్టీ అధినేత్రి జయలలిత సస్పెండ్ చేశారు. 31 ఆగస్టు 2007న, శరత్ కుమార్ ‘అఖిల భారత సమతువ మక్కల్ కట్చి’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు .
తమిళనాడులో కామరాజ నాడార్ పాలనను తిరిగి తీసుకు వస్తానని ప్రతిజ్ఞ చేశారు. శరత్ కూడా నాడార్ సామాజిక వర్గానికి చెందినవారే. 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరత్‌కుమార్ అన్నాడీఎంకే కూటమిలో చేరారు. ఆయన పార్టీకి జయ రెండు సీట్లు కేటాయించారు.తెన్కాసి నుంచి శరత్ కుమార్, నంగునేరి నుంచి మరో అభ్యర్థి గెలుపొందారు.
2016 అసెంబ్లీ ఎన్నికలలో శరత్ కుమార్ తిరుచెందూర్ నియోజకవర్గం నుండి డీ ఎంకే అభ్యర్థి అనిత రాధాకృష్ణన్ చేతిలో ఓడిపోయారు. ఇక 2021 ఎన్నికల్లో శరత్ పార్టీ కమల్ పార్టీ కూటమిలో చేరింది.37 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటులో కూడా గెలవలేదు.
కమల్ పార్టీ కూడా ఒక్క సీటులో గెలవ లేకపోయింది. కమల్ కూడా ఓడిపోయారు. శరత్ కుమార్ అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. నటుడిగా ఆయనను తమిళనాడు ప్రజలు ఆదరించారు కానీ రాజకీయ నేతగా తిరస్కరించారు.శరత్ కుమార్ కి రాజకీయంగా స్థిరత్వం లేదని ..పదేపదే పార్టీలు మారారనే విమర్శలున్నాయి.
——-KNM