తాలిబన్ల ఆదాయం వేల కోట్లలో ?

Sharing is Caring...

How they become financially strong……………………………….

ఆఫ్ఘనిస్థాన్ 2001 లో అమెరికా నియంత్రణలోకి వెళ్ళాక తాలిబన్లు తమ ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. తద్వారా ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుని కొత్త మిలిటెంట్లను చేర్చుకుని శిక్షణ ఇస్తూ శక్తివంతంగా మారారు.

ఈ ఆదాయ వనరుల పెంపుదలకు దివంగత తాలిబన్ నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ కృషి చేశారని అంటారు. మార్చి 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాలిబాన్ల ఆదాయం 1.6 బిలియన్ డాలర్లు అని అంచనా.

ఈ మొత్తం సొమ్మును వివిధ మార్గాల ద్వారా తాలిబన్లు ఆర్జించారు. ప్రధానం గా నల్లమందు అమ్మకాలపై తాలిబన్లు దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో నల్లమందు తయారీలో వాడే గసగసాల సాగు ను పెద్ద ఎత్తున చేపట్టారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్  ప్రకారం 2020 తో ముగిసిన ఐదు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా నల్లమందు ఉత్పత్తిలో ఆఫ్ఘనిస్తాన్ వాటా దాదాపు 84% మేరకు ఉంది.

చాలా పకడ్బందీ గా నల్లమందు సరఫరాను తాలిబన్లు నిర్వహించారు. రైతులను … వ్యాపారులను అనుకూలంగా మార్చుకుని ఉత్పత్తిని దేశం నుంచి ఇతర దేశాలకు తరలించేవారు. తద్వారా ఏటా మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించేవారు. 

అలాగే ఆఫ్ఘనిస్తాన్‌లో పర్వత ప్రాంతాల్లో మైనింగ్ కీలకమైన వ్యాపారం. ఇనుము, పాలరాయి, రాగి, బంగారం, జింక్,ఇతర లోహాలు అక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఈ అపార ఖనిజ సంపద తాలిబాన్‌లకు లాభదాయకమైన వ్యాపారం గా మారింది. ఈ ఖనిజ వెలికితీత కార్యకలాపాలు కొనసాగటానికి తాలిబన్లు కంపెనీల నుంచి సొమ్ము వసూలు చేసేవారు.చెల్లించని వారిని భయపెట్టే వారు. ఆవిధంగా వందల మిలియన్ డాలర్ల ఆదాయం గడించారు.

తమ నియంత్రణలోని ప్రాంతంలో ప్రభుత్వం మాదిరిగానే పన్నులు వసూలు చేసే వారు. మైనింగ్,మీడియా,టెలికమ్యూనికేషన్‌, అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మించే నిర్మాణ కంపెనీలు పన్నులు తప్పనిసరిగా పన్ను కట్టాల్సిందే. ఎవరికి మినహాయింపు ఇచ్చేవారు కాదు. హైవే ప్రయాణానికి కూడా డ్రైవర్‌ల నుంచి ఛార్జీ వసూలు చేసేవారు. వ్యాపారం చేసే హక్కు కోసం దుకాణదారుల నుంచి కూడా రుసుము సేకరించేవారు.

రైతు పండించిన పంటపై 10 శాతం పన్ను  … జకాత్ పేరిట 2.5% సంపద పన్నులు కూడా వసూలు చేసేవారు. ధార్మిక విరాళాలు కూడా పెద్ద ఎత్తున అందేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ దాతలు,  అంతర్జాతీయ సంస్థల నుండి తాలిబాన్లకు  రహస్య ఆర్థిక సహకారం అందుతున్నది. పర్షియన్ గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రైవేట్ ట్రస్టుల నుండి పెద్ద ఎత్తున విరాళాలు వస్తుంటాయి.ఈ ప్రాంతంలో మతపరమైన తిరుగుబాటుకు సానుభూతి ఉంటుంది.

ఇంకా సౌదీ అరేబియా,పాకిస్తాన్, ఇరాన్, కొన్ని పర్షియన్ గల్ఫ్ దేశాల పౌరులు కూడా తాలిబాన్లకు ఆర్థిక సహాయం చేశారు .. చేస్తున్నారు.తాలిబన్ అనుబంధ  సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌కు ఏటా మరో 60 మిలియన్ డాలర్లు అందుతాయని అమెరికా ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కాగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం అక్రమ సొమ్మును లాండరింగ్ చేయడానికి తాలిబాన్లు ప్రత్యేక సంస్థలను నిర్వహించారు. తద్వారా కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది.

మొత్తం మీద వివిధ మార్గాల ద్వారా సంవత్సరానికి 500 మిలియన్ డాలర్లను తాలిబన్ ఉగ్రవాద సంస్థ గడించిందని అంచనా. అలా గత 20 సంవత్సరాలలో తాలిబన్లు పెద్ద ఎత్తున సంపదను పోగేశారు. ఈ మొత్తాన్ని తిరుగుబాటు కార్యకలాపాలపై వెచ్చించారు. ఆఫ్ఘన్ పాలకులు కానీ అమెరికా కానీ తాలిబన్ల ఆదాయ మూలాల పై దృష్టి పెట్ట లేదు. ఆ కారణంగానే తాలిబన్లు బలోపేతమై అమెరికా నిష్క్రమణ తర్వాత దేశాన్ని ఆక్రమించారు.

———–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!