ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఈ చెరుకు సుధాకర్ !

Sharing is Caring...

తెలంగాణ లో డాక్టర్ చెరుకు సుధాకర్ పేరు తెలియని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణ ఉద్యమ సారథుల్లో ఆయన ప్రముఖుడు. బాల్యం నుంచే సుధాకర్ పోరాటాల బాట పట్టారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ డబ్బుల  కోసం ఆయన ఏనాడు పని చేయలేదు.

బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం ఉద్యమ బాటలో పయనించారు. బహుజన తెలంగాణా కోసం మొదటి నుంచి కష్టాలను,నష్టాలను తట్టుకుని పోరాటం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకునిగా పార్టీ ని జనంలోకి తీసుకెళ్తూ మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.  

చెరుకు సుధాకర్  స్వగ్రామం .. నల్గొండ జిల్లా చిట్యాలమండలం గుండ్రంపల్లె.  తెలంగాణ పోరాట యోధుడు, విప్లవ కవి, వక్త ఉషా గౌడ్,హంసమ్మ దంపతులకు ఆయన జన్మించారు. విప్లవ భావాలున్న ఉషాగౌడ్ సుద్దాల హన్మంతు ,రావి భారతి వంటి నాయకులతో కలసి పని చేశారు. ప్రజల్లో చైతన్యం కోసం సభలు సమావేశాలు నిర్వహించేవారు.

ఒక వైపు కులవృత్తి కల్లు కాంట్రాక్టు పనులు చేస్తూనే, మరోవైపు  వ్యవసాయం కూడా చేసేవారు. సుధాకర్ బాల్యమంతా తాతగారింట్లో గడచింది. తొమ్మిదో తరగతి వరకు మిర్యాలగూడ లో, పదోతరగతి సూర్యాపేటలో చదివారు. తండ్రి ఉషాగౌడ్ రామన్నపేట జూనియర్ కళాశాల స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా చేయగా….  సుధాకర్ సూర్యాపేట జూనియర్ కళాశాల ఎస్ ఎఫ్ ప్రెసిడెంట్ గా చేయడం విశేషం. ఆ తర్వాత పై చదువులకోసం హైదరాబాద్ కొచ్చారు.

చార్మినార్ లోని నానక్ రామ్ భగవాన్ దాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివేరు. బీఎస్సీ హానర్స్ న్యూ సైన్స్ న్సకళాశాల లో చదువుకున్నారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో చేరి ఎండీ చేశారు. పాఠశాల దశ నుంచే అయన విద్యార్థి నాయకుడిగా ఎదిగారు.  హైదరాబాద్ లో ఎక్కువగా ఉండటం వలన వరవరరావు వంటి విప్లవ నాయకుల ప్రసంగాలు విని ఉద్యమాల పట్ల ఆకర్షితులైనారు.

తండ్రి విప్లవభావాలు సుధాకర్ ను పోరుబాట పట్టించాయి. 1980 తర్వాత చదువుకుంటూనే పార్సీ గుట్టలో పీపుల్స్ క్లినిక్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యసేవలు అందించేవారు. అక్కడనుంచి చండ్రపుల్లారెడ్డి పై అభిమానంతో రసూల్ పురా లో ఏడేళ్ల పాటు మరో క్లినిక్ నడిపారు. 91 లో డాక్టర్ కోట్నిస్ ఆరోగ్య సేవాసంస్థ ఆధ్వర్యంలో తల్లి హంసమ్మ పేరిట నకిరేకల్ లో ఒక ఆసుపత్రిని ప్రారంభించి ఇప్పటికి నడుపుతున్నారు. ప్రతి రోజు నిరసనలు, పోరాట కార్యక్రమాలు ఎన్ని ఉన్నా..   అంతరాయం లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

తెలంగాణా మలిదశ పోరాటం లో సుధాకర్ దూసుకుపోయారు. తెరాస అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు సుధాకర్ ఆపార్టీలో చేరారు. 2003 నుంచి 2014 వరకు 11 ఏళ్లపాటు ఒంటి చేత్తో నల్గొండలో ఉద్యమం నడిపారు. ఉద్యమ గళాన్ని గల్లీనుంచి ఢిల్లీ వరకు వినిపించారు. పార్టీ  సూచించిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించారు. ఉద్యమ సమయంలో సుధాకర్ పై అప్పటి సర్కార్ ఎన్నో కేసులు బనాయించింది.

ఒక దశలో పీడీ యాక్ట్ కింద నిర్బందించారు. దాంతో రాష్ట్రమంతా అట్టుడికింది.కూతురి పెళ్లి సమయంలో కేవలం రెండురోజులు  ముందు అయన జైలు నుంచి విడుదలఅయ్యారు.  కేసీఆర్ కంటే ముందు సుధాకర్ 97 లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకత గురించి రామాయం పేట, నిర్మల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ప్రభుత్వ వేధింపులకు వెరవక … కేసులకు జడవక …  ప్రాణాలకు తెగించి … ప్రత్యేక తెలంగాణః కోసం కృషి చేస్తే తెరాస అధిష్టానం సుధాకర్ కు 2014 లో అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదు.

సుధాకర్ కే  కాదు..  నిజాయితీ తో ..ఉద్యమం కోసం పనిచేసిన  చాలామందికి  టికెట్లు ఇవ్వలేదు. దాంతో సుధాకర్ తెరాస నుంచి బయటి కొచ్చారు. నాటి ఎన్నికల్లో బీజేపీ తరపున సుధాకర్ సతీమణి శ్రీమతి లక్ష్మి నకిరేకల్ స్థానం నుంచి పోటీ చేశారు. కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత సుధాకర్ బహుజన తెలంగాణ కోసం పోరాడారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు.

2017 లో తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు తెలంగాణా ఇంటి పార్టీ ని సుధాకర్ ప్రారంభించారు. ఒక వైపు అన్ని జిల్లాలలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.మరోవైపు బీసీల అభ్యన్నతి కోసం అహరహం శ్రమిస్తున్నారు. 

ఉద్యమ కారుల, అమరుల సమిష్టి కృషి ఫలితాన్ని ఓ కుటుంబం , ఓ వర్గం కైవసం చేసుకున్నాయని సుధాకర్ వాదన. ఈ వాదన తో ఏకీభవించే వారినందరిని ఒక వేదికపైకి తీసుకు రావడానికి ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చెరుకు సుధాకర్ 2021 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించ లేకపోయారు 

————K.N.MURTHY

post updated on 21-2-2022

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!