సుబ్బారావు ‘బొబ్బట్ల’ రుచే వేరు గురూ !!

Sharing is Caring...

Subbu Rv ………………..

చేసే పని నిబద్ధత, బాధ్యతతో చేస్తే అదే పని మన అస్థిత్వంగా మారుతుంది. రోజుకోసారి పెరిగే ధరలతో పూటకో చోట కల్తీ కల్తీ అని వినిపించే తరుణంలో తాము నమ్మిన నాణ్యతకు కట్టుబడి వ్యాపార జీవనాన్ని సాగించడం ఈ రోజుల్లో కష్టతరమే. కానీ అది అసాధ్యం కాదని నిరూపించే కొందరు నిత్యం తారసపడుతుంటారు.

పిఠాపురంలో ఉన్నానంటే ‘సుబ్బారావు బొబ్బట్లు తిన్నావా’ అని అడిగాడో స్నేహితుడు. నేను విడిగా అక్కడక్కడ తిన్నవి చెప్తే ‘నువ్వు వెంటనే వెళ్ళి ఒక్క బొబ్బట్టు తిని అప్పుడు మాట్లాడురా’ అని ఫోన్ పెట్టేసాడు. మమ్మల్ని అటు ఇటు తిప్పుతున్న ఆటో డ్రైవర్ కూడా బొబ్బట్లు తిన్నారా అని అడిగి ‘పిఠాపురం వచ్చి అవి తినలేక పోతే మీరు చాలా మిస్సయినట్టే’ అంటూ హోటల్ రూమ్ దగ్గర దించారు.

నేను ఉంటున్న హోటల్ ఓనర్ కూడా నార్త్ నుండి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ ‘సుబ్బారావు బొబ్బట్లు.. యు మస్ట్ టేస్ట్ ఇట్’ అంటూ ఊరిస్తున్నాడు. ఏంటండీ అంత ప్రత్యేకత అనడిగితే ‘తప్పకుండా తినాలి’ అంటూ మరింత ఆసక్తిని కలిగించారు. ఇన్ని విన్నాక తినకుండా పోతే జన్మల పాపమే అన్నట్లు సాయంత్రం ఏడున్నరకు వెతుక్కుంటూ పోయాను.

ప్రత్యేకంగా అడ్రెస్ అవసరం లేని చిరునామా అది. ఎక్కడ అడిగినా సరాసరి ఇటెల్లండి అంటూ వేలు చూపిస్తుంటే ఓ చోట జన సందోహానికి ఆగాను. గుంపు గుంపుగా వున్నారు. పెనం మీద కాలుతున్న నేతి తీపి వాసన పీలుస్తూ అరడజను బొబ్బట్లు, మినపట్లు చెప్పాక అక్కడ జరిగే కళాత్మకత నన్ను ఆకర్షించింది.

నాలాగే వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు కూడా క్యూ కట్టి వున్నారు. రికమండేషన్స్ అనేవి కష్టమే అనిపించింది ఆ జనవాహిని చూస్తే. ఒకటి రెండు చెప్పేవారు తక్కువ అందరినోట నాలుగు, ఐదు, ఆరు, పదంటూ పోటీగా వినిపిస్తున్నాయి.ఐదు నిమిషాల తరువాత బొబ్బట్లు లేవండి అయిపోయాయి అన్నారు.

అప్పుడే ఇంకా ఎనిమిది కూడా కాలేదంటూ ఆశ్చర్యంతో కొందరు అడుగుతుంటే ఈరోజు ఇంకా గంట ఎక్కువసేపు వచ్చాయి. ఏడు గంటలకే అంతా అయిపోతుందని అన్నారు. ఇప్పుడు నాకు అరడజను బొబ్బట్లు దొరకడం ఆ శ్రీపాద వల్లభుని దయేనని నా పక్కనున్న అతను పెద్ద కితాబు ఇచ్చేసాడు. బహుశా నా పొడవాటి జుట్టు కాస్త రికమెండ్ చేసిందేమో ఆ రూపంగా. 

అందరూ చెప్తుంటే వెళ్ళి తినేస్తే సరి అనుకున్నాను గానీ ఇక్కడ తినాలంటే పోటీ పడాలని, అందునా నేను తీరికగా వచ్చిన సమయానికి దొరకడమంటే నక్కతోక తొక్కినట్టేనని అర్థమైంది.

యాభై ఐదేళ్ళ క్రితం మొదలైన సుబ్బారావు గారి వ్యాపారానికి ఆయన పేరే బ్రాండ్ గా మారింది. ఎక్కడా ఓ చిన్నపాటి బోర్డ్ లేదా గోడ మీద పేరు గానీ రాసి ఉండదు. ఎప్పుడైతే మనం చేసే పని మాట్లాడటం మొదలవుతుందో అప్పుడు ప్రత్యేకంగా నువ్వేమీ చెప్పాల్సిన, చెప్పుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు ఆయన కొడుకు గురుస్వామి గారు నడుపుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆ రుచిని, నాణ్యతను అలాగే పట్టుకొస్తున్నారు.

అమృతం మన కోసం అనేక రూపాల్లో దొరుకుతుంది. అలా ఓ రకంగా ఇలా బొబ్బట్టు రూపంలో కూడా అమృతం తినేయొచ్చు. నేను చాలా చోట్ల బొబ్బట్లు తిన్నాను కానీ ఈయన చేస్తున్న విధానం, చేతి వేగం, కాల్చుతున్న పద్ధతి, వస్తున్న నేతి వాసనకు ఆర్డర్ చెప్పిన అరడజను మొత్తం నేనే తింటానేమో అనిపించింది.

పావలాకు ఒక బొబ్బట్టుగా మొదలై సంవత్సరానికి సరాసరి అర్థరూపాయి చొప్పున పెరుగుతూ నేడు ఇరవై రూపాయలకు చేరింది. నిజానికి ఈ ఇరవై చాలా చవకనే చెప్పాలి. మరి ఆ క్వాలిటీ, క్వాంటిటీ అటువంటిది. అక్కడ ఒక బొబ్బట్టు బయట నాలుగు బొబ్బట్లతో సమానం మరి.

శనగపప్పు, మైదా, చక్కెర, యాలుకలు ఈ నాలుగింటితో మీ జిహ్వ జివ్వుమ్మంటుంది. శనగపప్పు ఉడికించి రుబ్బి పాకానికి కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుంటారు. ఈ తయారీకి  రుబ్బురోలే వాడుతున్నారని చెప్తారు. కొన్నిసార్లు రుచికి మూలమెక్కడో దాగి ఉంటుంది. అందుకే తయారీ ప్రక్రియే నిజమైన రహస్యం అంటారు పాకశాల ఉద్ధండులు.

శనగపప్పు మిశ్రమాన్ని ఉండగా చేసుకుని పల్చగా జిగటగా కలుపుకున్న మైదా పిండి పూత చేర్చి అరచేయి పట్టే పూర్ణంగా చేసి నెరిపి అడ్డాకు సాయంతో కాలుతున్న పెనం మీద వేస్తారు. పూర్ణానికి వాడే పూత పిండి మినప అనుకోండి. మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఏడు లేదా ఎనిమిది గంటల వరకు మాత్రమే బండి పెడతారు. చుట్టూ వంద గ్రామాలకు ఈ బొబ్బట్ల నేతి ఘుమఘుమలు తాకుతూనే ఉంటాయి.

ఈ బొబ్బట్లు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి కాబట్టి ఎగుమతి కూడా అవుతుంటాయి. బొబ్బట్లతో పాటుగా ఇక్కడ మినపట్టు కూడా ఓ పట్టు పట్టాల్సిందే. కొందరు దీన్నే ఊతప్పం అని కూడా అంటారు. నిజానికి ఊతప్పం వేరు. ఈ మినపట్టుకి ఎర్రని ఉల్లి చెట్నీ ఇస్తారు. ఒక బొబ్బట్టు, ఒక మినపట్టు తిన్నారంటే మీ పొట్ట నిండిపోతుంది. తెల్లారేదాకా ఆకలే తెలీదు. అగచాట్లలో ఉన్న జిహ్వకి బడ్జెట్లో దొరికే ఔషధం ఈ బొబ్బట్టు, మినపట్టు.

తాము చేస్తున్న పనిలో పాటించే ప్రామాణికాలే ఇవాళ వారి పేరుకు మూలాలు. ఆ చిన్న బండి ద్వారా తండ్రి నుండి రుచినే కాదు వారి వారసత్వ సామాజిక బాధ్యతను కూడా గురుస్వామి గారు తీసుకున్నారు. మనం ఎప్పుడైతే అధిక ధనం కోసం ప్రాకులాడుతామో అప్పుడు మన పనిలో నాణ్యత, ప్రామాణికాలు మరుగున పడతాయి. పది మంది కొనే ఆహారం మనకు భుక్తిగా మారింది. అది విక్రయించుకుంటూ పది రూపాయలు పోగు చేసుకుని బ్రతుకుతాము.

“ఈరోజు యాభై ఏళ్ల నుండి సంపాదించుకుంది మా నాన్న పేరు, పిఠాపురం పేరుతో పాటు గుర్తొచ్చే మా రుచి, నాణ్యత ఇంతకన్నా మేము పొందాల్సినది లేదు. అందుకే చిన్న పనైనా సరే అందులో మనం పాటించే ప్రామాణికాలు కాలంతో పాటు నిలబెడుతాయి. వినియోగదారుడి సంతృప్తే వ్యాపారి ఎదుగుదల. చిన్నదో పెద్దదో సొంత కాళ్ళమీద నిలబడితే చేసే పని తప్పక గౌరవాన్ని కల్పిస్తుంది.”అంటున్నారు గురు స్వామి గారు.  మీరు పిఠాపురం వెళితే తప్పక సుబ్బారావు బొబ్బట్లను రుచి చూడండి. 
గురుస్వామి – 7416309208

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!