ఆకట్టుకునే ‘ఎడారి బ్రతుకులు’ !!

Sharing is Caring...

Pudota Showreelu ……………………………..

ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ .. టైటిల్ వెరైటీ గా ఉందికదా.. సినిమా కూడా అదే రీతిలో సాగుతుంది.
ఇది రాజస్థానీ చిత్రం.. ఎడారి నేపథ్యంలో అనూప్ సింగ్ ఈ చిత్ర కథను తయారు చేసుకుని దర్శకత్వం వహించాడు. అనూప్ సింగ్ గతంలో తీసిన ‘ది నేమ్ ఆఫ్ రివర్’,’క్విస్సా’ చిత్రాలు.. ప్రేక్షకుల ప్రశంసలతోపాటు అవార్డులు సాధించాయి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఆగస్టు 2017 లో స్విట్జర్లాండ్‌ లో జరిగిన 70 వ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ షో గా ప్రదర్శితమైంది. అదే సమయంలో స్విస్,ఫ్రెంచ్,సింగపూర్ దేశాల భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది.సుమారు రెండు గంటలు(119.. ని.) నడిచే ఈ సినిమా మనదేశంలో 2023 ఏప్రిల్లో  విడుదలైంది.

కథ విషయానికొస్తే హీరోయిన్ నూరన్( ఫర్హాని.ఇరానియన్,ఫ్రెంచ్ నటి) తన అమ్మమ్మ తో( వహీదా రెహమాన్) కలిసి థార్ ఎడారుల్లో ఉన్న ఒక గిరిజన గ్రామం లో నివసిస్తూ ఉంటుంది. ఎడారి ట్రైబల్ తెగకు చెందిన వీరు,ఎడారుల్లో వుండే విష పూరితమైన తేళ్ళు,పాములు,ఇతర పురుగులు కుట్టినప్పుడు వారిని తమ తరతరాల సాంప్రదాయ మూలికావైద్యంతో ప్రాణాపాయం నుండి కాపాడుతూ ఉంటారు.

వారు మూలికల పసరు తేలు కుట్టిన చోట రాస్తూ,నాడిని పరీక్షిస్తూ,శ్రావ్యమైన తమ గొంతు తో ఎడారి పాటలు పాడుతూ వుంటారు. మూలికలు,ఆ పాటల ప్రభావంతో రోగి విషవిముక్తుడై ప్రశాంతంగా నిద్రపోతాడు.రోగి బంధువులు సంతోషంతో ఇచ్చిన తృణమో,ఫణమో తీసుకుంటారు. నూరన్,తన అమ్మమ్మ నుండి ఈ వైద్యవృత్తిలో మెలకువలు నేర్చుకుంటుంది.

రాత్రుల్లో ఆ ఇసుక తిన్నెల మీద నిలబడి, గొంతెత్తి నూరన్ ఆలపించే ఆ ఎడారి గీతాలు,ఎడారంతా ప్రతిధ్వనిస్తూ,అక్కడివారిని సమ్మోహితులను చేస్తుంటాయి.నూరన్ తన స్నేహితురాలు మున్నీ తోనూ,తనను ఎంతో ప్రేమించే అమ్మమ్మ తో కలిసి,జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది.

హీరో ఆదం ( ఇర్ఫాన్ ఖాన్) ఒంటెల వ్యాపారి.థార్ ఎడారిలో ఒంటెల క్రయవిక్రయాలు చేస్తూ ఉంటాడు.అతను ఎలాంటి సంకోచాలు లేకుండా ఎడారుల్లో స్వేచ్ఛగా తిరిగే నూరన్ పాటలు వింటూ,ఆమెను గమనిస్తూ ఉంటారు.ఆమెతో చూపులు,మాటలు కలపాలని,ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని చూస్తూ ఉంటారు.కానీ నూరన్ ఇవేమీ పట్టించుకోదు.

రెండు ముఖాలు( స్వభావాలు) కలిగిన ఆదమ్, నూరన్ పై ప్రేమను నటిస్తూ,సమయం కోసం వేచి చూస్తుంటాడు. ఒక రాత్రివేళ,ఒక పిల్లవాడి పిలుపుతో, తేలు కుట్టిన అతని అన్నను కాపాడటానికి నూరన్ ఒంటరిగా వెళుతుంది..లాంతరు వెలుగులో,ముందువెనుక ఆలోచించకుండా, అమ్మమ్మ మాట కూడా వినకుండా,ఆ ఇసుక తిన్నెల్లో పడి వేగంగా వెళ్తుంది.

అక్కడ ఆదమ్ పన్నిన ఉచ్చులో చిక్కు కుంటుంది.అది ఆదమ్ పన్నిన ఉచ్చు అని గ్రహించదు.  
అతని ప్రేమను నటన అని తెలుసుకోలేక,ఆ ఉచ్చులో ఇరుక్కుంటుంది.ఆదమ్ నీచబుద్ధి,అతని కుట్ర తెలియక, పర పురుషుని బలత్కారానికి గురై , గర్భిణీ అయిన నూరన్ ఏమి చేసింది? ఎలా ప్రతీకారం తీర్చుకుంది.?

అత్యాచారానికి గురైన తర్వాత మూగబోయిన ఆ గొంతులో మళ్ళీ ఎడారిపాట వినిపించిందా? లేదా? మాయమైపోయిన అమ్మమ్మ ఏమైంది? నూరన్ ప్రతీకారం తీర్చుకోవడం లో ఎడారి తేళ్ళు ఎలా ఉపయోగపడ్డాయి.ఇవన్నీ తెలుసుకోవాలంటే  ఎంతో ఉద్వేగంతో సాగే ఈ సినిమా చూసి తెలుసుకోండి. 

ఫర్హాని, ఇర్ఫాన్ ఖాన్  వారి పాత్రల్లో జీవించారు .. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది,కథ ,సినిమాటోగ్రఫీ. “ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్” థార్ లో ఎలాంటి సెట్టింగులు లేకుండా… సహజంగా తీసిన సినిమా ఇది. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఒక కొత్త లోకాన్ని చూసిన అనుభూతి ఫీలవుతారు. 

విస్తారమైన ఇసుకతిన్నెలు,చీకట్లో వెలిగిపోయే ఆకాశం,నక్షత్రాలు,ఎడారి పల్లెలు,ఒంటెల బేహరులు ఇసుకదిబ్బల్లో వేసే నెగడుల్లో,చీకటి వెలుగుల్లో మెరిసిపోయే బంగారు రంగు ఇసుకదిబ్బల సౌందర్యం, ఎడారి పల్లెలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. 

అక్కడి మనుషుల  అనుబంధాలు,రేయంతా వినిపించే  పాటలు,సంగీతం,నృత్యం,ఒకదాని వెనుక ఒకటి బారులు తీరి వెళ్ళే ఒంటెల సౌందర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మనం చూడని థార్ ఎడారి సౌందర్యాన్ని అంతా ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ పియ ట్రో(Pietro) రాసి పోసి చూపించారు. ఆయన కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. 

ప్రైమ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది. ఎడారి పట్ల వున్న ప్రేమతో త్వరలో థార్ ఎడారిలో పయనించడానికి వెళ్తున్న నాకు, ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో చూసిన ఎడారిని కనులార చూడబోతున్నందుకు ఎంత ఆనందంగా వుందో..!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!