14 వేలకే తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనం!!

Sharing is Caring...

DIVYA DAKSHIN YATRA …………………………………….. 

తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూరింగ్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది.

 8 రోజుల పాటు సాగే ఈ టూర్‌ వివరాలపై ఓ కన్నేయండి.    ఆగస్టు 9న ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు కొనసాగుతుంది.

టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి. ప్రయాణం ఇలా సాగుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయల్దేరుతుంది.రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని మధురైకు పయనమవుతారు.

మూడో రోజు ఉదయం 8 గంటలకు మధురై చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సులో రామేశ్వరం చేరుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వీటి ప్రయాణ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది. ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌లో భోజనం ఉంటుంది. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి. నాలుగో రోజు రామేశ్వరంలో మధ్యాహ్నం భోజనం ముగించుకొని మధురైకు ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని షాపింగ్‌ చేసుకోవచ్చు.

అనంతరం రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారి ప్రయాణమవుతారు. ఐదో రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వివేకానంద రాక్‌ మెమోరియల్‌, గాంధీ మండపం, అందమైన సూర్యాస్తమయాన్ని చూడవచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే భోజనం చేసి సేదతీరాల్సి ఉంటుంది.ఆరో రోజు ఉదయమే కన్యాకుమారి రైల్వేస్టేషన్‌ చేరుకొని తిరువనంతపురం (కొచ్చువేలి) బయల్దేరుతారు. అక్కడే అల్పాహారం ముగించుకుని అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని కోవలం బీచ్‌ అందాలు వీక్షిస్తారు. తిరిగి కొచ్చువేలి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరుచిరాపల్లికి ప్రయాణమవుతారు.

ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. ఉదయం శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని మధ్యాహ్నం భోజనం ముగించుకుంటారు. అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూర్‌ చేరుకొని బృహదీశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం తంజావూర్‌లో సికింద్రాబాద్‌ రైలు ఎక్కుతారు.తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజ్‌ ఛార్జీలు..
ఎకానమీలో ఒక్కో టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.14,300; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.13,300 చెల్లించాలి.స్టాండర్ట్‌లో (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.21,900; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.20,800 చెల్లించాలి.కంఫర్ట్‌లో (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.28,500; 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,100 చెల్లించాలి.

ఫుడ్‌ ఐఆర్‌సీటీసీదే..ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు.ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు. యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం యాత్రీకులు  చెల్లించుకోవాలి. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకునే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

క్యాన్సిలేషన్‌ పాలసీ
ఒక వేళ ఏదైనా కారణం చేత 15 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8-14 రోజుల ముందు క్యాన్సిల్‌ చేసుకుంటే 25 శాతం, 4-7 రోజుల ముందు క్యాన్సిల్‌ చేసుకుంటే 50శాతం మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అయితే ప్రయాణానికి నాలుగు రోజుల ముందు క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!