Women are not interested in contesting elections……………………..
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి .. అవి మండి, హమీర్‌పూర్, కాంగ్రా, సిమ్లా. కాంగ్రా నుంచి బీఎస్పీ నాయకురాలు రేఖ చౌదరి పోటీ చేశారు. ఆమెకు 7753 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద చూస్తే ఆ రాష్ట్రం నుంచి 72 ఏళ్లలో ఎన్నికైంది నలుగురు మహిళలే.
హిమాచల్ ప్రదేశ్ ఓటర్లలో సుమారు 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. గతంలో గెలిచిన ముగ్గురిలో రాజకుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్ ఉన్నారు.ఈ ముగ్గురు కూడా రాజ కుటుంబాలకు చెందినవారు .. మొదటి సారిగా రాజకుటుంబానికి సంబంధం లేని కంగనా రౌనత్ మొన్నటి ఎన్నికల్లో గెలిచి నాలుగో మహిళగా నిలిచారు.
కపుర్తలా రాజకుటుంబానికి చెందిన అమృత్ కౌర్… భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి.. 1952లో మండి నియోజకవర్గం నుండి ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984 వరకు ఏ మహిళకు టిక్కెట్ లభించలేదు. 1984లో, హిమాచల్ ప్రదేశ్‌లోని జోధ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారి హిమాచల్ ప్రదేశ్ కి కోడలుగా వచ్చారు. కాంగ్రా నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు .. అప్పటి ప్రధాని ఇందిర హత్య దరిమిలా వచ్చిన సానుభూతి పవనాలతో ఆమె విజయం సాధించారు.
మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ 1998లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో వీరభద్ర సింగ్ మండి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు,.. 2012లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాజీనామా చేశారు.
2013లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. ఆమె మళ్లీ 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది .. బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ చేతిలో ఓడిపోయింది. ఆయనే 2019 లో మరల గెలిచారు. మార్చి 2021లో రామ్ స్వరూప్ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది .. నాటి ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ మూడోసారి గెలుపొందారు. మూడో సారి గెలిచిన మహిళగా ఆమె కొత్త రికార్డు సృష్టించారు.
2014..లో అమ్ ఆద్మీ పార్టీ కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత బాత్రా ను హమీర్‌పూర్ నుండి పోటీకి నిలబెట్టింది.. అయితే ఆమె కేవలం 15,329 ఓట్లతో ఓడిపోయింది. 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కూడా మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది .. 1967 వరకు ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు.
1977 లో ఒకరు 2022లో ఒక మహిళ మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.మొత్తం మీద రాష్ట్ర అసెంబ్లీకి ఏడుగురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు… అలాగే ఇప్పటివరకు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది మహిళలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఇతర మహిళలు ఎవరు ఎన్నికల బరిలో లేరు.
మొత్తం మీద చూస్తే ..మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తాయి కానీ .. మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో మాత్రం అంత ఆసక్తి చూపడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుష ఓటర్లను మించిపోయింది.. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం మహిళలు ఆసక్తి చూపడం లేదు.