గాత్రంతో నటించిన గాయకుడు!!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………

తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది. ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు.ప్లే బ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం అయింది. మోస్ట్ ఎమోషనల్ సింగర్ సౌందరరాజన్  జ్ఞాపకాలు  పంచుకుందాం.

దైవమా…దైవమా…కంటినే...కంటినే…తనివి తీరా తల్లినే … తెర మీద శివాజీ గణేశన్ పారవశ్యాన్ని తన గళంలో యధాతధంగా పలికించాడు సౌందరరాజన్. కోటీశ్వరుడు సినిమా నేను కాకినాడలో చూశాను. కాకినాడ రెడ్ కాన్వెంటులో ఒకటో తరగతో రెండో తరగతో చదువుతుండగా ఈ సినిమా వచ్చింది. అయినా నాకా పాట అలా గుర్తుండిపోయింది.

సౌందరరాజన్ పాట వింటుంటే..మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. అంత పవర్ ఉన్న గాత్రం ఆయనది. మిళనాడులో ఏ దేవాలయానికైనా వెళ్లండి. భక్తుల్ని పారవశ్యంలో ముంచి తేలుస్తూ సౌందరరాజన్ గానం చేసిన గీతాలే మారుమోగుతూంటాయి. భావాన్ని అర్ధవంతంగా పలకడం దాన్ని వినేవాళ్ల చెవుల్లోకి కాదు హృదయాల్లోకి ఎయిమ్ చేయడం సౌందరరాజన్ స్పెషాల్టీ.

తెలుగులో ఆయన పాడిన ప్రతి సినిమా పాటలోనూ ఆ ఎనర్జీ కనిపిస్తుంది. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నలో ‘చెబితే చాలా ఉంది…వింటే ఎంతో ఉందీ..చెబుతా యినుకోరా..వెంకటసామీ’…అని సౌందరరాజన్ అంటే…మనం వినకుండా ఉన్నామా?

డ్యూయట్లు పాడడంలోనూ అంతే ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తారు సౌందరరాజన్. చాలా యాక్టివ్ అయిపోతారు. ట్రెడిషనల్ లుక్స్ తో కనిపించే సౌందరరాజన్ తో అద్భుతమైన పాటలు పాడించారు ఎమ్.ఎస్.విశ్వనాథన్. కోటీశ్వరుడు సినిమాలోనే ‘నేలపై చుక్కలు చూడు..పట్టపగలొచ్చెను నేడు…ఎంతో వింత’ పాట నిజంగానే ఒక వింత అనుభూతి కలిగిస్తుంది.

తన ప్లేబ్యాక్ ప్రస్థానం లో సౌందరరాజన్ దక్షిణాది అగ్ర హీరోలందరికీ పాడారు. తమిళ హీరోలు ఎమ్.జి.ఆర్, శివాజీ గణేశన్ లతో పాటు తెలుగు హీరోలు ఎన్.టి.ఆర్, అక్కినేని సినిమాల్లోనూ పాడారు. కొన్ని టిపికల్ సాంగ్స్ కోసం సౌందరరాజన్ ను అప్రోచ్ అయ్యేవారు మ్యూజిక్ డైరక్టర్లు. జానపదం తొణికిసలాడే బిగుతైన గీతాలు పాడాలంటే…సౌందర్ రాజన్ ను మించిన వాళ్లు లేరు. కావాలంటే విజయబాపినీడు తీసిన డబ్బు డబ్బు డబ్బు సినిమాలో ‘వెన్నెలవేళ ఇదీ’ అనే గీతం వినండి.

ఇక్కడ చమక్కు ఏమిటంటే … వయసు పిలిచింది సినిమాలో వినిపించే ఇళయరాజా బాణీ మబ్బే మసకేసిందిలే పాటకు దగ్గరగా నడుస్తుంది. సిట్యుయేషన్ కూడా అలాంటిదే. అయితే బాలు పాడిన పాటకన్నా … సౌందర్ రాజన్ పాడిన విధానంలో ఒక సొగసు కనిపిస్తుంది. గమకాలు ఆయన గాత్రంలో గమ్మత్తుగా పలుకుతాయి.

యాభై దశకంలో సినిమా ప్రయాణం ప్రారంభించిన సౌందరరాజన్ తన తొలి పాట సెంట్రల్ స్టూడియోస్ నిర్మించిన కృష్ణ విజయం కోసం పాడారు. ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో ఆ సినిమాలో మొత్తం ఐదు గీతాలు సౌందరరాజనే పాడేశారు. అందులో ఒక పాట మాత్రం యుట్యూబులో దొరుకుతోంది.

అరుణా పిక్చర్స్ తూక్కు తూక్కు సినిమా నుంచి శివాజీ గణేశన్ కు పాడడం ప్రారంభించారు సౌందరరాజన్. శివాజీ ఎమోషన్ ను తన గాత్రంలో అద్భుతంగా క్యారీ చేసేవారు సౌందరరాజన్. అసలు శివాజీయే పాడుతున్నట్టు ఉండేది. ముఖ్యంగా గౌరవం చిత్రంలో ‘బంగారు ఊయలలో పాలు పోసి పెంచానే’…పాట వింటుంటేనే ఒక గగుర్పాటు కలుగుతుంది. అది ఆయన వాయిస్ ప్రత్యేకత.

శివాజీ ఏమిటి ఎమ్.జి.ఆర్ ఏమిటి సౌందరరాజన్ పాడితేనే నటిస్తాం అనే పరిస్ధితి వచ్చేసింది ఓ దశలో. సౌందరరాజన్ పాట పెదాల నుంచి పాడినట్టు ఉండదు. నాభి నుంచి స్వరం వస్తుంది. అది ఆకాశమంత చెలరేగిపోతుంది. చిన్న హమ్ చేస్తేనే చుట్టుపక్కల వాళ్లలో ఒక కదలిక వచ్చేస్తుంది. అంతగా వైబ్రేట్ చేసే స్వరం సౌందరరాజన్ కు ముందుగానీ ఆ తర్వాత గానీ వినిపించలేదు.

ఎమ్మెస్ విశ్వనాథన్ గాత్రంలో కూడా ఈ పద్దతి కనిపిస్తుంది.ఘంటసాల పాడే విధానం అంటే సౌందరరాజన్ కు చాలా ఇష్టం. కవి భావాన్ని సంపూర్తిగా పలికించడమే గాయకుడి విధి అనే విషయం ఘంటసాల నుంచే నేర్చుకున్నాననేవారు సౌందరరాజన్.

విచిత్రంగా సౌందరరాజన్ పాడిన చాలా పాటలు ఘంటసాల తెలుగులో పాడారు. ఇద్దరూ అంతే ఇన్వాల్వ్ మెంట్ తో పాడడం విశేషం. ఆలయమణి తెలుగు వర్షను గుడిగంటలులో ‘జన్మనెత్తితిరా’ … రక్త సంబంధంలో ‘చందురుని మించి’ పాటలు ఇద్దరూ వేరువేరు పద్దతుల్లో పాడి మెప్పించారు.

సౌందరరాజన్ పాడిన తమిళ గీతంలో తమిళ సోయగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే గీతం తెలుగులోకి తెచ్చినప్పుడు దాన్ని పూర్తి తెలుగుదనంతో నింపి ఆడియన్స్ కు అది స్ట్రెయిట్ సాంగ్ అనిపించేలా నడిపేవారు ఘంటసాల. ఆ మేరకు ట్యూన్ లో కూడా తెలుగు సొబగులను ప్రవేశపెట్టేవారాయన. పాశమలర్ లో సౌందరరాజన్ పాడిన పాటకు ఘంటసాల అనువాదం వింటే ఈ విషయం తెల్సిపోతుంది.

ఘంటసాల తెలుగులో పాడిన పాటలూ తమిళ్ లో సౌందరరాజన్ అద్భుతంగా పాడేసేవారు. ప్రేమనగర్, బంగారు బాబు లాంటి చిత్రాలు తెలుగు నుంచి తమిళ్ కు వెళ్లి అద్భుతమైన విజయాలు సాధించాయి. తెలుగులో హైవోల్డేజ్ సాంగ్స్ లో ఒకటి చెప్పుకునే ప్రేమనగర్ చిత్రంలోని ‘ఎవరి కోసం’…పాటను తమిళ్ లో సౌందరరాజన్ తనదైన స్టైల్ లో అదరగొట్టేసారు.

ఇంకో విశేషం ఏమిటంటే…సౌందరరాజన్ కు ఘంటసాల ప్లేబ్యాక్ పాడడం. సర్వర్ సుందరం సినిమాలో ‘నవయువతి’ అనే పాట లో రికార్టింగ్ ధియేటర్ లో కనిపించే గాయకుడు సౌందరరాజనే. డబ్బింగ్ సినిమా కావడంతో తెలుగులో ఘంటసాలతో పాడించారు. ఈ పాట యుట్యూబులో దొరుకుతంది.

సుదీర్ఘమైన తన కెరీర్ లో పదివేలకు పైగా పాటలు పాడిన సౌందరరాజన్ ఎన్నడూ పాట నుంచి దూరం కాలేదు. సినిమా పాట కావచ్చు…లేదూ ప్రైవేట్ భక్తి గీతాల క్యాసెట్ కావచ్చు…తేదా…స్టేజ్ ప్రోగ్రామ్ కావచ్చు…రోజూ పాట పాడుతూనే ఉన్నారు.

సౌందర్ రాజన్ అనగానే గుర్తొచ్చే తెలుగు సినిమా పాటల్లో జయభేరి చిత్రంలోని ‘దైవము నీవేనా?’ అనే పాట ఒకటి. నారపరెడ్డి రాసిన సాహిత్యాన్ని చాలా ఫోర్స్ తో పాడేశారు సౌందర్ రాజన్.పాటను విపరీతంగా ప్రేమించిన గాయకుడు టి.ఎమ్.సౌందరరాజన్. చివర వరకూ పాడుతూనే ఉన్నారాయన.

అనేక స్టేజ్ షోస్ చేశారు. అలనాటి తన సహ గాయనీగాయకులతో కల్సి వేదికల మీద ఆయన పాడుతూ ఉంటే వినడం ఓ మధురానుభూతి అంటారు సుశీల. సుశీల యాభై వసంతాల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన వేడుకల్లో కూడా సౌందరరాజన్ చాలా యాక్టివ్ గా ఆవిడతో కలసి యుగళగీతాలు పాడారు.

ఎమ్.జి.ఆర్ స్ట్రెయిట్ గా చేసిన ఒకే ఒక తెలుగు సినిమా సర్వాధికారిలోనూ సౌందరరాజన్ ఎఫెక్టివ్ వాయిస్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రభోదాత్మక గేయాలు ఆలపించేప్పుడు ఆయన గాత్రం కదను తొక్కుతుంది. జనాన్ని ఉర్రూతలూగిస్తుంది. అందులో స్క్రీన్ మీద ఎమ్.జి.ఆర్. ఇంకేమైనా ఉందా…అంతటా ఉద్రేకపూరిత వాతావరణమే. సమరశంఖ నినాదమే.

మంచి చెడు సినిమాలో ఎన్టీఆర్ జైలు నుంచీ విడుదలైనప్పుడు వచ్చే పాట గుర్తుందా? ‘పుడమి పుట్టెను నా కోసం … పూలు పూచెను నా కోసం … కడలి పొంగెను నా కోసం … తల్లి ఒడినే పరిచెను నా కోసం’ … అంటూ సాగుతుంది సాహిత్యం. ఇది తమిళంలో కన్నదాసన్ రాస్తే దానికి తెలుగుపూత పూశారు ఆత్రేయ.

ఆ పాట తమిళ వర్షన్ సౌందర్ రాజన్ పాడారు.యాభై దశకం నుంచి ఎనభై ప్రారంభం వరకు తమిళ సినిమా పరిశ్రమను ఒక రకంగా ఏకఛత్రాధిపత్యంగా ఏలారు సౌందరరాజన్. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రావడం అలాగే ఎమ్.జి.ఆర్ రాజకీయప్రవేశం..శివాజీకి వయసు మీద పడడంతో కుర్రహీరోల ప్రభ మొదలయ్యాక సౌందరరాజన్ బిజీ తగ్గింది.

బాలుతో పాటు మలేషియా వాసుదేవన్ లాంటి సింగర్స్ వచ్చిన తర్వాత కూడా సౌందరరాజన్ తప్ప పాడలేరనుకునే గీతాలకు ఆయన్నే పిల్చేవారు.ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహదేవన్, ఇళయరాజా సౌందరరాజన్ తో పాడించడానికే ఇష్టపడేవారు. కారణం ఆయన గాత్రంలో తమిళ భాషలోని సొగసు అద్భుతంగా ఎలివేట్ అవుతుందనుకునేవారు.

కణ్ణదాసన్, వాలి లాంటి రచయితలు కూడా తమ సాహిత్యం అలాంటి గాయకుడి చేతిలో పడితేనే వన్నెకెక్కుతుందనే నమ్మకంతో ఉండేవారు.ఎస్.పి.కోదండపాణి గోపాలుడు భూపాలుడు సినిమా చేస్తూ టైటిల్స్ లో వచ్చే నేపధ్యగీతానికి సౌందరరాజన్ నే ఎంపిక చేసుకోవడం చూస్తేనే ఆయన ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉండేదో అర్ధమౌతుంది. ‘ఇదేనా … ఇదేనా’ అంటూ సౌందర్ రాజన్ ప్రేక్షకులందరి తరపునా వ్యవస్థను నిలదీస్తున్నట్టు ఉంటుందా గీతం.

దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో విలక్షణమైన గాత్రంలో ఎమోషనల్ ప్రజంటేషన్ తో ప్రేక్షకులను సౌందరరాజన్ అంతగా కదిలించిన గాయకులు మరొకరు లేరు. అనితరసాద్యమైన ప్రతిభావంతుడైన సుందరరాజన్ 91వ ఏట 2013 లో  చెన్నైలో మరణించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!