హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయుడి జన్మ స్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రే అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెప్పిన విధంగా ఇవాళ టీటీడీ ప్రకటన చేసింది. పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధన చేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ నిర్ధారించింది. కాగా ఇప్పటివరకు హంపీ ప్రాంతం ఆంజనేయుని జన్మ స్థలమని కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్ నేతలు, కొందరు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హంపి ఆంజనేయుని పుట్టిన ప్రాంతం అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. అయితే హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని టీటీడీ కూడా చెబుతోంది.
శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్ సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి చెంత గల అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని…ఈ ఆధారాలను పుస‌్తక రూపంలో తీసుకు వస్తామని కూడా అంటోంది.టీటీడీ తాజా ప్రకటనపై కర్ణాటక విశ్వహిందూ పరిషద్ నేతల స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది. అంత త్వరగా టీటీడీ ప్రకటనను వారు ఆమోదించే సూచనలు లేవు. ఇదిలా ఉంటే ఆంజనేయుని జన్మస్థలం పై చాలాకాలం నుంచి భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర్లోని ఆంజనేరి అని … మరికొందరు హర్యానా అని ఇంకొందరు ఝార్ఖండ్ అని ..హంపీ అని చెబుతున్నారు. దీంతో సర్వత్రా ఆంజనేయ స్వామి జన్మ స్థలం పై ఆసక్తి నెలకొన్నది.
ఇక టీటీడీ చెబుతున్నట్టు తిరుమలలో ప్రసిద్ది గాంచిన జాపాలి తీర్ధమే హనుమ జన్మస్థలమని కొందరు నమ్ముతున్నారు. స్కంధ పురాణంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద శ్రీరాముడి భక్తుడైన ఆంజనేయుడి జన్మ స్థలంపై టీటీడీ ధైర్యం చేసి కీలక ప్రకటన చేసింది.అంతకుముందు టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి చిదంబరశాస్త్రి ఆధ్వర్యంలో మురళీధర శర్మ, రాణి సదాశివమూర్తి, రామకృష్ణ తదితరులతో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ పలుమార్లు సమావేశమై తమ వద్దనున్న ఆధారాలతో నివేదిక ఇచ్చింది. దాన్ని అనుసరించే టీటీడీ ఇవాళ అధికారిక ప్రకటన చేసింది. కమిటీ లో ఉన్న అన్నదానం చిదంబర శాస్త్రి ప్రకాశం జిల్లా చీరాలకు చెందినవారు. ఆయన 1972 నుంచి ఆంజనేయ స్వామి ఉపాసకులు. చిదంబరశాస్త్రి పలు తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. హనుమంతుని జన్మస్థలానికి సంబంధించి పీహెచ్‌డీ కూడా చేశారు. ఆయన పరిశోధనలే ప్రధానంగా టీటీడీ ప్రకటనకు దన్నుగా ఉన్నాయి.