ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు.
మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించి రెండు నెలల వరకు ఉన్నాడు. తర్వాత మకర రాశిలోకి ప్రవేశించాడు.తిరిగి నవంబర్ 21న మరోసారి కుంభ రాశిలో ప్రవేశిస్తాడని అంటున్నారు. ఆ సమయంలో కూడా సింధునదికి పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. అపుడు వెళ్లి పుష్కర స్నానాలు చేసి రావచ్చు.
సింధు నది టిబెట్ లోని మానస సరోవరం, కైలాస పర్వతాల్లో పుట్టింది. దీన్నే ఇండస్ నది అని కూడా పిలుస్తారు. ఆ పేరు మీదనే ఇండియా ఏర్పడింది. ఈ సింధు నది కాశ్మీర్ దగ్గర ఉన్న లద్దాక్ లోని డెమ్ చోక్ లో భారత్ లోకి ప్రవేశించి .. బాటాలిక్ వరకు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ప్రవహించి ,కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది కశ్మీర్ లోయలోకి ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయలో ప్రవహిస్తాయి.
ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ..భక్తులు ఈ పుష్కరాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. లద్దాక్ ప్రసిద్ధిగాంచిన పర్యాటక క్షేత్రం. చుట్టూ ఎత్తైన పర్వతాలు.. లోయలు .. సరస్సులు .. పచ్చటి ప్రకృతి ఆకట్టుకుంటాయి.ఇక్కడ ఎన్నో మఠాలు… గురుద్వారాలున్నాయి. వాటితోపాటు నుబ్రాలొయ .. జంస్కర్ లోయలను, సరస్సులను చూడవచ్చు. మాగ్నటిక్ హిల్ అదనపు ఆకర్షణ. స్థానికంగా వాహనాలు అందుబాటులో ఉంటాయి. హోటళ్లకు కొదువలేదు. ఆంధ్రా .. తెలంగాణ నుంచి కూడా టూరిస్ట్ బస్సులు వెళుతుంటాయి.
కొంతమంది టూరిస్ట్ ఆపరేటర్లు సింధు పుష్కరాల సమయంలో యాత్రీకులను సింధునది వద్దకు తీసుకు వెళ్లకుండా బురిడీ కొట్టిస్తుంటారు. సోనీ మార్గ్ లో పుట్టిన ఒక వాగును కాశ్మీరీలు సింధుగా పిలుస్తుంటారు. అక్కడకి తీసుకెళ్లి స్నానాలు చేయించి పర్యాటకులను వెనక్కి తీసుకు వస్తుంటారు. గట్టిగా అడిగితే ఇది సింధు పాయ అని వాదిస్తుంటారు. ఇదిలా ఉంటే సింధు నది ఒడ్డున ప్రతి ఏడాది జూన్ లో సింధు దర్శన ఉత్సవం జరుపుతారు. లద్ధాక్ లో ఈ వేడుకలు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కూడా వస్తుంటారు.