Bharadwaja Rangavajhala
సినిమా పరిశ్రమలో ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వివరాల్లోకెళితే …..
ఎన్టీరామారావు కెరీర్ లో 1977 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఏడాది జనవరి లో సంక్రాంతికి విడుదలైన దానవీర శూరకర్ణ సినిమా బాక్సాఫీసును ఓ ఊపు ఊపి కోటి రూపాయల వసూళ్ల మార్కును దాటేసింది. అది సెకండ్ రిలీజులోనూ కోటి వసూలు చేసింది.కర్ణ హవా నడుస్తుండగానే … ఏప్రిల్ నెలలో అడవి రాముడు విడుదలైంది.
అది నాలుగు కోట్ల వసూళ్లు సాధించి ప్రాంతీయ సినిమా స్టామినా చూసి బొంబాయి ఖంగారు పడేలా చేసింది. అదే సంవత్సరం అక్టోబర్ లో యమగోల విడుదలై మరోసారి బాక్సాఫీసును షేక్ చేసింది.అలా ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ను అద్భుత విజయాలనూ అందించిన అడవి రాముడు, యమగోల రెండు సినిమాలూ శోభన్ బాబు వదులుకున్నవి కావడం విశేషం.
సత్యచిత్ర బ్యానర్ లో తాసీల్దార్ గారి అమ్మాయి తొలి చిత్రం. శోభన్ బాబు హీరో. తదుపరి చిత్రం ప్రేమబంధం. దర్శకుడు విశ్వనాథ్ హీరో శోభన్ బాబు. అయితే సరిగ్గా ఆ సినిమా విడుదలైనప్పుడే ఎన్టీఆర్ ఆరాధన రిలీజవడంతో ప్రేమబంధం అనుకున్నంత విజయవంతం కాలేదు.
ఆ సమయంలో సత్యచిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ ఎన్టీఆర్ ను కల్సినప్పుడు … ఆరాధన వల్ల ప్రేమబంధం దెబ్బతిన్న విషయం విని .. మీరు కథ తెచ్చుకుంటే ఓ సినిమా చేస్తాను మీకు అని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. అయితే సూర్యనారాయణగారు అప్పటికే ఓ కథ అనుకున్నారు… అదీ శోభన్ బాబుతోనే చేయించాలనుకున్నారు. దర్శకుడుగా తాసీల్దారుగారి అమ్మాయికి అసిస్టెంట్ డైరక్టర్ గా పన్జేసిన రాఘవేంద్రరావును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అప్పటికి రాఘవేంద్రరావు దర్శకుడయ్యాడు కూడా. సూర్యనారాయణగారు ప్లాన్ చేసిన కథ అడవి నేపధ్యంలో ఉంటుంది. గందనగుడి అనే ఓ కన్నడ సినిమా చూసి ముళ్లపూడి వెంకటరమణగారితో కథ తయారు చేయించారు. అందులో ఇద్దరు హీరోలుంటారు.
అందులో ఒక హీరో శోభన్ బాబు … ఆయనకి కథ చెప్పగానే అడవి బ్యాక్ డ్రాప్ లో కథ ఎక్కువ రోజులు ఔట్ డోరు ఇలా ఆలోచించి వద్దన్నారు.అప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు పోయి చెప్తే ఆయన ఓకే అనేశారు. డైరక్టర్ ఎవరు అంటే … రాఘవేంద్రరావు అని చెప్పగానే నాకు తెల్సు అతను పర్లేదు మొదలెట్టండి అనేశార్ట .
అప్పుడు వచ్చి రాఘవేంద్రరావుకి విషయం చెప్తే ఆయన తనను జోక్ చేయడానికి చెప్తున్నారనుకున్నాట్ట. సీరియస్ వ్యవహారమే అని తెల్సాక … ముళ్లపూడి వారి కథను దగ్గర పెట్టుకుని గొల్లపూడి తో కూర్చుని దాన్ని సింగిల్ హీరో కథగా మార్చే కసరత్తు ప్రారంభించారు. ఈ కసరత్తులో భాగంగా … కథను చాలా మార్చేశారు. ఆ టైమ్ లో వచ్చిన ఇతర సినిమాల నుంచీ పత్రికలలో వచ్చిన కథల నుంచీ కూడా సన్నివేశాలను తీసుకుని వాడుకున్నారు.
కావిలిపాటి విజయలక్ష్మిగారు రాసిన ఓ కథను తీసుకుని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గుమ్మడి ఎపిసోడ్ కు వాడుకున్నారు. ఇలా … షోలే నుంచీ ఒకటి రెండు సన్నివేశాలు ఇలా తీసుకుని ఎన్టీఆర్ కు కొత్త ఇమేజ్ ఇచ్చేలా కథ తయారు చేసుకునే ప్రయత్నం మొదలెట్టారు. గొల్లపూడి ఆకాశవాణిలో బిజీగా ఉండడంతో రచయితగా ప్రేమబంధంకు పన్జేసిన జంధ్యాలను తీసుకున్నారు. అతుకుల బొంతగా ఉన్న కథను ఓ దారిలో పెట్టి … హృదయాలను పిండేసే జగ్గయ్య ఎపిసోడ్ ను కంట్రిబ్యూట్ చేసిన ఘనత జంధ్యాలకు దక్కుతుంది.
అలా తెరకెక్కిన అడవిరాముడు సెన్సేషనల్ హిట్ కొట్టింది.శోభన్ బాబుతోనే రెగ్యులర్ గా సినిమాలు తీసిన నిర్మాత ఎస్.వెంకటరత్నం ఈ తరం మనిషి ఫ్లాప్ అయినప్పుడు నరకంలో యముడ్ని ఏడిపించే ఓ మానవుడి కథతో రూపొందిన ఓ బెంగాలీ సినిమా రైట్స్ కొనుక్కొచ్చి ముళ్లపూడికి అప్పగించారు. సరిగ్గా అడవి రాముడు కథలానే ఇది కూడా ముళ్లపూడి దగ్గరే ప్రారంభమైంది. ఈ సినిమాకీ అనుకున్న హీరో శోభన్ బాబే.
ఇలాంటి కథలకు నాకంటే నరసరాజు అయితే బెటరని ముళ్లపూడి చెప్పడంతో వ్యవహరం నరసరాజుగారి దగ్గరకు వచ్చింది. ఆ కథ విని ఈ సినిమాకు నేను చాలను చేయను అనేశారు శోభన్. అప్పుడు నరసరాజుగారికో ఆలోచన వచ్చింది. ఎన్టీఆర్ తో యముడు వేయించి బాలకృష్ణతో సత్యం కారక్టర్ చేయిస్తే బావుంటుంది కదా అని ఎన్టీఆర్ ను కల్సారు.
ఆయన కథ విని బాలకృష్ణ ఇది చేయలేడు. నేను సత్యం కారక్టర్ చేస్తాను. సత్యనారాయణ యముడు చేస్తాడు అని సవరణ చేశారు. అలా తెరకెక్కిన యమగోల సినిమా కూడా చాలా పెద్ద హిట్టయ్యింది.అలా శోభన్ , ముళ్లపూడి జంట వదులుకున్న రెండు కథలతో అద్భుతమైన విజయాలు సాదించారు ఎన్టీఆర్.
శోభన్ బాబు కాదన్న చిత్రాలు ఎన్టీఆర్ కి బిగ్ హిట్స్, ఎవరికి తెలియని విషయం వివర్సన బాగుంది
కథనం సుపెర్బ్ గా ఉంది
రత్న.