సీతారామరాజంటే సంగ్రామ భేరి !

Sharing is Caring...

Great Warrior…………………………………………….

అల్లూరి సీతారామరాజు … ఆయన పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.  ఆయన  భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్నులు రగిలించిన అఖండ వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్య్ర  సమరాన్ని సాగించిన విప్లవ సింహం. బ్రిటీషు సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవజ్యోతి. తెల్లవారి ఉక్కుపాదాల కింద నలుగుతున్న  మన్యం ప్రజల  సంరక్షకుడై, స్వేచ్చాజాతి సమరశంఖమై, తెలుగుజాతి పౌరుషాన్ని ఆరని అగ్నిజ్వాలగా  రగిలించిన చైతన్యమూర్తి శ్రీ రామరాజు ఈ సీతారామరాజు.

బ్రిటీష్ వలస పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని, తూర్పు కనుమల ప్రాంతం నుండి వారిని బహిష్కరించాలనే లక్ష్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు. అప్పట్లో  తక్కువ  సంఖ్యలో ఉన్నదళాల కోసం తుపాకీలను సంపాదించడానికి స్థానిక పోలీస్ స్టేషన్లపై అనేక దాడులకు నాయకత్వం వహించాడు.  అలాంటి వీరుడి గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నాటకాలు వచ్చాయి.  కానీ ఒకే ఒక సినిమా  ఆయనకు నివాళి అర్పిస్తూ తీశారు. అదే అల్లూరి సీతారామరాజు.

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే.. ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించాడు.  ఆయన తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి సొంత వూరు. తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు.

గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా బారినపడి  సీతారామరాజు తండ్రి 1908లో మరణించాడు. అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువుతున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం కష్టాల్లో పడింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చారు.

చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు కుటుంబం చేరింది.  భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో చేరాడు. తొలియేడాదే పరీక్ష ఫెయిల్ అయ్యాడు.  తండ్రి లేకపోవడం, పేదరికం, నివాసం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతారామరాజు చదువుపై చాలా ప్రభావం చూపించాయి.

కొవ్వాడ నుంచి తుని వెళ్లారు. 1918 వరకు సీతారామరాజు కుటుంబం తునిలోనే ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు, అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్నిదగ్గరగా చూసాడు.  వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు.

సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చిన్ననాటి నుంచే  రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానంలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు అంటారు.

సీతారామరాజు అంటేనే ఓ మహోజ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలంలోనే స్థానికులకు, బ్రిటిష్‌ వాళ్లకు బోధపడింది. కేవలం 27 యేళ్ల వయసులోనే ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటాన్ని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అనుచరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామంలోకి దూకాడు. ఇలా.. భారత  స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓ ప్రత్యేక అధ్యాయమని చెప్పుకోవచ్చు.

అల్లూరి సీతారామరాజు  సినిమా విషయానికొస్తే  అలాంటి మాస్టర్ పీస్  ఇంకొకటి రాదేమో. అసలు సీతారామరాజు కథ మొదట ఎన్టీఆర్ కోసం తయారు చేశారు రచయిత మహారథి. ఆయనకు వినిపించారు. బ్రిటిష్ సైనికుల వేధింపుల తాళలేక పోతున్న మన్య ప్రజల క్షేమం కోసం రామరాజు తాను చేపట్టిన ఉద్యమానికి కొంత కాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అదే సినిమా ముగింపు. అది ఎన్టీఆర్ కి నచ్చలేదు. దాంతో సినిమా ప్రతిపాదన  ఆగిపోయింది.

ఒకసారి కృష్ణ సోదరుడు హనుమంతరావు మహారథి ని  కలిసినపుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. సినిమా చర్చల దగ్గరే ఆగిపోయినట్టు మహారథి చెప్పారు.  ఆ వెంటనే కృష్ణ ను, డైరెక్టర్ రామచంద్రరావు ను మహారథి కలవడం.. కథపై చర్చలు జరగడం చకచకా జరిగిపోయాయి. సాహిత్యం పై మంచి పట్టు ఉన్న జగ్గయ్య సీతారామరాజు కథా చర్చల్లో పాల్గొన్నారు. ముగింపు కూడా ఆయనే సూచించారని అంటారు.

ఇక్కడే రూథర్ ఫర్డ్ పాత్ర గురించి  నాలుగు మాటలు చెప్పుకోవాలి.  కలెక్టరు రూథర్‌ఫర్డ్‌ని కొంత సౌమ్యుడిగా చూపారు.రూథర్ ఫర్డ్ కి అన్ని వ్యవహారాలపై అవగాహన వున్నట్టు, సీతారామరాజంటే గౌరవం కూడా వున్నట్టు డైలాగ్స్ ద్వారా చెప్పించారు. అలాగే ఆ ఇద్దరు కలసినప్పుడు రామరాజును రూథర్ ఫర్డ్ మెచ్చుకున్నట్టు  చూపించారు. అయినా ప్రభుత్వం మాట వినని  రామరాజును చంపించినట్టు సినిమాలో చూపించారు.

అసలు “రూదర్ ఫర్డ్” ఎలాఉంటాడో చాలా మందికి తెలీదు. ఆ పాత్ర మరీ కఠినంగా ఉంటే బాగుండదని జగ్గయ్య నిర్మొహమాటంగా చెప్పారట. అందుకే కొంత సౌమ్యంగా ఉన్నట్టు మార్చారట.కథా చర్చల్లో జగ్గయ్య ఉండటం మూలాన .. ఆయన పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఉంటుందని భావించి మార్పులు చేశారు.

రూథర్ ఫర్డ్  పాత్రకు నటుడు జగ్గయ్య ప్రాణ ప్రతిష్ట చేసారు. తన కంచుకంఠం తో  డైలాగులు చెబుతుంటే జనం సినిమాలో మమేకమైనారు. జగ్గయ్య వేషధారణ కోసం మేకప్‌ మ్యాన్‌ మాధవరావు చాలా కృషి చేశారు.  నీలిరంగు కాంటాక్ట్‌ లెన్సులను అమర్చి బ్రిటిషు అధికారి రూపాన్ని తీర్చిదిద్దారు.జగ్గయ్య రూథర్ ఫర్డ్ ను మన కళ్ళముందు ఉంచారు.

అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. క్లైమాక్స్ లోని  రామరాజు … రూథర్ ఫర్డ్ సంవాద దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. ఇక వాస్తవానికొస్తే రూథర్ ఫర్డ్  ఉద్యమాల అణచివేతలో ఆరితేరిన వాడు. పల్నాడులో  పుల్లరి వ్యతిరేక ఉద్యమాన్ని కఠినంగా తొక్కేసాడు. దానికి నాయకత్వం వహించిన కన్నెగంటి హనుమంతు కాల్చివేతలో తెరవెనుక పాత్ర రూథర్ ఫర్డ్ దే ఒక కథనం ప్రచారం లో ఉంది.

అతను అంత కఠినుడు కాదని కూడా అంటారు. ఆ తర్వాత రూథర్ ఫర్డ్ మన్యం కు వచ్చాడు.  అప్పటికే అక్కడ విప్లవం ఆఖరి దశలో ఉంది.రామరాజు అనుచరగణం తగ్గిపోయాక, గ్రామాలను బూడిద చేసి, ప్రజలను భయభ్రాంతులను చేసాడని అంటారు. గిరిజనులను  కష్టాలపాలు చేసి వారికోసం రామరాజు తనంతట తానే లొంగిపోయేలా వ్యవహరించారని  చెబుతారు.

అదలా ఉంటే రూథర్‌ఫర్డ్‌, రామరాజు ఎన్నడూ ఎదురుపడలేదు.సినిమాలో మాత్రం రూథర్‌ఫర్డ్‌ మన్యానికి వచ్చి లంచగొండితనమే, వెట్టిచాకిరియే విప్లవానికి మూలకారణమని గ్రహించినట్టు చూపించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగ్గా లేదు. టెలిఫోన్‌ తీగలు పెట్టించాడని చూపించారు.సంస్థానాధీశుల నుండి సైనికులకు ఆహార పదార్థాలు తెప్పించాడని కథ అల్లారు. నిజానికి ఇవన్నీపాత కలెక్టర్ ఉన్నపుడు జరిగాయని అంటారు .1924 మే 7 న రామరాజు  ఏటి  ఒడ్డున కూర్చుని ఒక కోయవాడి ద్వారా పోలీసులకు కబురంపాడు.

వాళ్లు వచ్చి కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడ గుడాల్‌కు, అల్లూరికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.దాంతో గుడాల్‌ గొలుసులతో చెట్టుకు కట్టించి, రివాల్వర్‌తో కాల్చి రామరాజు ను చంపారని  అంటారు.  తర్వాత తమకు చెప్పకుండా రామరాజును కాల్చి చంపడం తో రూథర్‌ఫర్డ్‌ గుడాల్‌ పై మండి పడ్డారట.ఇలా చంపినట్టు బయటకు వస్తే బ్రిటిష్‌ సర్కారుకి అవమానమని, పారిపోతూ వుంటే కాల్చామని స్టేటుమెంటు ఇప్పించారు.

అయితే సినిమాలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ అత్యంత నాటకీయంగా .. ఒళ్ళు గగుర్పొడిచేలా చిత్రీకరించారు. అయితే ఎక్కడా రామరాజు పాత్ర ఔన్నత్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’. ఈ డైలాగులు ఇప్పటికి అక్కడక్కడా వినబడుతుంటాయి. అప్పట్లో తూటాల్లా పేలాయి ఈ డైలాగులు.

ఇప్పటికి ఆ సినిమా చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక పాటలు గురించి చెప్పనక్కర్లేదు. ఆదినారాయణరావు సంగీతం అద్భుతం.  “రగిలింది విప్లవాగ్ని ఈ రోజు” అంటూ ఆరుద్ర రాసిన గీతం, “వస్తాడు నారాజు .. ఈరోజు “అంటూ సినారె రాసిన పాట , తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ గీతం ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్. కెమెరామెన్ వి.ఎస్. ఆర్ స్వామి ఈ చిత్రాన్ని అద్భుత కావ్యంగా మలిచారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!