Chance to contest from Telangana………………………….
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణా నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ స్థానాల్లో ఎక్కడనుంచి పోటీ చేసినా మంచి మెజారిటీ తో గెలిపిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఆ పరిణామం పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చని లెక్కలు వేస్తున్నారు.
అంతకుముందు తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమని అడగాలని అనుకున్నారు.
అయితే వయోభారం రీత్యా ఆమె ప్రత్యక్ష ఎన్నికల పట్ల ఆసక్తి చూపలేదు .. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆ ప్రతిపాదనకు తెరపడింది. సోనియా ఆరు సార్లు పోటీ చేసి గెలిచిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ 55,120 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
రాహుల్ పై బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ విజయం సాధించారు. అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్‌లోనూ పోటీ చేసిన రాహుల్ వాయనాడ్‌లో 4,31,770 ఓట్ల ఆధిక్యత తో ఘన విజయం సాధించారు. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే ‘అనీ రాజా’ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈవిడ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి కావడం విశేషం.
దీంతో రాహుల్ పోటీ ఎక్కడ నుంచి అనేది ఖరారు కాలేదు. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ అమేథి మొహం కూడా చూడలేదని విమర్శలున్నాయి. అక్కడ పార్టీ కూడా బలహీన పడింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ఫలితాలు సాధించలేకపోయింది. మిత్ర పక్షాలు ఉత్తరాదిలోనే రాహుల్ పోటీ చేయాలని సూచిస్తున్నాయి.
అయితే అమేథి సేఫ్ సీటు కాదని రాహుల్ సన్నిహితులు అంటున్నారు. రాయబరేలీ లో కూడా పార్టీ బలహీనం గా ఉంది. బీజేపీ గట్టి పోటీ ఇవ్వడానికి సన్నహాలు చేస్తోంది. యూపీ నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాయబరేలీ ఒక్కటే కాంగ్రెస్ గెలిచిన స్థానం.
సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ కి బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన అమేధీ నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగవచ్చు. కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతు ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలంగా ఉన్న తెలంగాణ లో రాహుల్ పోటీ చేసే అవకాశం ఉంది. చేస్తే అమేధీ నుంచి కూడా చేయవచ్చు.
రాహుల్ పోటీ చేసేందుకు ఖమ్మం సురక్షిత నియోజకవర్గమని టీపీసీసీ కూడా ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానానికి పంపింది. రాహుల్ సన్నిహితులు ఆయన కోసం సేఫ్ సీటు ను అన్వేషిస్తున్నారు.