Shaking earthquakes…………..
ప్రకృతి విలయంతో టర్కీ,సిరియాలు కొద్ది రోజుల క్రితమే అతలాకుతలమయ్యాయి. ఆయా దేశాల్లో భూప్రళయం.. తీవ్ర నష్టాన్ని, పెను విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల క్రితం భారత్ లోని ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు ఆందోళనకు గురిచేశాయి. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున స్వల్ప భూకంపం. అసోంలో ఇవాళ వచ్చిన భూకంపం ప్రజలను పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ కు భూకంపాల (Earthquake) ముప్పు ఉందా? ఏయే ప్రాంతాలకు ఆ ప్రమాదం పొంచి ఉంది? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది.దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 59 శాతం భూభాగం.. భూకంపాలకు గురయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఇదివరకే చెప్పాయి.
మన దేశంలో భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం.. భారత భూఫలకం ఏడాదికి 47 మిల్లీమీటర్ల వేగంతో ఆసియా ఫలకంలోకి చొచ్చుకుపోతోంది. గతంలో సంభవించిన భూకంపాల ఆధారంగా.. దేశంలోని ప్రాంతాలను నాలుగు భూకంప (Earthquake) మండలాలుగా విభజించారు.
అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. వీటిలో జోన్ 5 భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం కాగా.. జోన్ 2 తక్కువ తీవ్రత కలిగిన ప్రాంతంగా చెబుతున్నారు. భూకంప ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో 11 శాతం అత్యంత తీవ్రత కలిగిన జోన్ 5లో ఉంది. జోన్ 4లో 18శాతం, జోన్ 3లో 30శాతం, జోన్ 2లో 41శాతం ఉన్నట్లు 2021లో కేంద్రం ప్రకటించింది.
జోన్ 5 : భూకంపాల ముప్పు అత్యధికంగా ఉన్న జోన్ ఇది. కశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, ఉత్తర బిహార్, మధ్య బిహార్, ఈశాన్య భారత్ ప్రాతాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. దీన్ని వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్ గా పిలుస్తారు.
జోన్ 4 : ఇది హై డ్యామేజ్ రిస్క్ జోన్. దేశ రాజధాని దిల్లీ సహా జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ , హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఉత్తర పంజాబ్, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్ లోని ప్రధాన భూభాగాలు, ఉత్తర బెంగాల్, సుందర్బన్ ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.
జోన్ 3 : ఇది మీడియం ప్రభావం కలిగిన జోన్. చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్ కతా , భువనేశ్వర్ లాంటి ప్రధాన నగరాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.జోన్ 2 : ఇది స్వల్ప తీవ్రత కలిగిన జోన్. ఈ ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అంచనా. తిరుచిరాపల్లి, బులంద్ షహార్, మోరదాబాద్, గోరఖ్ పూర్ , చండీగఢ్ లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాది భూభాగాలు ఈ జోన్ లో ఉన్నాయి.
ప్రస్తుతం సవరించిన భూకంప ప్రమాద మండలాల వర్గీకరణలో ‘జోన్ 1’ అనేదాన్ని ఉపయోగించలేదు. అందువల్ల ఏ ప్రాంతాన్నీ జోన్ 1గా గుర్తించలేదు. ఇక రెండురోజుల క్రితం టర్కీలో భూకంపం రాబోతోందని ముందే చెప్పిన శాస్త్రవేత్త ఫ్రాంక్ హోగర్‌బీట్స్ భారత్‌లో కూడా భూకంపాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
రాబోయే కొద్ది రోజుల్లో, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో భూగర్భంలో కదలికలకు అవకాశం ఉందన్నారు. ఈ కదలికలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, హిందూ మహాసముద్రం పశ్చిమ భాగంలో ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారత్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది.
రాబోయే కొద్ది రోజుల్లో చైనాలో భూకంపం సంభవించవచ్చు అని ఫ్రాంక్ చెప్పడం ఆందోళన రేపుతోంది. ఫ్రాంక్ చెప్పినట్టు జరగవచ్చు .. జరగపోవచ్చు, కానీ అప్రమత్తత అవసరం.ప్రకృతి విపత్తులు ఈ సమయానికి వస్తాయని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యంకాని పని. అయితే అలాంటి విపత్తుల సమయంలో తీవ్ర నష్టం కలగకుండా ముందు నుంచే సన్నద్ధత అవసరమని నిపుణులు చెబుతున్నారు.