అత్తా కోడళ్ల ఆలయాలు !

Sharing is Caring...
Sheik Sadiq Ali  ……….. 

ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక , ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక రాజీ ఫార్ములాను రూపొందించి గండం నుంచి గట్టేక్కిన ఇద్దరు రాజుల కథ ఇది.దాదాపు వెయ్యేళ్ళ క్రితం ఆ రాజులు తీసుకున్న ఒక నిర్ణయం… దాని పర్యవసానంగా వెలసిన నాలుగు ఆలయాలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూనే వున్నాయి.

అసలు విషయానికి వస్తే క్రీస్తు శకం 1092 ప్రాంతం లో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను ఏలిన కచ్చాప ఘాత వంశీయుడైన మహీపాలుడనే రాజుకు భార్యా, ఒక కుమారుడు వుండేవారు. ఆయన భార్య విష్ణు భక్తురాలు. నిత్యం శ్రీ మహావిష్ణువును ఆరాదించేది. ఆమె భక్తికి ముగ్దుడైన రాజు ఆమె కోసం ఒక ఆలయాన్ని నిర్మించి అందులో వెయ్యి చేతులు (సహస్ర బాహు) వున్న మహా విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టింప చేసాడు.32 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పు వున్న ఈ ఆలయంలో బ్రహ్మ,సరస్వతి విగ్రహాలను కూడా నెలకొల్పాడు.మూడు వైపులా మూడు ద్వారాలు ఏర్పాటు చేసి నాలుగో వైపు ఒక రహస్య గదిని నిర్మించాడు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. నిరంతరం దానికి తాళం వేసే వుంటుంది.తొలుత సున్నపు రాయితో నిర్మించినా తదనంతరం దాన్ని పూర్తిగా రాతితో పునర్నిర్మించారు.

అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడే ఆ ఆలయంలో రాణీ వారు మహావిష్ణువును కొలుస్తూ వుండేవారు.ఈ లోగా యువరాజా వారు ఒక ఇంటి వారవ్వటం, కొత్తకోడలు కోటలో అడుగు పెట్టడం జరిగింది.సరిగ్గా ఇక్కడి నుంచే రాజు గారికి కష్టాలు మొదలయ్యాయి.వచ్చిన కోడలు పరమ శివ భక్తురాలు.ఆ పరమేశ్వరుణ్ణి తప్ప మరొకరిని పూజించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అత్తగారు కొలిచే సహస్రబాహు మహావిష్ణువు ను ఆరాధించబోననీ, అసలా గుడి ప్రాంగణం లోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. ఆ ఆలయంలో విష్ణు స్థానే శివుణ్ణి ప్రతిష్టించాలని పట్టు పట్టింది. ఆ మాట విన్న అత్త గారు ససేమిరా అంది. దాంతో అంతఃపుర యుద్ధం మొదలైంది. ఎవరూ వెనక్కి తగ్గ లేదు. పంతాలు వీడ లేదు. దాంతో ఇద్దరినీ సంతృప్తి పర్చటం కోసం ,ఆ ఆలయం పక్కనే మరో శివాలయాన్ని ఆఘమేఘాల మీద నిర్మింప చేశారు.దాంతో అంతఃపుర శాంతి నెలకొంది.సహస్ర బాహు ఆలయం కాస్తా ప్రజా బాహుళ్యం లో సాస్-బహు (అత్తా-కోడలు) ఆలయంగా మారిపోయింది.

అది ఇప్పటికీ గ్వాలియర్ కోటలోని మాన్ మందిర్ పాలస్ ప్రాంగణం లోనే వుంది. ఆ రెండు శివ,విష్ణు ఆలయాలను దర్శించటానికి పర్యాటకులు వస్తూనే వున్నారు.సరిగ్గా ఇలాంటి కథే రాజస్తాన్ లోని ఉదయ పూర్ లో జరిగింది. అయితే ఇక్కడ చిన్న మార్పు జరిగింది. అత్తా కోడళ్ళిద్దరూ విష్ణు భక్తులే అయినా, ఎవరికీ వారు ఆలయ ఆధిపత్యం కోసం పట్టు పట్టటం తో అక్కడి అప్పటి రాజావారు చెరొక విష్ణు ఆలయాన్ని పక్కపక్కనే కట్టించి ఇచ్చారు.ఇవి ఉదయ పూర్ కు 22 కిలో మీటర్ల దూరం లోని నగద లో వున్నాయి. ఈ ఆలయాల ప్రాంగణంలో రామ, బలరామ, పరుశరామ విగ్రహాలు వుంటాయి. మూలవిరాట్టు మాత్రం సహస్ర బాహు వైన మహావిష్ణువే ఉంటాడు.ఇవీ అత్తా- కోడళ్ళ ఆలయాల విశేషాలు.అయితే అందరు అత్తలు, అందరు కోడళ్ళూ ఒకేలా ఉంటారని మాత్రం అనుకో వద్దు. అత్తను తల్లిగా భావించే కోడళ్ళు, కోడలిని కూతురిగా ప్రేమించే అత్తలూ చాలా మంది ఈ లోకంలో వున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!