Father and son are on the same path………………………
మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు పృద్వి అలియాస్ మున్నాఅలియాస్ శివాజీ తండ్రి బాటలోనే నడిచారు. నల్లమల్ల అడవులు విప్లవకారులకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టి .. ఏరివేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో ఆర్కే అండర్‌గ్రౌండులోకి వెళ్లారు. అపుడే (1988లో) ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష అలియాస్ పద్మను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మున్నా జన్మించాడు.కొడుకు పుట్టిన కొద్ది నెలల తరువాత ఆర్కే తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు.
తండ్రి ఆర్కే మావోయిస్టు కీలక నేత కావడంతో మున్నా బాల్యం అత్యంత నిర్బంధంలో గడిచింది. ఆర్కే ఆచూకీ చెప్పమంటూ ఇంటిపై తరచుగా పోలీసుల దాడులు జరిగేవి. ఇవన్నీ అతగాడిని భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ నేపథ్యంలో మున్నాను ఒంగోలులో రహస్యంగా చదివించారు. తండ్రి కోసం తల్లి పద్మతో పాటు మున్నాఅడవికి వెళ్ళేవాడు. ఒక్కోసారి అతనికి తండ్రి ఆచూకీ దొరకక అక్కడే నెలల తరబడి ఉండేవాడు. ఎపుడో రహస్యంగా తండ్రి వస్తే కలిసేవారు. ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి తిరిగి వెనక్కి వచ్చేవారు.
ఒకసారి మున్నాఅడవిలో తండ్రి ని కలుసుకున్నాడు. కొద్ది రోజులు అక్కడే ఉంటానని పట్టుబట్టాడు. అలా తండ్రికి దగ్గరయ్యాడు.మరొక సారి వెళ్ళినపుడు ఇక పర్మనెంట్ గా ఉద్యమంలో చేరతానని చెప్పేసాడు. ఆర్కే కూడా కాదన లేకపోయారు తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆర్కే ఏనాడు కోరుకోలేదు. ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలని కొడుక్కి చెప్పేవాడు. తనతో ఉంటున్న మున్నాకు గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్పించారు.
నిఘా బృందాలకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో ? అడవుల్లో ఎంత అప్రమత్తం గా ఉండాలో ? ఎన్కౌంటర్ సమయంలో ప్రత్యేక దళాలను ఎదుర్కోవాలో మున్నా తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. 16 ఏళ్ళ వయసులోనే కాకలు తీరిన మావోయిస్టుగా మారాడు. తండ్రి ఆశయాలను మున్నా పుక్కిట పట్టాడు.
2004 లో ప్రభుత్వంతో చర్చల జరిగిన అనంతరం మున్నా దళం లో చేరాడు. ఇంటర్ వరకు చదువుకున్న మున్నా అనతి కాలంలోనే ఏవోబీలో సెక్షన్ కమాండర్ స్థాయికి ఎదిగాడు. అయితే 2016 అక్టోబర్ 24న ఏవోబీ రామ్‌గూడాలో పోలీసులు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆ సమయంలో ఆయన తండ్రి ఆర్కే అంగ రక్షక దళ సభ్యుడిగా ఉన్నారు.
ఎదురు బొదురు కాల్పుల్లో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకున్నాడు. కానీ మున్నా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఓడిశాలోని మల్కాన్ గిరి టౌన్ కి మరణించిన మావోయిస్టుల మృతదేహాలను తరలించారు. మున్నాతల్లి పద్మ .. విప్లవ రచయిత కళ్యాణ్ రావు అక్కడ కెళ్ళి మున్నా బాడీని ఒంగోలు దగ్గర అలాకూరపాడు కి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆనాటి ఎన్కౌంటర్ లో తొలుత ఆర్కే కూడా మరణించారని భావించారు. అయితే ఆయన తప్పించుకున్నారని తర్వాత వార్తలు వెలువడ్డాయి.