పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు అట్లూరి రామారావు. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు కుడి భుజం.అత్యంతనమ్మకస్తుడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన ప్రముఖుడు.
వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. రామోజీరావు .. రామారావు కలసి చదువుకున్నారు ..కలసి ఆడుకున్నారు. ఆ ఇద్దరిది ఒకే ఊరు. అదే పెద్ద పారుపూడి. రామోజీరావు మార్గదర్శి ప్రారంభించినప్పటినుంచి ఆయన వెంట నిలిచిన వారిలో ఈయన ముందుంటారు.
అలాంటి నమ్మకస్తులు, నిజాయితీపరులు దొరికారు కాబట్టే రామోజీ రావు వివిధ వ్యాపారాలను ఈజీగా నిర్వహించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై చిత్రనిర్మాణం చేపట్టినపుడు సినిమా వ్యవహారాలన్నీ అట్లూరి రామారావు కే అప్పగించారు. అంతకు ముందు ఈనాడు పత్రిక వ్యవహారాలు కూడా ఈయనే నిర్వహించారు.
తెలుగు తనానికీ నిదర్శనంగా తెల్లటి పంచె, లాల్చీలోనే ఎప్పుడూ కనిపించే అట్లూరి రామారావు క్రమశిక్షణ, సమయ పాలన,సమర్ధవంతమైన కార్యనిర్వహణకు మారుపేరు గా నిలిచారు. మద్రాసు హోటల్ లో దర్శకుడు టీ. కృష్ణను గమనించి పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే హైదరాబాద్ కి కృష్ణ ను పిలిపించి రామోజీరావుకు పరిచయం చేసారు. అలా వారి కలయికలో ‘ప్రతిఘటన’ రూపుదిద్దుకుంది.
ఒక పత్రిక వార్త ఆధారంగా నర్తకి సుధాచంద్రన్‌ను అన్వేషించి ‘మయూరి’ వంటి సినిమా తీయడంలో అట్లూరి రామారావుదే కీలకపాత్ర. అలాగే సంగీత దర్శకుడు కీరవాణిని సినిమాకు పరిచయం చేసింది కూడా రామారావే. నిజానికి అట్లూరి రామారావు చదువుకున్నది ఎలిమెంటరీ స్థాయి వరకే.ఆయన మాటలను వింటే … ఆయనతో మాట్లాడుతుంటే ఎవరూ అలా అనుకోరు.
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) మొదలు ‘మయూరి’, ‘ప్రతిఘటన’ (’85), ‘మౌనపోరాటం’(’89), ‘అశ్వని’ (’91) లాంటి హిట్ చిత్రాలు అట్లూరి చిత్ర నిర్మాణ నిర్వహణలో రూపొందినవే.అప్పట్లో హిందీ భాషా ప్రచార ఉద్యమ ప్రభావం తో హిందీ చదివారు. ఒకసారి గాంధీ గారిని కలవడమే కాక, హిందీ ప్రచారానికి చేసిన కృషికి గాంధీ నుంచి ప్రశంసాపత్రం సైతం అందుకున్నారు. కొంతకాలం హిందీ అధ్యాపకునిగా కూడా చేశారు.
ఆయన నటుడు కూడా. కొన్ని తెలుగు నాటకాల్లో నటించారు.మాభూమి’ తదితర నాటకాల్లో నటించారు. తరువాత కాలంలో రామోజీ ఆహ్వానం మేరకు ఆయన సంస్థలో చేరారు. సినీ నిర్మాణ బాధ్యతలు చేపట్టాక అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే ఎన్టీఆర్ నటించిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్రలో ఆయన కనిపించారు.
‘ప్రతిఘటన’లో గాంధేయవాది పాత్రలో, ‘మౌనపోరాటం’లో హీరో తండ్రి పాత్రలో ఆదర్శవాదిగా మెప్పించారు. వయసు పైబడిన కారణంగా 2000 సంవత్సరం నుంచి బాధ్యతలు తగ్గించుకున్నారు. రామోజీ రావు రామారావు కిచ్చిన స్వేచ్ఛ మరెవరికి ఇవ్వలేదు అంటారు. రామారావు తప్పుకున్నాక ఉషాకిరణ్ మూవీస్ నుంచి సినిమాలు తగ్గిపోయాయి. తర్వాత వచ్చిన ఒకటి అరా సినిమాలు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు.
———-KNM