రెపో రేటు vs అదనపు వాయిదాల భారం !

Sharing is Caring...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపో రేటు చాలామందికి  భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటు అంటారు.  సాధారణంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటాయి. వీటిపై  విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు.

ఆర్బీఐ కనుక రెపోరేటును పెంచితే బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై ఈ వడ్డీ రేటును పెంచుతాయి.  రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచడంతో హెూంలోను , పర్సనల్ లోన్, వెహికల్ లోను వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది.

ఆర్బీఐ వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై నేరుగా వడ్డీ భారం పడకపోయినా.. పెరిగిన వడ్డీ రేటు సర్దుబాటులో భాగంగా అదనపు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. ఇది సామాన్యులకు భారమే అవుతుంది. 

గత కొంత కాలంగా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు బాగా తగ్గించాయి. దీంతో చాలా మంది నగదు దాచుకునేందుకు బ్యాంకులకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. చిట్టీలు, రియల్ ఎస్టేట్ , స్టాక్ మార్కెట్ వైపు మళ్లుతున్నారు. తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో ఫిక్స్, టర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది.

ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల కమర్షియల్ బ్యాంకుల్లోకి పెద్ద ఎత్తున నిధులు వచ్చే  అవకాశం ఉంది. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా , యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లు తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌  ) 0.10 శాతం వరకు పెంచాయి.

మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి.దీంతో ఎంసీఎల్‌ఆర్‌  కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి. వివరాల్లోకి వెడితే.. ఎస్ బీఐ తమ ఎంసీఎల్‌ఆర్‌  వివిధ కాల వ్యవధులకు  సంబంధించి 0. 10 శాతం పెంచింది.

దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్‌ఆర్ ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్ బీఐ తమ వెబ్ సైట్లో ప్రకటించింది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్ ఆర్ 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది.

ఏప్రిల్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త రేటు ఏప్రిల్ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్ఆర్, ఆర్ఎస్ఎఆర్ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!