రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Realistic suspense drama ……….

టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ (Anweshippin Kandethum) ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఒక బెస్ట్ రా అండ్ రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. నూతన దర్శకుడు డార్విన్ కురియాకోస్ తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ అంటే “వెతకండి, అప్పుడు మీకే దొరుకుతుంది” అని అర్థం. 

కథాంశం ఏమిటంటే ?

ఈ కథ 1990ల నేపథ్యంలో కేరళలోని కొట్టాయం జిల్లాలో సాగుతుంది. ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఒక సిన్సియర్ సబ్ ఇన్‌స్పెక్టర్. అతని స్టేషన్ పరిధిలో ‘లవ్లీ మాథన్’ అనే ఒక కాలేజీ అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదవుతుంది.

ఆనంద్ తన బృందంతో కలిసి ఎంతో శ్రమించి ఆ అమ్మాయి హత్యకు గురైందని కనిపెట్టి, నిందితుడిని కూడా పట్టుకుంటాడు. కానీ ఒక చిన్న పొరపాటు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆనంద్‌తో పాటు అతని టీమ్ మొత్తం సస్పెండ్ అవుతుంది. 

సస్పెన్షన్ కాలంలో ఉన్న ఆనంద్ టీమ్‌కు ఉన్నతాధికారులు ఒక కండిషన్ పెడతారు. ఆరేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ‘శ్రీదేవి మర్డర్ కేసు’ ను చేధిస్తేనే వారికి తిరిగి ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. ఊరంతా పోలీసులకు వ్యతిరేకంగా ఉండి, ఎలాంటి ఆధారాలు లేని ఆ క్లిష్టమైన కేసును ఆనంద్ ఎలా పరిష్కరించాడు? అసలైన హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగిలిన సినిమా కథ.

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఒకే కథ ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో ఒక మర్డర్ మిస్టరీ, సెకండ్ హాఫ్‌లో మరో మర్డర్ మిస్టరీ చుట్టూ కథ నడుస్తుంది. ఈ రెండు వేర్వేరు కేసులను దర్శకుడు ఎక్కడా గందరగోళం లేకుండా గ్రిప్పింగ్‌గా చూపించారు. 

ఎస్సై ఆనంద్ పాత్రలో టొవినో థామస్ ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచారు. ఎక్కడా అనవసరపు మాస్ ఎలివేషన్లు లేకుండా, నిజమైన పోలీస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తిస్తాడో అంత సహజంగా నటించారు.
సినిమాలో కమర్షియల్ ఫైట్లు, బలవంతపు ప్రేమకథలు, ఐటమ్ సాంగ్స్ ఉండవు.

కథ పూర్తిగా నేర పరిశోధన చుట్టూనే పక్కాగా సాగుతుంది.పోలీసులకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలా సహకరించరో బాగా చూపించారు. ఈ సినిమాలో మొబైల్ ఫోన్లు, లొకేషన్ ట్రాకింగ్,  సిసిటివి కెమెరాలు లేని కాలంలో కేవలం మనుషుల సైకాలజీని , చిన్న చిన్న ఆధారాలను బట్టి పోలీసులు ఎలా విచారణ చేస్తారో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.

డెడ్‌బాడీ దొరికిన ప్రదేశాన్ని మళ్లీ పరిశీలించి ఆనంద్ కొత్త క్లూస్ కనిపెట్టే సీన్ థ్రిల్ ఇస్తుంది. సినిమా మొదటి భాగంలో కాలేజీ అమ్మాయి లవ్లీ మాథన్ మిస్సింగ్ కేసును ఆనంద్ విచారించే విధానం, ఆ తర్వాత ఆమె చనిపోయిందని తేలడం, హంతకుడిని పట్టుకునే క్రమంలో వచ్చే మలుపులు చాలా వేగంగా సాగుతాయి.

పోలీసుల అజాగ్రత్త వల్ల కేసు ఎలా తలకిందులు అవుతుందో చూపించే సీన్ ఈ సినిమాకే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ‘శ్రీదేవి మర్డర్ కేసు’ ఫైల్‌ను ఆనంద్ చేతికి ఇచ్చే సీన్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆనంద్ తన టీమ్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ కోసం ఆ పల్లెటూరికి వెళ్ళినప్పుడు, అక్కడి ప్రజలు,  స్థానిక రాజకీయ నాయకులు పోలీసులను అస్సలు నమ్మరు.

వారిని ఊరి నుండి పంపించేయడానికి చూస్తారు. ఎలాంటి మద్దతు లేకపోయినా, ఊరి ప్రజల వ్యతిరేకతను తట్టుకుంటూ ఆనంద్ టీమ్ నిలబడే సీన్లు ఆకట్టుకుంటాయి. ఊహించని ఒక వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడని ఆధారాలతో సహా ఆనంద్ నిరూపించే క్లైమాక్స్ సీన్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ ముగింపు ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఎండ్ ఇస్తాయి. 

సినిమా  కొన్నిచోట్ల నిదానంగా సాగుతుంది. స్పీడ్ యాక్షన్ థ్రిల్లర్స్ చూసేవారికి ఇది కొంచెం ల్యాగ్‌గా అనిపించవచ్చు.క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా చూసే రెగ్యులర్ ఆడియన్స్‌కు,సెకండ్ హాఫ్‌లోని క్లైమాక్స్ ట్విస్ట్, హంతకుడు ఎవరో ముందే కొద్దిగా ఊహకు అందుతుంది.

రెండు కథలకు ఎలాంటి లింక్ ఉండదు. దర్శకుడు క్లాసిక్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాను అందించడంలో సక్సెస్ అయ్యారు. జిను వి. అబ్రహం రాసిన కథలో వాస్తవికత ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విజువల్స్‌కు అద్భుతమైన మూడ్‌ను, సస్పెన్స్ వైబ్‌ను తీసుకొచ్చింది. 
1990ల కేరళ పల్లెటూరి వాతావరణాన్ని, అప్పటి పోలీసుల విచారణ పద్ధతులను సినిమాటోగ్రఫీ ద్వారా చాలా రియలిస్టిక్‌గా రీ-క్రియేట్ చేశారు.

రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ  స్లో-బర్న్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ను రియలిస్టిక్ సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడేవారు ఓటీటీలో చూడదగ్గ చిత్రం అని చెప్పుకోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!