R.G.V thus realized his dreams…………………
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చదువుకునే రోజులనుంచి సినిమాల పిచ్చి. డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది.ఇంజనీరింగ్ పూర్తి అయ్యేక సినిమాల్లోకి ప్రవేశించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు.
అందులో భాగంగా వర్మ దృష్టి నిర్మాత రామోజీ రావుపై పడింది. అప్పటికే రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి ప్రతి ఘటన, శ్రీవారికి ప్రేమలేఖ వంటి హిట్ సినిమాలు తీసి పెద్ద నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు.
ఆయన దృష్టిలో పడేందుకు … ఆయన నేతృత్వంలో నడుస్తున్న” న్యూస్ టైం ” ఇంగ్లిష్ దిన పత్రికకు కష్టపడి వర్మఇంగ్లిష్ లోనే ఒక ఆర్టికల్ రాసారు.”ద ఐడియా దట్ కిల్డ్ థర్టీ మిలియన్ పీపుల్” పేరిట పంపిన ఆ ఆర్టికల్ లక్కీగా న్యూస్ టైమ్ లో పబ్లిష్ అయింది. హెడ్డింగ్ ఆకర్షణీయంగా ఉండటంతో సబ్ ఎడిటర్ దాన్ని పబ్లిష్ చేశారు.
అంత వరకు వర్మ ప్రయత్నం విజయవంతం అయినట్టే . ఆ ఆర్టికల్ ప్రచురణతో వర్మకు మేధావుల సర్కిల్లో మంచి పేరుకూడా వచ్చింది.ఆ ఆర్టికల్ లో జర్మనీ నియంత హిట్లర్ ఆలోచనా ధోరణి పై తత్త్వవేత్త నీషే ఏమనన్నాడు అనే అంశంపై వర్మ చర్చించారు.
అప్పట్లో హిట్లర్ కూడా తనను తాను ఒక తత్వవేత్తగ్గా భావించుకునే వాడు. ఆ యాంగిల్ లోనే ఆర్టికల్ లో చర్చ జరిగింది. వర్మ నీషే వంటి గొప్ప తత్త్వవేత్త పుస్తకాలు చదవడం కూడా గొప్ప విషయమే.
ఈ క్రమంలోనే ఒక రచయితగా రామోజీరావు ను కలవాలని ప్రయత్నం చేసి సఫలీ కృతులు అయ్యారు. ఒక రోజు రామోజీ రావు ని కలసి ధన్యవాదాలు చెప్పారు వర్మ. ఆ సందర్భంలోనే సినిమా కథ .. దర్శకత్వం గురించి రామోజీ రావు తో మాట్లాడారు. ఒక్క అవకాశం ఇప్పించమని కోరారు. అనుభవం గురించి రామోజీ రావు అడగ్గా వర్మ ఏమి చెప్పలేకపోయారు.
అయితే దర్శకుడికి అనుభవం అవసరంలేదు .. చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత, దాన్ని తెరకెక్కించగల నైపుణ్యం ఉంటే సరిపోతాయని వర్మ వాదించారు. ఈ వాదనతో రామోజీ రావు అంగీకరించలేదు. ప్రాక్టికల్ గా అనుభవం లేనందున చాన్సు ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పేసారు.
ఆపై ఏమీ మాట్లాడకుండా వచ్చేసిన వర్మ సినిమా ప్రయత్నాలు మానేసి నైజీరియా వెళదామనుకున్నాడు. కానీ వెళ్ళలేదు. ఆ తర్వాత రామోజీరావును కూడా కలవలేదు. అయితే వర్మ లో కసి పెరిగింది. ఆ కసితోనే వెళ్లి 5 వ అసిస్టెంట్ డైరెక్టర్గా బీ. గోపాల్ దగ్గర చేరారు. ఈ విషయాలన్నీ వర్మ తన ఆత్మకథలో రాసుకున్నారు.
తర్వాత రోజుల్లో నాగార్జునను కలసి ‘శివ’ కథ చెప్పడం ఆయన ‘ఒకే’ అనడం చకచకా జరిగిపోయాయి. రామ్ గోపాల్ వర్మ తండ్రి కృష్ణంరాజు వర్మ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సౌండ్ రికార్డిస్ట్ గా చేసేవారు. నాగార్జున ను కలవడానికి కృష్ణంరాజు వర్మ సహకరించారు. ఆ తర్వాత విషయాలు అందరికి తెలిసినవే. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ అలా తన కలను సాకారం చేసుకున్నారు.
———— KNMURTHY