రాజకీయాల్లోకి వచ్చి రాకముందే కోట్లు కూడగట్టాలనే ఆలోచనలో ఉంటున్నారు ఎంతోమంది. అలాంటిది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని ప్రభుత్వానికి ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉంటారా? అలాంటి అరుదైన నేతలు ఇంకా ఈ భూమ్మీద ఉన్నారు. ఆయన మరెవరో కాదు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
తండ్రి బిజూ పట్నాయక్ నుంచి వారసత్వంగా వచ్చిన 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని నవీన్ ప్రభుత్వానికి ఇచ్చేసారు. కటక్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనకు సంక్రమించిన ఆస్తులను ప్రభుత్వం పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు.రెండంతస్తుల లో విస్తరించిన ఈ 22 గదుల భవనాన్ని నవీన్ తాత లక్ష్మీనారాయణ పట్నాయక్ నిర్మించారు. ఈ భవనాన్నిమ్యూజియం , లైబ్రరీ గా మార్చారు. 2015 లో ఈ ఆస్తులను ఆయన ప్రభుత్వానికి అప్పగించారు.
ఇక ఎప్పుడూ తెల్లటి లాల్చీ, పైజమా మాత్రమే ధరించి సింపుల్ గా కనిపించే నవీన్ పట్నాయక్ 1997లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి దిగారు. తండ్రి పేరుమీద బిజూ జనతాదళ్ రాజకీయ పార్టీని నెలకొల్పారు. నాటి నుంచి నేటివరకు ఒడిస్సా రాజకీయాల్లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు.దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనని ఏకైక ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అంటే అతిశయోక్తి కాదు.
వరుసగా ఐదోసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000,2004,2009,2014,2019 ఎన్నికల్లో గెలిచి నేటికీ సీఎంగా అధికారంలో ఉన్నారు. 2014లో, మోడీ ప్రభంజనం వీస్తున్నప్పటికీ 147 లో 117 అసెంబ్లీ స్థానాలు … 21 లోక్‌సభ స్థానాలకు 20 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించారు.
ఒడిశా ప్రజలంతా తన కుటుంబమే అన్న మెసేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం నవీన్ విజయ రహస్యాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. ‘ఈ మనిషి మన కోసమే ఉన్నాడు’ అని ప్రజలు గట్టిగా నమ్ముతారు.అందుకే ఆయనకు వరుస విజయాలు సాద్యమైనాయి. దీనికి తోడు అక్కడ బలమైన ప్రతిపక్షం లేదు. విశ్వసనీయ నాయకులు లేరు.ఈనాటికి అదే పరిస్థితి.
కాంగ్రెస్ నేత జేబీ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత నవీన్ కు సవాల్ విసిరే నేత మరొకరు రాలేదు. బీజేపీ లో బలమైన నాయకుడు లేకపోవడం కూడా నవీన్ పట్నాయక్ కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కంధమాల్ మారణహోమం ఘటన తర్వాత 2009లో ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకుని నవీన్ పట్నాయక్ తన లౌకికతను నిరూపించుకున్నారు. అప్పటినుంచే పట్నాయక్ తిరుగులేని నేతగా ఎదిగారు.
తండ్రిలాగే అధికార యంత్రాంగం పై పట్టు బిగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించారు.నవీన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒడిశా చాలా అభివృద్ధి సాధించింది. పేదల కోసం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టారు. ఎనిమిది మిలియన్లకు పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన నుండి పైకి వచ్చారు. ఒక మిలియన్ పక్కా గృహాల నిర్మాణం, ఇతర ప్రజాకర్షక పథకాలు ఓట్ల వర్షం కురిపించాయి.