మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో సారి బయట పెట్టారు. ఈ కథనం లో అసత్యాలుంటే ఖండించవచ్చు అని డాక్టర్ గారు చెబుతున్నారు. రామోజీరావు స్పందిస్తారేమో చూద్దాం.
———————
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు………………………………………………….
చరిత్ర లో N.T. రామారావు గారి చివరి ఘట్టం …. నిజా- నిజాలు … నిష్పక్షపాత ధోరణిలో…అసలు కారణాలు ఏమిటి.. ఎవరు కారకులు .?..వారు ఎందుకు అలా ప్రవర్తించారు…? అసలు ఈ విషయాలు నేను ఎందుకు రాయాలి….?
రామారావు గారు తెలుగువారి చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి …. సినిమా ప్రపంచంలో నటుడుగా శిఖరాగ్రేశ్వరుడు.ఎంతటి వారంటే రాముడంటే, కృష్ణుడంటే, తెలుగువారి ఇలవేల్పు వెంకటేశ్వరుడు అంటే, వారితో పాటు దుర్యోధనుడు, భీష్ముడు , అర్జునుడు వంటి ఎన్నో పాత్రలు వీరికి ముందు, వీరికి వెనక వేరే ఎవ్వరూ గుర్తుకు రాకుండా చేసిన వ్యక్తి …. రాజకీయ రంగంలో కూడా ఒక్కడిగా వచ్చి , పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి పాలనను ప్రజల వద్దకు తెచ్చి రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి…. అటువంటి వారి చివరి ప్రస్థానం కు సరైన సమాధానం చెప్పుకోవడానికి ఎంతోకొంత వెలితి కలిగిస్తున్న నేపథ్యంలో… నా , ఈ కథనం అవసరం అనిపించింది….రామారావు గారి జన్మదిన సందర్భంగా మరొక్కసారి Facebook ద్వారా.. ఒకేసారి కుదరదు కాబట్టి మూడు..నాలుగు ఎపిసోడ్ లుగా.
రామారావు గారి చివరి ఘట్టానికి కారకులు ప్రముఖంగా కనపడేది చంద్రబాబు నాయుడు. అయితే మిగిలిన వారు కొంతమంది ఏ విధంగా తమ తమ స్వార్ధ ప్రయోజనాలు, ఆలోచనలతో దీనికి కారణమయ్యారు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇందులో లక్ష్మీపార్వతి,రామోజీరావు, హరికృష్ణ, బాలకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,ఆనాటి శాసనసభ్యుల తో పాటు టు నేను… వీరందరూ ఎంతో కొంత తెలిసి చేసినా, తెలియక చేసినా రామారావుగారి ఆనాటి పతనానికి, నిష్క్రమణ కు కారణం అయ్యారు. ఎలా అంటారా….?
మొదట ప్రారంభం ఎక్కడ జరిగిందంటే రామారావు గారి పై రామోజీరావు గారి ఆలోచనలలో తేడా రావడం తో మొదలయ్యింది. ఎందుకంటారా….? రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా రామారావు గారికి ప్రచారం చేయటం తెలిసిందే. ఆ నేపథ్యంలో తన వలనే రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే అభిప్రాయం రామోజీ రావు గారిలో గట్టి గా స్థిరపడింది. తర్వాత రోజుల్లో రామారావు గారు రామోజీరావు గారి ఎడ ఎంతో గౌరవంతో ఉన్నప్పటికీ, తనతో చర్చించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం రామోజీరావు గారి కి నచ్చలేదు. ముఖ్యంగా కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం, పేదలకు పక్కా గృహ నిర్మాణాలు చేయడం, ట్యాంక్ బండ్ మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటుచేయడం, వీటితోపాటు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రామారావు గారు జాతీయ రాజకీయాలలో పాల్గొనడం, తనతో చర్చిచకుండా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోవడం లాంటి నిర్ణయాలు అన్నీ తనకు తెలియకుండా జరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తన యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్నదని వారు భావించారు..
ఇంకా నేను ప్రత్యక్షంగా రామోజీ రావు గారితో కలిసిన సందర్భంగా ఈ విషయాలన్నిటి మీద మాట్లాడటం నాకు గుర్తు.”ఈనాడు “లో ఆరోజుల్లో అప్పుడప్పుడు వీటి పై కథనాలు కూడా వచ్చేవి..ఒక సారైతే రామారావు గారు పక్కా గృహ నిర్మాణ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకంగా ఈనాడు ఫ్రంట్ పేజీ లో రామారావు గారిని మాంత్రికునిగా వేషధారణ చేసి మెడలో పుర్రెలతో దండ వేసి చేతిలో పెద్ద ఎముకను పెట్టి … పైన “హమ్ ఫట్ – లక్ష ఇల్లు” అని కేప్షన్ వ్రాసి … వ్యతిరేకత వచ్చేలా కార్టూన్ వేశారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలప్పుడు కూడా అన్ని రామారావు గారి ముఖాలు పెట్టి అవహేళన చేస్తూ పెద్ద కార్టూన్ ఈనాడు ఫ్రంట్ పేజీ లో బ్యానర్ కార్టూన్ వేశారు…చంద్రబాబు మాత్రం రామోజీరావు గారితో సఖ్యతతో ఉండేవారు. నేను కొంచెం దూకుడుగా ఉండేవాడిని. ఈ విభేదం ఎంతవరకు వెళ్లింఅదంటే…1989 లో రామారావు గారు మంత్రి వర్గం నిర్ణయాలు లీకు అవుతున్నవని 30మంది మంత్రులను ఒక్కసారి తొలగించినప్పుడు .రామారావు గారిని తొలగించాలనేదాకా …ప్రభుత్వాన్ని పడవేయాలనేదాకా రామోజీరావు గారు ఆలోచన చేశారు.
ఇంకా దీనికి మరింత సాక్ష్యాధారాలు కావాలంటే 1989 ప్రాంతంలో ఈనాడు పత్రిక తీసి చదవండి. అది ఏప్రిల్ మాసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం రామోజీరావు గారు రామారావు గారిని తొలగించటానికి గట్టి ప్రయత్నమే చేశారు…. 130 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు తిరగబడండి అని రామోజీ రావు గారు మూడు సార్లు ఎడిటోరియల్స్ రాశారు….ఆ రోజు ఆ ప్రయత్నంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి , కే. ఈ కృష్ణమూర్తి ,వసంత నాగేశ్వరరావు, స్పీకర్ నారాయణరావు, ఉపేంద్ర వంటి ఇత్యాదులు కూడా చేరారు . చంద్రబాబు ప్రమేయం అనుమానాస్పదం . ఆశ్చర్యం కలిగించే విషయం కదా ?. అసలు ఇది జరిగినట్లు నేటి ప్రజలకు తెలియదు. కావాలంటే ఆనాడు ఈనాడులో బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి కృష్ణారావు గారిని అడగవచ్చు. వారు ప్రత్యక్ష సాక్షి.
“ఈనాడు “లో పనిచేసిన రిపోర్టర్లు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులే….. నేను ఆ 130 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా మేనేజ్ చేశానో, ఏ విధంగా నచ్చజెప్పి, ఏ విధంగా వీరందరినీ తిరిగి రామారావుగారితో ఉండేవిధంగా చేశానో ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో హోటల్స్ లోనూ, రిసార్ట్స్ లోనూ క్యాంపులు పెట్టలేదు . కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. మొత్తానికి వ్యతిరేక వర్గం లో (రామోజీ రావు గారి వర్గంలోకి) కేవలం ఏడుగురు మాత్రమే మిగిలేటట్లు చేశాను. ఇందాక చెప్పిన నలుగురితో పాటు ఎమ్మెల్యే లు దొమ్మేటి రామచంద్రారెడ్డి ..మెదక్ జిల్లా ఎమ్మెల్యే., బుడ్డావెంగలరెడ్డి ఆత్మకూరు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడి వెళ్ళారు…. నేనే స్వయంగా గా రామోజీరావు గారి వద్దకు వెళ్లి … ప్రార్థించాను. మీరు ఈ విధంగా చేయటం బాగాలేదు మీ వద్ద కేవలం ఆరు, ఏడు మంది శాసన సభ్యులు మాత్రమే మిగిలిపోతారని, డబల్ డిజిట్ శాసనసభ్యులు కూడా మీ వద్ద లేరని చేతులెత్తి పది వేళ్లు చూపించాను.
రామోజీ రావు గారు నన్ను “నీవు చిన్నవాడివి,నీకు ఏమి తెలియదు వెళ్ళిపోమన్నారు.”, పార్లమెంటు సభ్యులు కూడా మా దగ్గర ఉన్నారని చెప్పారు…. రామారావు గారిని దించేస్తున్నామని చెప్పారు….. చివరకు ఏడుగురు మాత్రమే బయటకు వెళ్ళారు. చివరకు ఈ మంత్రుల బొమ్మలు వేశి సొరకాయలు కోస్తున్నట్లు కార్టూన్ వేశారు. అంతేకాదు వారు వేరే పార్టీ కూడా పెట్టడం జరిగింది…ఈ ఉదంతాన్ని నా “ఒక చరిత్ర కొన్ని నిజాలు ” రచనలో వివరించాను. రామోజీ రావు గారు జీవించి ఉన్నారు కాబట్టి నా ఈ కథనంలో లో ఏదైనా అసత్యమనిపిస్తే ఖండించవచ్చు. ….చంద్రబాబు ఈ సందర్భంగా ఏమి చేస్తున్నారంటే… సైలెంట్ .
ఈ నేపథ్యంలో రామోజీ రావు గారు రామారావు గారి ఎడల ఎంతో వ్యతిరేకత తో ఉండి ఏ మాత్రం అవకాశం దొరికినా రామారావు గారిని వ్యతిరేకించడానికి “రెడీ” గా ఉన్నారు…. ఇందుచేతే రామారావు గారిని 1995 ఆగస్ట్ మాసంలో దించినప్పుడు రామోజీ రావు గారు….ప్రధాన భూమిక పోషించింది. చంద్రబాబుకు అండగా నిలిచి,అనునిత్యం సంప్రదింపులు చేస్తూ వార్తాకథనాలు పుంఖాను పుంఖాలుగా చంద్రబాబుకు అనుకూలంగా రామారావు గారికి వ్యతిరేకంగా ప్రచురించారు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చేయగలిగారు. రామారావు గారు చనిపోయినప్పుడు చంద్రబాబు మీదకు విసిరిన చెప్పులు ఏరితే ఒక లారీడు అయ్యాయి..అయినా చంద్రబాబు మీద వ్యతిరేకత రాకుండా చంద్రబాబుకు అంతా సులువు అయ్యేలా చేశారు. ఈవిధంగా రామోజీ రావు గారు రామారావు గారు నిష్క్రమించిన ఘట్టం లో ప్రధాన భూమిక పోషించారు….
( 28 – 5 -2021)
( మిగతా వివరాలు తర్వాత భాగం లో )