రాఘవేంద్రుడి మార్క్ సినిమా!

Sharing is Caring...

Subramanyam Dogiparthi  …………………………..

రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ ఒకటి కృష్ణ అతిధి పాత్రలో కనిపించే మహేష్ బాబు సినిమా.

1980 మార్చి 29 న విడుదల అయిన ఈ ‘ఘరానా దొంగ’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ చలాకీగా, హుషారుగా, ఎనర్జిటిక్ గా నటించారు.ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అవటానికి కారణం అయింది.అంతకు మించి అతిలోకసుందరి శ్రీదేవి ఉండనే ఉంది.సూపర్ స్టార్ శ్రీదేవిలను ప్రకాష్ మరింత అందంగా చూపారు.

సినిమా రివెంజ్ కధే అయినా రొటీన్ గా ఉండదు. కథలో కాస్త కొత్తదనం ఉంది. టార్జాన్ సినిమాల్లోలాగా హీరోకి ఓ గుర్రం ఉంది. కొన్ని సాహసాలు ఆ గుర్రం కూడా చేస్తుంటుంది. చోర వృత్తిలో ఉన్న హీరో మంచివాడయి, బ్యాంకు లాకర్లకు సేఫ్ గా ఉండే తాళం ప్లానుని తయారు చేస్తాడు. 

విలన్లు దానిని దొంగలించే ప్లాన్ ను భంగం చేసి, తన తల్లి శీలం మీద పడ్డ మచ్చను తొలగించి , హీరోయిన్ అతిలోకసుందరిని పెళ్లి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది. టూకీగా ఇదీ స్టోరీ . స్టోరీలన్నీఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. వాటిని చెప్పే తీరు. మాటలు పాటలు డాన్సులు కధను బోర్ కొట్టించకుండా నడిపించటం, చక్కగా చిత్రీకరించటం ముఖ్యం.

సత్యానంద్-జంధ్యాల జంట కధను నేస్తే , డైలాగులను సత్యానంద్ ఒక్కరే వ్రాసారు పదునుగా. సత్యానంద్-జంధ్యాలలు కొన్నాళ్ళు ఇద్దరూ కలసి కథలు వ్రాసారు. ఆ టైం లో తయారైన కథ ఇది. రావుగోపాలరావు ప్రధాన విలన్  గా .. ఆయన కొడుకు ,చిన్న విలన్ గా మోహన్ బాబు చేశారు.

ఈ మాస్టరు మైండ్ బాబూలాల్ ప్లాన్ అంటూ ఉంటాడు రావుగోపాలరావు. ఇందులో సూపర్ స్టార్ భద్రయ్య అనే మారువేషం వేస్తారు. క్లయిమాక్స్ లో వస్తుందది. చక్రవర్తి  ప్రేక్షకులను ఉర్రూతలూగించే పాటల్నిఅందించారు. అందులో వేటూరి వారి పాటలు. ఓ వాన పాట కూడా ఉందండోయ్ .

‘వాన విడిచిన వేళ’ , ‘రొట్టె విరిగి నేతిలో పడ్డాక’ , ‘పంపరపనస పండురో’ , ‘ఓ ముద్దు కృష్ణా’ , ‘ధిమికిట ధిమికిట’ , ‘చిటికెల మెటికల మేళాలంట’ పాటలు హుషారుగా , శ్రావ్యంగా ఉండటమే కాకుండా హిట్టయ్యాయి కూడా.  హీరో తల్లిగా పుష్పలత, చెల్లిగా గీత తమ పాత్రలకు న్యాయం చేశారు. మమత, సారధి, మాడా, అల్లు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

కె ఎస్ ప్రకాష్ కెమెరా పనితనం బాగుంటుంది. చక్రవర్తి బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఓ బెంగాలీ సినిమాకు రీమేక్ అయిన ఈ ఘరానాదొంగ సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . కృష్ణ , అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడవచ్చు .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!