Srilanka Crisis ………………
నిన్న మొన్నటి దాకా నిత్యావసరాల కోసం క్యూ …. పెట్రోల్ కోసం క్యూ … తాజాగా వలసల కోసం క్యూ …పై ఫొటోలో కనిపించేది శ్రీలంక పాస్ పోర్ట్ కార్యాలయం ముందున్న క్యూ. రోజు రోజుకి అక్కడ క్యూలు పెరుగుతున్నాయి.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక వాసులు ఉపాధి వెతుక్కుంటూ దేశం దాటేందుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో నిత్యావసరాలు అందటం లేదు. ఏదీ దొరకడం లేదు.
దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. తమ పరిస్థితి ఎలా ఉన్నా..తమ పిల్లలకు కనీస ఆహారం కూడా అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఉపాధి వెతుక్కుంటూ ఏదో ఒక దేశం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక దేశం.. గత ఏడాది మొత్తం మీద 91,331 పాస్పోర్ట్లు జారీ చేసింది.
ఈ ఏడాదిలో మొదటి ఐదు నెలల్లోనే 2,88,645 మందికి పాస్పోర్టులు ఇచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2019లో ఈస్టర్ వేళ జరిగిన బాంబు దాడి, ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి, వీటికి తోడు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాలక వర్గం.. శ్రీలంక వాసుల జీవితాలను అతలాకుతలం చేశాయి.
ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం 33 శాతానికి పెరిగింది. కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల్లో ఉపాధి వెతుక్కునే వారిపట్ల అక్కడి ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. అడిగిన వారికి పాస్పోర్ట్లు మంజూరు చేస్తున్నారు. అలా అయినా వారు పంపే డాలర్లు అక్కరకు వస్తాయని ఆశిస్తోంది.
దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు చాలామంది పాస్ పోర్టులు తీసుకుని కువైట్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వంటగ్యాస్ దొరకడం లేదు. ఆహార పదార్థాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.
కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే మార్గాలు లేక వలసలు పోవడమే మేలని భావిస్తున్నారు. కూలీలు, చిన్నపాటి వ్యాపారులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, గృహిణులు కూడా వలస పోవడానికి సిద్ధమౌతున్నారు.
ఇక తమ దేశం పెనుఆహార సంక్షోభం అంచున ఉందని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే పాస్పోర్టు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఊహించని జనాల తాకిడికి అక్కడి యంత్రాంగం తట్టుకోలేకపోయింది.