తర్జని కథల పోటీలో ఎంపికైన థ్రిల్లర్ స్టోరీ!

Sharing is Caring...

మా ఇంటికి దగ్గర్లో ‘భలే పార్కు’లో ఒక్కణ్ణీ కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఉన్నట్లుండి ఎవరో, “ఆత్మారాం గారూ, నాకు మీ సాయం కావాలి” అనడం విని తలెత్తి చూస్తే, సుమారు ముప్పైఏళ్ల యువకుడు.చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడి, “మీరు మానస్ కదూ!” అన్నాను. మరుక్షణం వళ్లు గగుర్పొడిచింది. మానస్ సుధేష్ణ అనే యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను విడిపించే ప్రయత్నం చేసిన భీమేష్‌ని అతి క్రూరంగా హత్య చేసి పరారీలో ఉన్న ప్రమాదకరమైన నేరస్థుడు.

ఐతే ఆ కేసులో కొన్ని లొసుగులున్నాయి. అందుకని ఇనస్పెక్టర్ ప్రమోద్- ఆ వివరాలు, మానస్ ఫొటో నాకిచ్చాడు. ఏకాంతంగా ఆలోచిద్దామని  పార్కుకొస్తే, స్వయంగా తనే వచ్చి పలకరించి షాకిచ్చాడు మానస్.అప్పటికి చాలా హత్యలు, అత్యాచారాల కేసుల చర్చల్లో పాల్గొని ఉన్నాను. కానీ, నేరుగా హంతకుణ్ణి- అదీ ఏకాంతంలో కలవడం ఇదే ప్రథమం.

అతడు నా ముందు కూర్చుని, “జస్ట్ ఫొటో చూసి ఎప్పట్నించో ఎరిగిన్నట్లు, వెంటనే గుర్తుపట్టారు. నా రూపం మీ మనసులో అంతలా ప్రతిష్ఠించబడిందన్న మాట! ఇప్పుడు నేనే ముందున్నాను. నా మొహం చూసి చెప్పండి. నేను హత్యలు చెయ్యగలననిపిస్తోందా?” అన్నాడు.మనిషిని చూసి అంతరాత్మ ఆలోచనల్ని పసికడతానని నాకు పేరు. అందుకే పోలీసులకి తరచు నా అవసరం పడుతూంటుంది. అది మానస్‌కి తెలుసనుకుంటాను. కిడ్నాపరూ, హంతకుడూనూ- ఆ మాత్రం సమాచారం అందుబాటులో ఉండదా?

అడిగాడని కాకపోయినా, షాక్‌నుంచి మరింత త్వరగా కోలుకోవడం కోసం, అతణ్ణోసారి తేరిపార చూశాను. భయమో, గగుర్పాటో, మరేమో చెప్పలేను కానీ- నాకు మెదడు బ్లాంకైపోయింది.“ఇక్కడ నా అభిప్రాయం ప్రధానం కాదు. మీరు నిజంగా నిర్దోషి ఐతే, ముందు వెళ్లి పోలీసులకి లొంగిపొండి. వాళ్ల పరిశోధనలో నిజం బయటపడుతుంది” అన్నాను.“అలాగే చేసేవాణ్ణి. కానీ పోలీసులు నమ్మేది నా మాటలు కాదు. సాక్ష్యాల్ని. అవి నాకు వ్యతిరేకంగా ఉన్నాయి”
“అలాంటప్పుడు నా అభిప్రాయం మీకెందుకు పనికొస్తుంది?” అన్నాను.

“నాకు అనుకూలంగా పనికొచ్చే సాక్ష్యం ఎక్కడుందో చెబుతాను. అది మీరు బయటపెట్టి పోలీసులకి చెప్పాలి. అందుకు ముందు మీరు నేను నేరం చెయ్యలేదని నమ్మాలికదా!” అన్నాడు మానస్.
“ఏమిటా సాక్ష్యం?” అన్నాను కుతూహలంగా.
“సాక్ష్యం కాదు, ఆత్మఘోషనుకోండి. ఏదైనా ఇప్పుడు చెప్పకూడదు” అన్నాడు మానస్ దృఢస్వరంతో.

“ఆశ్చర్యంగా ఉందే! పనికొచ్చే సాక్ష్యముంది. అదేమిటో చెప్పరు. పోనీ, ఆ సాక్ష్యమేదో మీరే బయటపెట్టొచ్చుగా” అన్నాను.
“నా విషయం అలాగుంచండి- పోలీసుల సాయం లేకుండా, దాన్ని బయటపెట్టడం మీవల్లకూడా కాదు” అన్నాడు మానస్.
“అలాంటప్పుడు నేనెందుకు? మీరే నేరుగా వెళ్లి పోలీసులకా మాట చెప్పొచ్చుగా!” అన్నాను.

“ఎందుకంటే, ఆ సాక్ష్యం సుధేష్ణ తండ్రి నరహరి ఇంట్లో బెడ్రూంలో బట్టల బీరువాలో ఉంది. సమాజంలో ఆయనకున్న పలుకుబడి మీకు తెలుసు. పోలీసులు కూడా బలమైన కారణం లేకుండా అక్కడికెళ్లి వెతుకుతారనుకోను” అన్నాడు మానస్.విషయం కొంత అర్థమైంది. పెద్దమనుషుల రహస్యాలు వాళ్ల ప్రైవేటు గదుల్లో ఉంటాయి. అవి అంత సులువుగా బయటపడవు.

“మీ గదిలో భీమేష్‌ హత్య జరిగితే, ఆ నేరం మీమీదకెలా వచ్చింది? సాక్ష్యం నరహరి గదిలోకెలా వెళ్లింది?” అన్నాను.
“భీమేష్ అఖండుడు. అపరిచితుడిగా నా గదికొచ్చి నన్నే బందీని చేశాడు. సుధేష్ణని కిడ్నాప్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా నా గదిలో ఉంచాడు. బందీలుగా ఉన్న నేను, సుధేష్ణ అప్పుడే ఒకరికొకరు పరిచయమై నాలుగు రోజుల్లో ఒకరినొకరు ఇష్టపడ్డాం కూడా. ఆ తర్వాత నరహరి ఎలాగో భీమేష్ ఉనికి తెలుసుకుని ఓ కిరాయి హంతకుణ్ణి నా గదికి పంపాడు. వాడు నా కళ్లముందే భీమేష్‌ని కసిగా చంపేశాడు.

హత్య చేసిన కత్తిమీద నా వేలిముద్రలు పడేలా చేశాడు. నా రుమాలు తీసుకుని హతుడి రక్తంతో తుడిచి శవం పక్క పడేశాడు. నాకూ, సుధేష్ణకీ స్పృహ తప్పించాడు. స్పృహ తెలిసేసరికి వేరెక్కడో ఉన్నాను. నామీద పరారీలో ఉన్న హంతకుడిగా ముద్ర పడింది”నేను విన్నదానికి భిన్నమైన కథ. నమ్మ తగ్గదిగానే ఉంది. కానీ, “అదిసరే! ఇంతకీ మిమ్మల్ని మీరు కాపాడుకోగల ఆ సాక్ష్యమేమిటి? అది నరహరి బెడ్రూంలోనే ఉందని మీకెలా తెలుసు?” అన్నాను.

“చెప్పానుగా, అది నేను చెప్పకూడదు. మీరు పోలీసులని ఒప్పించి ఎలాగో అలా ఆ సాక్ష్యాన్ని బయటపెట్టి నాకొచ్చిన అపవాదు పోగొట్టి నా పరువు నిలబెట్టండి” అన్నాడు మానస్. అంతలో నన్నెరిగున్నవాళ్లెవరో అలా వచ్చారు. మానస్ చటుక్కున పొదల మాటుకి తప్పుకున్నాడు. మరి కనబడలేదు.

నేను మర్నాడు ఇనస్పెక్టర్ ప్రమోద్‌కి మానస్ చెప్పిన కథ చెప్పాను. ముందు అతడీ కథని నమ్మలేదు. “చెప్పాలంటే మానస్ మీ పోలీసులకో సవాలు విసిరాడు- దమ్ముంటే నరహరి ఇంట్లో సాక్ష్యం వెదికి పట్టుకొమ్మని! మనమతడి కథని నమ్మకపోతే నరహరికి బెదిరిపోయినట్లవుతుంది” అన్నాను. ప్రమోద్ నేననుకున్నట్లే రియాక్టయ్యాడు.

ఇలాంటి సందర్భాల్లో పోలీసులకి ఓ దారుంది. డిపార్టుమెంట్లోనే కొందరికి కరడు కట్టిన నేరస్థుడిలా నటించగల శిక్షణ ఇస్తారు. ఇలాంటప్పుడు వాళ్లని జైల్నించి తప్పిపోయిన నేరస్థులన్న బిల్డప్ ఇస్తారు. వాళ్లు పారిపోతూ లక్ష్యం చేరతారు. పోలీసులు తరుముతూ అక్కడికెళ్లి అనుకున్న సోదాలు చేస్తారు.

అదే ఇప్పుడు ప్రమోద్ అమలు జరిపాడు. అక్కడ నిజంగానే సాక్ష్యమేదైనా బయటపెడితే నాకు వెంటనే ఫోన్ చెయ్యమన్నాను. ఆ రోజు సాయంత్రమే ప్రమోద్ నుంచి ఫోనొచ్చింది. ఆత్రుతగా, “చెప్పు ప్రమోద్!” అన్నాను.
“నువ్వు ఆత్మల్ని చూడగలవనీ, వాటితో మాట్లాడతావనీ అనడానికి మరో ప్రత్యక్ష సాక్ష్యం నేటి ఉదంతం” అన్నాడు ప్రమోద్.

“ముందు ఏం జరిగిందో చెప్పు” అన్నాను ఆత్రం పట్టలేక.
“ఆ బీరువాలో మానస్ శవం ఉంది” అన్నాడు ప్రమోద్.
వెంటనే నాకు షాక్.
ఆ మాటతో ఆ కేసులో ఏం జరిగిందో ఊహించాను. అంటే నిన్న నేను పార్కులో విన్నది, మానస్‌కి అనుకూల సాక్ష్యపు వివరాలు కాదు. అతడి ఆత్మఘోష!

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!