సూపర్ స్టార్ సినిమాలకు కెమెరా కెప్టెన్ ఈయనే !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………………. 

పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి చేస్తారు.

ఈ ఏరియాలో పుష్పాల గోపీకృష్ణ  కాస్త పాపులర్. విఎస్ఆర్ స్వామి తర్వాత ఈయనే సూపర్ స్టార్ సినిమాలకు కెమేరా కెప్టెను.ముఖ్యంగా విజయనిర్మల తీసిన చాలా సినిమాలకు గోపీకృష్ణ కెమేరా పని చేసేవాడు. పుష్పాల గోపీకృష్ణ స్వగ్రామం చిత్తూరు, అలా రాయలసీమ కుర్రాడితను.చిన్నతనం నుంచీ బొమ్మలు వేయడం అంటే పుష్పాల గోపీకృష్ణ  కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మద్రాసు చేరి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రలేఖనంలో డిప్లమో చేశారు. 

అలాగే మంచి చిత్రకారుడు అని కూడా అనిపించుకున్నారు. మరలాటప్పుడు కళాదర్శకత్వం విభాగంలోకి వెళ్లిపోవాలి కదా … అలా వెళ్లలేదీయన.ఆయన చూపు కెమేరామీద పడింది. అదీ మూవీ కెమేరామీద. అది నేర్చుకుని ఆ రంగంలో జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత తిన్నగా ఎల్ వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనందబాబును కల్సారు.తాను బేసిక్ గా ఆర్టిస్టుననీ .. అయితే ఇలా చలనచిత్ర ఛాయాచిత్రకారుడుగా మారాలనుకుంటున్నానని అందుకు అవకాశం ఇప్పించమనీ కోరాడు.

చక్కని ఆర్టిస్టు … చక్కని ఛాయాదర్శకుడు అవుతాడనే భరోసాతో … అక్కినేని ఆనందబాబు ఎమ్ వి రావ్ గార్లు ప్రోత్సాహించి … ప్రసాద్ ప్రొడక్షన్స్ కెమేరా విభాగంలో చేర్చుకున్నారు.అక్కడ జీవితం మామూలుగా ఉండదు. ఎవరు కెమేరా బుక్ చేసుకున్నా ప్రొడక్షన్ తరపున వీళ్లు హాజరు అవ్వాలి.

అక్కడ కెమేరా దర్శకుడు ఎవరైతే వారి కింద పని చేయాల్సి వస్తుంది. అలా పనిచేసినప్పుడే పని వస్తుందనే నమ్మకం పుష్కలంగా ఉన్న గోపీకృష్ణ శ్రమ అనుకోకుండా పన్లోకి దిగిపోయారు. అలా చాలా మంది గురువులున్నారు ఆయనకి. అసలు పుష్పాల గోపాలకృష్ణ కి  సినిమాటోగ్రాఫర్ కావాలనే కోరిక కలగడానికి కారణం సి.నాగేశ్వర్రావుగారు.ఇలా ప్రసాద్ ప్రొడక్షన్స్ లో ప్రవేశించిన తర్వాత నాగేశ్వరరావుగారికి ఏకలవ్య శిష్యుడుగా మారిపోయారు. సి.నాగేశ్వర్రావు అంటే మరి ఆ రోజుల్లో స్టార్ డీవోపీ.

ఆ సి.నాగేశ్వర్రావుగారి కుమారుడే … ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలకు కెమేరా పనిచేసే విజయ్ సి కుమార్. ఆ విషయం కాసేపు పక్కన పెడితే .. కలర్ ఫొటోగ్రఫీ చేయడం అనే ప్రక్రియ బాలీవుడ్ కెమేరా దర్శకుడు జి.సింగ్ నుంచీ తెల్సుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఆనందబాబు గారికి చెందిన ప్రసాద్ ప్రొడక్షన్స్ ఆఫీసులో కెమేరా విభాగంలో పనిచేస్తున్నప్పుడు నేర్చుకున్న విద్యలే.

తను ప్రధానంగా ఆర్టిస్టు కావడంతో కెమేరా పని నేర్చుకోవడం ప్రభావవంతంగా చిత్రీకరించడం … లైటింగ్ సెట్ చేసుకోవడం సన్నివేశాన్ని అర్ధం చేసుకుని దాన్ని తెర మీద ఎలా వస్తే బావుంటుందో విజువలైజ్ చేసుకుని అందుకు తగ్గ లెన్సులు వాడుతూ … సన్నివేశాన్ని రక్తి కట్టించడం చాలా తేలికగానే అర్ధం చేసుకున్నారు.ఇలా ప్రసాద్ ప్రొడక్షన్స్ లో పనిచేయడం వల్ల అనేక మంది కెమేరామెన్ల దగ్గర వారి పనితీరు చూసి నేర్చుకునే అవకాశం దొరికింది.

ఆ సమయంలో వి.ఎస్.ఆర్ స్వామి దగ్గర ఆపరేటివ్ కెమేరామెన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఐదారు సినిమాలకు పనిచేశారు అంతే … కెమెరామెన్ గా ప్రమోషన్ వచ్చేసింది. అదెలా జరిగిందంటే … స్వామిగారి దగ్గర చేసిన సినిమాలన్నీ హీరో కృష్ణ వి  కావడంతో … అలా వారి కాంపౌండ్ దృష్టిలో పడ్డారు.అదే సమయంలో విజయనిర్మల డైరక్షన్ చేయాలనుకున్నారు. కృష్ణ సలహా మేరకు లోబడ్జెట్ లో ‘కవిత’అనే తెలుగు మళయాళ చిత్రాలకు ఆయనే పనిచేశారు.మీనాకి కూడా పుష్పాల గోపీకృష్ణ కెమేరా బాధ్యత నిర్వహించారు.

అలా పాడిపంటలు ఛాన్స్ వచ్చేసింది. అప్పటి వరకు పద్మాలయాలో విఎస్ఆర్ స్వామి గారే కెమేరా దర్శకుడు. అలాంటిది పుష్పాల గోపీకృష్ణ కు  అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వరసగా కృష్ణ  సినిమాలు పుష్పాలకు వచ్చేశాయి.త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డూండీ గారు తీసిన దొంగ సిరీస్ సినిమాలు పుష్పాల గోపీ కృష్ణ కెమేరా సారథ్యంలోనే  నడిచాయి.

మన వూరి కథ , రామరాజ్యంలో రక్తపాతం ఇలా వరసపెట్టి కృష్ణ గారి డిష్యుం డిష్యుం సినిమాలన్నింటికీ పుష్పాల గోపీకృష్ణ కెమేరా దర్శకుడు.పాడిపంటలు టైమ్ లో స్వామి గారు భక్తకన్నప్ప ఒప్పుకున్నారు. అయితే గోపీకృష్ణ అప్పటికీ స్వామి గారి దగ్గర ఫస్ట్ అసిస్టెంటే … ఆయన వెళ్లాకే … గోపాల్ రెడ్డి ,ఎం.వి రఘు లాంటి వాళ్లు స్వామి గారి టీమ్ లో చేరి పెద్దోళ్లు అయ్యారు.

అలా చాలా కాలం పాటు కృష్ణ గారి క్యాంపు ముఖ్యంగా విజయనిర్మల కెమేరామెన్ గా ప్రపంచానికి తెల్సిన పుష్పాల గోపీకృష్ణ చనిపోయి దాదాపు పదిహేనేళ్లు అయినా … ఇప్పటికీ యాక్షన్ మూవీ అనగానే ఆయనే గుర్తొస్తాడు.అలాగే … యాక్షన్ సినిమా అనగానే గుర్తొచ్చే మరో ఇద్దరు కెమేరామెన్లలో ఎస్ఎస్ లాల్ గారి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు దేవరాజ్ . ఆయన గురించి మరోసారి చెప్పుకుందాం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!