Bharadwaja Rangavajhala …………………………………..
అనగనగా…ఓ సారి దిబ్బరాజ్యంలో రివదాగో నదికి పుష్కరాలొచ్చాయి. పుష్కరాల్లో స్నానం చేయకపోతే బతికే అనవసరం అన్నంతగా దిబ్బ ప్రభువు ప్రచారం చేయించాడు. కారణం దిబ్బ నుంచి చీలిపోయిన చిన్న దిబ్బ రాజ్యపు ప్రభువు చంద్రసేనుడే. రివదాగో నది చిన్న దిబ్బనుంచే పెద్ద దిబ్బలోకి ప్రవేశిస్తుంది. కనుక అక్కడా ఇక్కడా కూడా పుష్కరాలు జరిగాయి. చంద్ర సేనుడి కంటే…గొప్పగా చేయాలనే తపన ఉంది పెద్ద దిబ్బ ప్రభువు బాబూ చంద్ర వర్మకి.
పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. చాలా కష్టపడి చేసిన ఏర్పాట్ల పుణ్యమా అని తొక్కిసలాట జరిగి ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాస్త ఖంగు తిన్న పెద్ద దిబ్బ ప్రభువు పన్నెండు రోజులూ పెద దిబ్బ ప్రభువు రివదాగో నది దగ్గరే ఉండిపోయారు. పుష్కరాలు రేపటితో ముగుస్తాయనగా ఓ విచిత్రం జరిగింది.
పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో చనిపోయిన వారి బంధువుల్లో ఒకాయన నేరుగా చాలా వేగంగా బాబూ చంద్ర వర్మ దగ్గరకు వచ్చేశాడు. ప్రభువు అతన్ని గుర్తు పట్టాడు. రోజూ టీవీల్లో కనిపించే ముఖమే అది. మృతుల బంధువుల తరపున అతనే రోజూ టీవీల్లో మాట్లాడుతున్నాడు. తనను పదిమందిలో నిలదీయడానికో ఇందకేదన్నా చేస్తాడేమో అని భయపడుతూ…దిబ్బ ప్రభువు చుట్టూ చూస్తున్నారు.
ప్రభువు దగ్గరగా వచ్చిన అగంతకుడు ఒక్కసారిగా నేలపై కుప్పలా పడిపోయి ప్రభువు పాదాలను కన్నీళ్లతో తడిపేస్తున్నాడు.
దిబ్బ ప్రభువు చంద్ర వర్మ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఎందుకిలా కాళ్లమీద పడిపోయాడు అని తీవ్రంగా యోచిస్తున్నాడు. కాళ్లు తడిపేసిన బంధువు లేచి నిలబడి “అయ్యా…మొన్న మీ ఏర్పాట్ల పుణ్యమా అని మా మేనమామ కన్నుమూశాడండీ. నాకు చాలా ఆనందంగా ఉందండీ అన్నాడు.
మా మావకో ఇల్లుందండి…ఆయనకి మా ఆవిడ ఒక్కత్తే. పెళ్లప్పుడు పావలా కట్నం ఇవ్వకుండా నాకున్నదంతా నీదే కదా అన్నాడు. అప్పట్నించి ఎదురుచూస్తున్నాను ఎప్పుడు పోతాడా అని. అంటూ వివరించాడు.పోతే ఆస్తి కలిసి వస్తుందనేది నా బాధ.
దాదాపు పదిహేళ్ల నిరీక్షణ. మొన్న పుష్కరాల్లో మీరు చేసిన ఏర్పాట్ల పుణ్యమా అని చనిపోయాడు. నాకు ఆస్తి కలిసొచ్చింది. దాంతో పాటు పదిలక్షలు ఎక్స్ గ్రేషియా కూడా వచ్చింది. ధన్యవాదాలు సార్ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.
దిబ్బ ప్రభువు బాబూ చంద్ర వర్మ కళ్లు కూడా చమర్చాయి. కళ్ళు తుడుచుకున్నాడు. ఇంతలో మీడియా గొట్టాలు పట్టుకుని వచ్చి దిబ్బ ప్రభువు నోట్లో పొడవడంతో ఈలోకంలోకి వచ్చాడు.
“ప్రభూ ఏమిటి ప్రభూ ఆ మృతుల కుటుంబాలకు చెందిన బాధితుడు మీకు చెప్తున్నాడూ “అని అడిగారు మీడియా వారు.బాధతో పూడుకుపోయిన స్వరంతో “మృతుల కుటుంబాల వారు కూడా ఏర్పాట్లను మెచ్చుకుంటున్నారు” అన్నారు.దిబ్బ ప్రభువును కలసిన మృతుల బంధువు నడుస్తూ ఉండగా…వెనక నుంచి ఎవరో చొక్కా పట్టుకుని లాగుతున్నట్టనిపించి వెనక్కితిరిగి చూశాడు.
“నేను దిబ్బజ్యోతి ఎడిటర్ ని” అన్నాడా చొక్కా పట్టుకుని లాగిన అగంతకుడు. “సరే ఎందుకు నా చొక్కా లాగుతున్నారు “అడిగాడు మృతుడి బంధువు.
“ఏం లేదు…ప్రభువు చేసిన పుష్కర ఏర్పాట్ల వల్ల మీరు చాలా లాభం పొందారు కదా…మరి కొత్త దిబ్బ రాజధానికి చందా ఇవ్వరా” అని అడిగాడు.
“పో పోవయ్యా ..పరిహారం తక్కువని ఇక్కడ ఏడుస్తుంటే … మధ్యలో నువోక్కడివి ” అని చిరాకుపడుతూ అతగాడు వెళ్ళిపోయాడు. అంతలో మృతుల బంధువుల్లో మరొకరు కూడా దిబ్బ ప్రభువు దగ్గరకు వచ్చి అభినందించారు. “మహా ప్రభూ నాదో విన్నపం” అన్నాడు. చెప్పమన్నాడు ప్రభువు.
“ఏం లేదు..వచ్చే ఏడాది ష్ణాక్రి పుష్కరాలున్నాయి. అప్పుడూ దీనికేమాత్రం తగ్గని ఏర్పాట్లు చేయించండి “అన్నాడు.” ఏం ఎందుకు” దాదాపు కోప్పడినట్టు అడిగారు రాజుగారు.” ఏంలేదండి…మా దాయాది ఒకడున్నాడు. వాణ్ణి అక్కడికి పంపిద్దామని”…అని రిప్లై ఇవ్వడంతో పాటు ప్రభువుకు మరోసారి దణ్ణం పెట్టి వెళ్లిపోయాడు. ప్రభువు చేయి గర్వంతో అసంకల్పితంగానే మీసం మీదకు పోయింది.