ఆమె అతడిని కొట్టింది !! (కథ )

Sharing is Caring...

వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ గడతా! “అంటూ భీకర శపథం ఒకటి చేసి ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యాడు సుత్తిశ్రీ అనబడే సుత్తి శ్రీధర్. “వీర సుత్తి సంక్రాంతి ప్రత్యేక సంచిక పరమ చండాలంగా ,అమిత అసహ్యకరంగా ఉందని రాయడానికి చాలా చింతిస్తున్నాను.రెండ్రోజులనుంచి కడుపులో గడబిడగా ఉందని గంతులేస్తున్న మా బావ గారి చేత బలవంతంగా పత్రికలోని కథలు,కవితలు చదివించాను. అంతే అరగంటలో కడుపు క్లీన్ అయిపొయింది.

ఇక బహుమతి పొందిన కథల విషయానికొస్తే వారం క్రితం తిన్న వంకాయ కూరను కూడా వాంతి చేసుకున్నాను. అలాంటి చెత్త కథలకు ,టైటిల్ మార్చిపంపిన కాపీ కథలకు బహుమతులు ఎలా ఇచ్చారో ఎంత జుట్టు పీక్కున్నా అర్ధం కాలేదు. బహుమతి పొందిన కథల్లో ఒకటైన ‘మొగుణ్ణి తన్నిన మగువ’ తెలుగు డబ్బాపత్రికలో ఏడాదిక్రితం ప్రచురితమైన నా కథ ‘భర్తను కొట్టిన భార్య’ కు కార్బన్ కాపీ అని చాలెంజ్ చేసి మరీ చెబుతున్నా.రచయిత్రి కుమారి సిగ్గులేని సీత సిగ్గు విడిచి ,ఎగ్గు మరచి కథా చౌర్యానికి పాల్పడటం చాలా నీచమైన,ఘోరమైన నేరం.

తెలుగు రచయిత్రుల కీర్తి ప్రతిష్టలను తెలుగు గంగ పాలు చేస్తున్న సీతకు బాగా గడ్డి పెట్టి ఆమెపై చట్ట పరమైన చర్య తీసుకోవాల్సిందిగా ఎడిటర్ గారిని కోరుతున్నాను.” అని స్టేటస్ బాక్స్ లో గబగబా టైపు చేసి సీతను, వీరసుత్తి పత్రిక ఎడిటర్ ను, మరికొందరిని టాగ్ చేసి పోస్ట్ పెట్టేసాడు. పది నిమిషాల్లో ఓ ఇరవై లైకులు వచ్చాయి. పదిమంది సీత పై విరుచుకుపడ్డారు.’కథా చౌర్యం సిగ్గుచేటు’ అని బుద్ధి చెప్పారు. మరికొందరు ‘క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.కాసేపటికి వీర సుత్తి పత్రిక ఎడిటర్ కూడా పోస్ట్ చూసి స్పందించాడు.

‘కథా చౌర్యం విషయమై సీత గారి వివరణ కోరడమైనది’ అంటూ కామెంట్ పెట్టాడు. ఎడిటర్ స్పందన చూసేక సుత్తిశ్రీ ఆవేశం కొంత తగ్గింది. ‘సీత ఏమి జవాబు పెడుతుందా?’ అని గంట సేపు ఎదురు చూసేడు.ఇక విసుగు పుట్టి లాగౌట్ అవుదామని అనుకుంటున్న సమయంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసాడు. “అన్నా! ఆ సీత నిన్ను బూతులు తిడుతూ పోస్ట్ పెట్టింది… చూడు” అని చెప్పాడు.వెంటనే సీత టైమ్ లైన్ పై కి వెళ్ళాడు.

“సుత్తిశ్రీ ! నా కథ మొగుణ్ణి తన్నిన మగువ నీ భర్తను కొట్టిన భార్యకథకు కార్బన్ కాపీ అంటూ నువ్వు పెట్టిన పిచ్చి పోస్ట్  చూసేక ఒళ్లంతా కారం పులిమినట్లైంది . ఇన్నాళ్ళకు రాక రాక నా కథకు ఓ బహుమతి వస్తే అసూయ తో నీ కథను కాపీ కొట్టానంటూ పోస్ట్ పెడతావా? నువ్ గానీ నాముందు ఉంటే చీపురు తిరగేసి జవాబు చెప్పేదాన్ని.అయ్యా! ఎడిటర్ గారూ వీర సుత్తి పత్రికలో తన కథ సాధారణ ప్రచురణకు కూడా ఎంపిక కాలేదన్న దుగ్దతో మతి భ్రమించిఏవేవో అవాకులు చవాకులు పేలిన సుత్తిశ్రీ మాటలు నమ్మకండి . అయినా ఉత్తరాలే సరిగ్గా రాయడం చేతకాని చవట సన్యాసి కథలు కూడా రాస్తాడంటే ఎవ్వరూ నమ్మరు. ఆయనేదో పెద్ద రచయిత అయినట్టు కొట్టక కొట్టక అయన కథనే కాపీ కొట్టాలా ?గతంలో ఈ సుత్తిశ్రీ నన్ను ప్రేమించానంటూ వెంటబడి చెప్పు దెబ్బలు తిన్నాడు.

అది మనసులో పెట్టుకుని ఇలా అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇతగాడి అకౌంట్ ను బ్లాక్ చేయమని ఈవేళే జుకెన్ బర్గ్ కి కూడా ఫిర్యాదు చేస్తున్నా. పారితోషకం వెంటనే పంపుతారా ?లేదా ? ” అంటూ ఘాటు గానే పోస్ట్ పెట్టింది సీత.అది చూసాక సుత్తిశ్రీ కి తిక్క రేగిపోయింది. ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లో తన అనుచరులకు ఈ విషయం చెప్పాడు. మరు నిమిషంలో వాళ్లంతా సీత మీద కామెంట్లతో ఎదురు దాడికి దిగారు. ‘కథను కాపీ కొట్టిందేకాక అవాకులు చవాకులు పేలతావా ?’ ‘నీలాంటి వాళ్ళు ఉండబట్టే కాపీ క్యాట్స్ పెరిగి పోతున్నారు.’

‘సుత్తిశ్రీ లాంటి రచయిత ను బట్టుకుని సన్యాసి అంటావా ?’ ‘నువ్వే ఆడ సన్యాసివి. మీది దొంగల వంశం.” అంటూ కామెంట్ల రూపంలో సీతను తిట్టి పోసారు. ఈ కామెంట్లు చూసి సీత వర్గం కూడా రెచ్చిపోయింది. ‘గతం లో తిన్న చెప్పు దెబ్బలు చాలవా ?”పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే డొక్క చించి డోలు కడతాం’ ‘మహిళలంటే అంత చులకనా ?’ ‘ గాజులు తొడుక్కున్న చేతులతోనేగన్నులు పడతాం.’ ‘పిచ్చ వేషాలు వేస్తే ……. కట్ చేస్తాం … ఖబడ్డార్ ‘ అంటూ హెచ్చరిస్తూ కామెంట్లు పెట్టారు. అవి చూసేక సుత్తిశ్రీ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

కాసేపు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగి ఆతర్వాత రెండు పెగ్గులు బిగించాడు. ఈ సీతకు గట్టి జవాబు ఇవ్వాలి అనుకుని తన టైంలైన్ పై కొచ్చాడు .”ఎడిటర్ జీ, ఆడదని సహిస్తుంటే ఆ సిగ్గులేని సీత రెచ్చి పోయి ఏవేవో మొరుగుతోంది . తెలుగుదేశంలో ఇంకెవరూ దొరకనట్టు కోతిలా ఉండే ఆ నాతిని ప్రేమిస్తూ వెంటబడ్డానంటే నమ్మేంత వెర్రి వాజమ్మలు ఇండియా లో లేరు. ఆమె నన్నుచెప్పుతో కొట్టిన మాట పచ్చిఅబద్దం.

ఆరోజు నన్ను కేవలం చెంప దెబ్బ మాత్రమే కొట్టిందని తెలియ జేస్తున్నాను.కావాలంటే ఆ నిజాన్ని నిరూపించుకోగలను. పారితోషకం అసలు రచయితనైన నాకు పంపడం న్యాయం. వెంటనే పంపండి . అలా కాని పక్షంలో మీ మీద ,ఆమె మీద కోర్టులో కేసు వేయగలను.” అంటూ టైప్ చేసి పోస్ట్ పెట్టాడు. మళ్లీ అందరిని టాగ్ చేసేడు.యధావిధిగా కాసేపు సుత్తిశ్రీ ఫ్రెండ్స్ ,సీత ఫాలోయర్ల మధ్య కామెంట్ల యుద్ధం జరిగింది. 

కొందరైతే ఎందుకు మధ్యలో మమ్మల్ని టాగ్ చేస్తున్నారు అంటూ అటు సీత ఇటు సుత్తిశ్రీ లపై మండి పడ్డారు.ఈ రచ్చ , రభస భరించలేక వీర సుత్తి ఎడిటర్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు . “అయ్యా .అమ్మా..మీ ఇద్దరిలో కథ ఎవరి సొంతమో తేల్చుకుని తెలియ చేస్తే వారికే పారితోషకం పంపుతాం. మీ ఇద్దరు మీ పనికి మాలిన పోస్టులకు నన్ను టాగ్ చేయకండి.”అంటూ హెచ్చరిక జారీ చేసాడు. 

దీనిపై సీత స్పందిస్తూ ” తెలుగువారి అభిమాన రచయిత్రి ని కాబోతున్న నన్ను కోతి ,గీతి అంటాడా ? వాడే కొండ ముచ్చు.పారితోషకం నాకే పంపండి.” అంటూ కామెంట్ పెట్టింది. అది చూసి సుత్తిశ్రీ ” వేలాది మంది అభిమానులున్న ఓ ప్రముఖ రచయితను పట్టుకుని ఆ సీతముచ్చు గిచ్చు అంటుందా ? ఆవిడే కోతి,కొండముచ్చు ,కోడి ,పకోడీ వగైరా వగైరా …వారం లో మీనుంచి పారితోషకం అందుతుందని భావిస్తున్నాను.” అంటూ కౌంటర్ కామెంట్ పెట్టాడు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా కామెంట్లు పెడుతున్న క్రమంలో సంతాన పిళ్ళై అనే అతను ఒక కామెంట్ పెట్టాడు .

” వణక్కం ! ‘మొగుణ్ణి తన్నిన మగువ’ కథ నాదంటే నాదని తిట్టుకుంటున్న సీత ,సుత్తిశ్రీ గార్ల పోస్టులు, కామెంట్లు చదివి ఆశ్చర్యబోయాను.ఆ కథ ఎంత గొప్పగా ఉంటుందో అన్న ఆసక్తి తో గంట క్రితమే వీర సుత్తి పత్రిక సంపాదించి కథ చదివి షాక్ తిన్నాను. అసలు ఆ కథ రాసింది వారిద్దరూ కాదు… నేనే! అవళ్ అవనై అడిత్తాళ్”(ఆమె అతడిని కొట్టింది) పేరుతో ఒక తమిళ పత్రికలో ఆ కథ పబ్లిష్ అయింది.

నా అనుమతి లేకుండా సుత్తిశ్రీ ,సీత గార్లు తెలుగులోకి అనువదించి తమ పేర్లతోతెలుగు డబ్బా ,  వీర సుత్తి పత్రికలకు పంపడం చట్టరీత్యా నేరం . ఆ ఇద్దరినీ మూడు చెరువుల నీళ్ళు త్రాగించి ముప్ప తిప్పలు పెట్టనిదే ఊరుకోను. మూల రచయితను నేనే కాబట్టి దయవు సెయిదు ఒడ నెపరిసు అనుపుంగళ్ (దయచేసి పారితోషకం పంపండి )”ఆ కామెంట్ చూడగానే అక్కడ సీత ,ఇక్కడ సుత్తిశ్రీ ఇద్దరూ ఫేస్బుక్ నుంచి జంప్.

ఇద్దరి ఫాలోయర్స్ కూడా సైలెంట్ అయి పోయారు .ఆ వెంటనే “వీర సుత్తి” ఎడిటర్ స్పందించాడు . ” పిళ్ళై గారి కామెంట్ ను బట్టి మొగుణ్ణి తన్నిన మగువ కథా రచయిత ఎవరో తేలిపోయింది. కావున పారితోషకం పంపదలిస్తే ఎప్పటికైనా ఆయనకే పంపుతామని తెలియ చేస్తున్నాం. కథా చౌర్యానికి పాల్పడిన  సీత ,సుత్తిశ్రీ గార్ల కథలు ఇకపై వీరసుత్తి లో ప్రచురించబోమని ప్రకటిస్తున్నాం. అంటూ కామెంట్ పెట్టి హమ్మయ్య అనుకున్నాడు.

(published in maalika  web magazine … writer KNMURTHY  )

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!