PAN and Aadhaar are mandatory ………………………….
పోస్టాఫీస్ పొదుపు పథకాలలో సొమ్ము దాచుకోవాలంటే ఇక నుంచి ఆధార్, పాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు పాన్, ఆధార్ కార్డ్ ను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
దీని ప్రకారం.. ఇకపై చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజా భవిష్య నిధి (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్.. ఇలా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఈ నిబంధనను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇక, ఈ పొదుపు ఖాతాల్లో పెట్టుబడులు, నిర్ణీత పరిమితిని దాటితే పాన్ కార్డ్ అందించాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది.
ఆధార్ నంబర్ లేకుండా ఈ ఖాతాలు తెరిచిన చందాదారులు 2023 సెప్టెంబర్ 30 లోగా సంబంధిత కార్యాలయాల్లో ఆధార్ కార్డ్ సమర్పించాలి. ఇకపై కొత్త ఖాతాలు ఓపెన్ చేసే వారు ఆధార్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధార్ లేకుండా కొత్త అకౌంట్ పొందితే ఖాతా తెరిచిన ఆరునెలల్లోగా సంబంధిత పోస్టాఫీసులో ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అలాచేయకుంటే ఆరునెలల అనంతరం ఖాతాను స్తంభింపజేస్తారు.
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు తెరిచే సమయంలో పాన్ కార్డు సమర్పించాలి. ఆ సమయంలో పాన్ సమర్పించనట్లయితే, ఈ కింది సందర్భాల్లో ఖాతా తెరిచిన రెండు నెలల్లోపు సంబంధిత కార్యాలయంలో పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాలి.ఖాతాల్లో రూ. 50వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతాలో అన్ని క్రెడిట్స్ రూ. లక్ష దాటినప్పుడు… ఒక నెలలో ఖాతా నుంచి జరిపిన లావాదేవీలు, ఉపసంహరణలు కలిసి రూ.10 వేలు దాటితే.. పాన్ సమర్పించాలి.. అలా చేయకుంటే ఖాతాలు స్తంభింపజేస్తారు. తిరిగి పాన్ సమర్పించేంతవరకు అందులో ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీలు కల్పించరు. కాబట్టి ఖాతాదారులు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో మీ లావాదేవీలపై నిఘా ఉంటుందని తెలుసుకోవాలి.