Dhoolipala who lived in the role of Shakuni………………
ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని మామ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు.
హాస్యం, వెటకారం మాటలతో సీఎస్ ఆర్ కూడా శకుని పాత్రలో తనదైన శైలిని చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాయాబజార్ లో సీఎస్ ఆర్ నటన విభిన్నంగా ఉంటుంది. కురుక్షేత్రం చిత్రంలో శకుని పాత్రను నాగభూషణం పోషించారు. ఆ పాత్రకు కామెడీ డైలాగులు పెట్టడంతో సీరియస్ నెస్ లేకుండా పోయింది.
కానీ ధూళిపాళ క్రూరమైన చూపులతో.. ప్రత్యేక వాచకం, హావభావాలతో శకుని గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. శకుని అనగానే ధూళిపాళ గుర్తొచ్చేలా చేశారు. అది ఆయన ప్రత్యేకత. ఆయనకు అంత పేరు రావడానికి కారణం ఎన్టీరామారావు అని చెప్పుకోవాలి.
శ్రీ కృష్ణ పాండవీయం లో కానీ దానవీర శూర కర్ణ లో కానీ తాను ధరించిన పాత్రలతో సమానంగా శకుని పాత్ర ను హైలెట్ చేశారు. పదునైన డైలాగులు కూడా ఆ పాత్రకు రాయించారు. అందుకే ఆ పాత్ర పండింది. ధూళిపాళ తన నటనా చాతుర్యంతో ఔరా అనిపించేలా చేసాడు. చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్ తో పోటీ పడి నటించాడు.
శ్రీకృష్ణ పాండవీయం లో “ఆ జీవితాంతం పాండవులు ప్రత్యావమాన క్లేశం తో కృంగి, కృశించి నశించవలె. అపుడు గాని ఈ పరాభవాగ్ని చల్లారదు.” “పగ తీర్చకపోతే గాంధార రాకుమారుడినే కాదు” అన్న డైలాగులు చెప్పేటప్పుడు హావభావాలను అద్భుతంగా పలికించారు ధూళిపాళ. అలాగే కర్ణ లో “మంచి పనులేమోకానీ ఇలాంటి వంచన పనులు ఈ మామకు వెన్నతో పెట్టిన విద్య.”
“వ్యసనపరుడైన ధర్మజుడు ఎన్నిసార్లు అయినా జూదానికి వస్తాడు. ఎన్ని అవమానాలైనా భరిస్తాడు” వంటి డైలాగులు చెప్పేటప్పుడు తనదైన శైలిలో చెబుతూ కుటిలత్వాన్ని కళ్ళలో చూపుతారు. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ .. శకునిగా ధూళిపాళ పోటా పోటీగా నటించారు కాబట్టే ఆయా సినిమాల్లో ఆ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కాయి.
సీనియర్ సముద్రాల కానీ .. కొండవీటి వెంకటకవి కానీ ప్రత్యేక శ్రద్ధతో సంభాషణలు సమకూర్చారు. అలాంటి డైలాగులు ఆ రెండు సినిమాల్లో బోలెడున్నాయి. ఇక శ్రీకృష్ణ పాండవీయంలో శకుని ఫ్లాష్ బ్యాక్ కొంత చూపిస్తారు.
ఎన్టీఆర్ శకుని పాత్రను మరింతగా పెంచడం కోసం వ్యాస భారతంలో లేని కథను జొప్పించారు. భారతంలో శకుని పాత్ర ఏమిటో ? శకుని మామ ఎందుకు పగబట్టాడో ? పాచికలను ఎలా రూపొందించాడో కొత్త కోణంలో ఈ సినిమా చూపిస్తుంది.
చిత్రంగా పై రెండు సినిమాలకు కథ దర్శకత్వం ఎన్టీరామారావే కావడం విశేషం. కేవలం తన క్యారెక్టర్ మాత్రమే హైలెట్ చేసుకోకుండా కథకు అనుగుణంగా ఇతర పాత్రలను తీర్చిదిద్దిన వైనం ప్రశంసనీయం.
ఆ రెండు సినిమాలను ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్నరీతిలో తీశారు. ఆ రెండు సినిమాలు యూట్యూబ్ లో ఉన్నాయి .. చూడని వారు చూడొచ్చు. చూసిన వారు కూడా మరొక మారు చూడొచ్చు.
ఇక ధూళిపాళ గురించి చెప్పుకోవాలంటే ……… ఆయన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1921 సెప్టెంబర్ 24 న జన్మించారు.చిన్నప్పటి నుంచి నాటకాలంటే ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్ గుమాస్తాగా పనిచేశారు.
1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్ థియేటర్ సంస్థ ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు నాటకప్రియుల మంచి ప్రశంసలు లభించాయి.
1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు న్యాయనిర్ణేతల్లో ఒకరైన నటి జి.వరలక్ష్మి దృష్టి లో పడ్డారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. ఈ క్రమంలో బి.ఎ.సుబ్బారావు భీష్మ చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు.
ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్.టి.రామారావు తర్వాత తన సొంత సినిమాల్లో అవకాశం ఇచ్చారు. శ్రీ కృష్ణ పాండవీయంలో ‘శకుని’ పాత్ర ధూళిపాళ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. ధూళిపాళ 2007 లో కన్నుమూసారు.
———–KNMURTHY