PAKISTHAN IN A STATE OF CONFUSION…
పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. తమపై దాడి చేస్తున్న ఇరాన్ పై యుద్ధం చేయమని అడుగుతోంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సైనిక మద్దతు కావాలని సౌదీ కోరుతున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచారంలో కొచ్చాయి.
సెప్టెంబర్ 2025లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ “స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ (SMDA)” పై సంతకం చేశాయి. ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై జరిగే దాడిని రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి పరస్పరం సహకరించుకోవాలి. ఆ ఒప్పందాన్ని ఇపుడు అమలుచేయాలని సౌదీ అడుగుతోంది.
పాకిస్తాన్ ప్రస్తుతం ఒక గందరగోళ స్థితిలో ఉంది. ఒకవైపు సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలు, ఆర్థిక సాయం అవసరం కాగా, మరోవైపు పొరుగున ఉన్నఇరాన్‌తో నేరుగా శత్రుత్వం కొనితెచ్చుకోవడం రిస్క్ అని భావిస్తున్నది.
ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, తమ దళాలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నిమగ్నమై ఉన్నాయని, కాబట్టి సౌదీకి తక్షణ సైనిక దళాలను పంపడం కష్టమని సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
2015లో కూడా యెమెన్ యుద్ధంలో పాల్గొనాలని సౌదీ కోరినప్పుడు, పాకిస్తాన్ పార్లమెంటు తటస్థంగా (Neutral) ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. సౌదీ అరేబియా తన రక్షణ కోసం పాకిస్తాన్‌పై ఒత్తిడి చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ తన ఆర్థిక, ప్రాంతీయ ప్రయోజనాలు, అంతర్గత సమస్యల దృష్ట్యా నేరుగా యుద్ధంలోకి దూకడానికి వెనుకాడుతోంది.
పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల్లో షియా-సున్నీ ఘర్షణలు అత్యంత కీలకమైనవి. దీని వెనుక దశాబ్దాల చరిత్ర, లోతైన సామాజిక కారణాలు ఉన్నాయి.. పాకిస్తాన్‌లో మెజారిటీ ప్రజలు సున్నీ ముస్లింలు కాగా, షియాలు సుమారు 15-20% వరకు ఉంటారు.2024-2025 నాటి అంచనాల ప్రకారం, షియాల సంఖ్య దాదాపు 3.5 కోట్ల నుండి 4.5 కోట్ల మధ్య ఉంటుంది.
ఇరాన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక షియా జనాభా కలిగిన దేశం పాకిస్తాన్. కరాచీ, క్వెట్టా,పెషావర్ వంటి ప్రాంతాల్లో షియాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులు తరచుగా జరుగు తుంటాయి.
ముఖ్యంగా బలూచిస్తాన్‌లోని ‘హజారా’ తెగకు చెందిన షియాలపై తీవ్రవాద సంస్థలు (ఉదాహరణకు: లష్కర్-ఎ-ఝాంగ్వీ) దాడులు చేస్తూనే ఉన్నాయి. వీరిని “ముస్లింలు కాదని” ముద్ర వేయడం అక్కడ ప్రధాన సమస్య. పాకిస్తాన్‌లోని కఠినమైన దైవదూషణ చట్టాలను షియాలకు వ్యతిరేకంగా వాడటం ఎక్కువైంది. ఇది వారిని సామాజికంగా , చట్టపరంగా ఇబ్బందుల్లో నెడుతోంది. షియా-సున్నీ గొడవలతో పాటు పాకిస్తాన్‌ను మరికొన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
విదేశీ అప్పులు పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసర ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ‘తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్’ (TTP) పాక్ సైన్యంపై నిరంతరం దాడులు చేస్తోంది. ఇది దేశ భద్రతకు పెద్ద సవాలు గా మారింది.
తమ వనరులను పాక్ ప్రభుత్వం దోచుకుంటోందని బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ సైన్యానికి, స్థానిక గ్రూపులకు మధ్య యుద్ధం జరుగుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత దేశంలో రాజకీయ విభజన పెరిగింది. ఆర్మీ వర్సెస్ సామాన్య ప్రజలు అనే వాతావరణం నెలకొంది.
పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గొడవలతో పాటు,దేశీయంగా మతపరమైన గొడవలు,ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటోంది.
పాకిస్తాన్, ఇరాన్ మధ్య దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇరాన్‌తో యుద్ధానికి దిగితే, ఇప్పటికే అస్థిరంగా ఉన్న బలూచిస్తాన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున హింస చెలరేగే ప్రమాదం ఉంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న పాక్ సైన్యం, మూడో వైపు (ఇరాన్) శత్రుత్వాన్ని కోరుకోవడం లేదు. ఇరాన్ (షియా దేశం) పై దాడి చేస్తే, పాకిస్తాన్ లో అంతర్యుద్ధం (Civil War) వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఉనికికే ప్రమాదం.
ఇరాన్ దగ్గర మధ్యప్రాచ్యంలోనే అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ప్రోగ్రామ్ ఉంది. ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడులు వారి సాంకేతికతను నిరూపించాయి. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి ఉన్నతరుణంలో, ఇరాన్ క్షిపణి దాడులను తట్టుకునే స్తోమత దానికి లేదు.
ఇరాన్, పాకిస్తాన్.. ఈ రెండు దేశాలకు చైనా అతిపెద్ద భాగస్వామి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే చైనా ప్రయోజనాలు (CPEC వంటివి) దెబ్బతింటాయి. అందుకే చైనా ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ, యుద్ధం రాకుండా ఒత్తిడి తెస్తోంది.
పాకిస్తాన్ ఇంధన అవసరాల కోసం ఇరాన్ గ్యాస్ పైప్‌లైన్ (IP Pipeline) పై ఆధారపడాలని చూస్తోంది. యుద్ధం వస్తే ఆ ఆశలు అడుగంటుతాయి. ఇవన్నీఆలోచించే పాకిస్తాన్ వెనుకడుగు వేస్తోంది.. అంటే అది కేవలం భయం వల్ల కాదు, అది తప్పనిసరైన ఒక వ్యూహాత్మక పరిస్థితి.
సౌదీ నుంచి వచ్చే ఆర్థిక సాయం కావాలి, అలాగే ఇరాన్‌తో యుద్ధం వస్తే దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. అందుకే పాకిస్తాన్ “తటస్థంగా” ఉంటూ కేవలం దౌత్యపరమైన మద్దతు ఇస్తామని చెబుతోంది. ఇదొక ఇరకాటమైన స్థితి

