పి.సి.రెడ్డి మార్క్ హిట్ మూవీ !

Sharing is Caring...

Subramanyam Dogiparthi …………………….

మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది.  ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా…  ఆపాట రాసిన మోదుకూరి జాన్సన్ పదునైన సంభాషణలు రాశారు.

గ్రామీణ కథలతో హిట్లు కొట్టిన పి.సి.రెడ్డి మార్క్ సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పి.సి. రెడ్డి కాంబినేషన్లో రూపొందిన  సూపర్ హిట్ సినిమా ఈ బంగారు భూమి.ఈ ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు 22 సినిమాలు వచ్చాయి. వాటిలో చాలావరకు హిట్ అయినవే. 1982 సంక్రాంతి కి విడుదల అయి వంద రోజులు ఆడిన సినిమా ఇది.

గ్రామీణ కుటుంబాల నేపధ్యంలో పాడిపంటలు వంటి సూపర్ హిట్ సినిమాలు అంతకు ముందు కూడా వచ్చాయి.పి.సి. రెడ్డి అలాంటి సినిమాలు తీయటంలో దిట్ట. కృష్ణ ఈ సినిమాలో చాలా హుషారుగా, హుందాగా నటించారు. ఇలాంటి పెద్దన్నయ్య పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. 

ఈ సినిమాకు బలం కధ, కధనం.పి చంద్రశేఖరరెడ్డి రెండింటినీ బాగా హేండిల్ చేసారు. పాత్రల రూపకల్పన కూడా బాగుంటుంది. రావు గోపాలరావు  ‘గాంధీ ని చూపించి అడుగుతున్నా’  ‘వచ్చే పంచాయితీ ఎన్నికల్లో నాకే ఓటు వేయండి .. ప్రెసిడెంట్ ని చేయండి’ అని అందరిని అడుగుతుంటారు. ఆయన కొడుకు గా తాగుబోతు పాత్రలో సత్యనారాయణ జీవించాడు.’ ఓసి నీయమ్మ’ అనేది సత్యనారాయణ ఊతపదం.

సత్యనారాయణను టీజ్ చేస్తూ కృష్ణ, శ్రీదేవి లపై వేటూరి  రాసిన “రేయంత కవ్వింత ఒళ్ళంత తుళ్ళింత” డ్యూయెట్ చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాట హుషారుగా సాగుతుంది. ఈ పాటలో సత్యనారాయణ నటన ప్రేక్షకులను నవ్విస్తుంది. పిసినారి కాసులయ్య గా అల్లు రామలింగయ్య నటన గురించి ఇక చెప్పనక్కర్లేదు. రాజబాబు పాత్ర చిన్నదే. 

 జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాాయి. ఆత్రేయ రాసిన ‘పొంగింది పొంగింది బంగారు భూమి’ పాట చాలా బాగుంటుంది . హిట్టయింది కూడా . బంజరు భూముల్ని , కొండ భూముల్ని సాగులోకి తెచ్చేందుకు నీటి వసతి కోసం రాళ్ళల్లో , గుట్టల్లో హీరో బావుల్ని తవ్వే సీన్లు ఎన్నో సినిమాల్లో పెట్టారు.ఎన్నింటిలో పెట్టినా ఎన్ని సార్లయినా ఆ సీన్లు పండుతూనే ఉంటాయి . అలాంటి పాజిటివ్ సీన్ ఈ సినిమాలో కూడా పెట్టారు.

ఈ పాట అందుకు సంబంధించిందే. ఒక్క పాట మినహా అన్ని పాటలూ ఆత్రేయ రాశారు. దొంగ చిక్కింది కంగు తిన్నది ,ఆరిపేయీ ఆరిపేయీ చలిమంట పాటలు హుషారుగా ఉంటాయి. ‘చిటపట చిటపట చిటపట వర్షం’ గ్రూప్ డాన్స్లో సినిమా లో అందరు నటులు కనిపిస్తారు.  

ఇంకా కృష్ణ కుమారి, కవిత, సుధాకర్, గీత,మమత,సంగీత,గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి , గుమ్మడి  తదితరులు నటించారు. ఇన్ని పాత్రలను సమన్వయం చేసుకుంటూ కధను నడిపించటం అంత సులభం కాదు. కథను వేగంగా నడిపించారు. పి.సి. రెడ్డి అందులో సఫలమయ్యారు.

యస్ పి వెంకన్న బాబు ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ సినిమాలో పాటలను ,పల్లెటూరి అందాలను  పుష్పాల గోపికృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. సూపర్ స్టార్ ను అందంగా చూపారు. పంచెకట్టు లో ఆయన అభిమానులను అలరిస్తారు. హాస్య సంభాషణలను అప్పలాచార్య సమకూర్చారు. వర్షం గ్రూప్ సాంగులో ప్రభల మీద డాన్సుల్ని ఈ సినిమాలో చూడవచ్చు. 

ఒకప్పుడు మా నరసరావుపేట ఈ డాన్స్ కంపెనీలకు చిరునామా. కోటప్పకొండ ,ఇతర ఊళ్ళల్లో తిరునాళ్ళకు డాన్సర్లను మా ఊరి నుండే తీసుకుని వెళ్ళేవారు.ఎంతో మంది కళాకారులు , డాన్సర్లు బతికేవారు. అవన్నీ అశ్లీలంగా ఉన్నాయని నిషేధించారు. ఎంతో మంది నిరుద్యోగులు అయ్యారు.

ఇవ్వాళ సినిమాలలో , సోషల్ మీడియాలో వచ్చే పచ్చి బూతుల కన్నా ఆ ప్రభల డాన్సులు వంద రెట్లు బెటర్ . ఏలిన వారు మూర్ఖంగా తీసుకునే కొన్ని గుడ్డి నిర్ణయాలు కొందరి జీవితాలనే మార్చేస్తాయి.

ఈ చక్కని కుటుంబ కధా చిత్రాన్ని అప్పట్లో ప్రేక్షకులు బాగానే ఆదరించారు. యూట్యూబ్ లో ఉన్నప్రింట్ కూడా బాగుంది. కృష్ణ , శ్రీదేవి అభిమానులు తప్పక చూడతగ్గ సినిమా. ఇంతకు ముందు చూసి ఉండకపోతే ఇతరులు కూడా చూడతగ్గ సినిమా .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!