Illegal Affairs ……………………………………………………..
ప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు కొందరు మహిళలు. ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన రంజని (26), రాజు (30) లకు చాలాకాలం క్రితమే పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాజు పిండి మిల్లు, క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాలక్రమంలో రంజని కి గిరీష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయమైంది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడిపై ప్రేమతో రంజని తన భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇద్దరూ కలిసి ముగ్గురు కిరాయి హంతకులతో బేరం మాట్లాడుకున్నారు.
రాజు ను హత్య చేస్తే రూ.2 లక్షలు ఇస్తామని చెప్పారు. అడ్వాన్సుగా రూ.90 వేలు ఇచ్చారు. రాజు ఫొటో, అతడి క్యాబ్ వివరాలు ఇచ్చారు. ప్లాన్ ప్రకారం వారు.. జూలై 23న తమిళనాడుకు తీసుకెళ్లాలంటూ రాజు క్యాబ్ బుక్ చేసుకున్నారు. తొలుత ఇద్దరు అతడి కారులో ఎక్కారు మార్గమధ్యంలో మూడో అతను కూడా ఆ కారులో ఎక్కాడు. దారిలో వారు అతణ్ని కిడ్నాప్ అయితే చేశారు గానీ.. చంపడానికి ధైర్యం సరిపోలేదు.
అసలు విషయం రాజు కి చెప్పేశారు. దీంతో వారికి, రాజు కి మధ్య స్నేహం కుదిరింది. ఆ సంతోషంలో నలుగురూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. ఇంతలో రంజని వారికి ఫోన్ చేసి.. పని పూర్తయిందా అని అడగ్గా.. అయ్యిందని చెప్పారు. ఆధారాలు చూపాలని అడిగితే.. రాజు ఒంటిపై కెచప్ పోసి, ఫొటోలు తీసి ఆమెకు పంపారు. దీంతో ఆమె మిగతా డబ్బు వారికి పంపింది.
ఆ ఫొటోలు చూసి రంజని ప్రియుడు గిరీష్ విపరీతమైన భయానికి గురయ్యాడు. పోలీసులకు దొరికిపోతామన్న భయమో.. పరువుపోతుందనో.. కారణమేదైనాగానీ ఆగస్టు 1న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరోవైపు.. రాజు కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆగస్టు 6న రాజు తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య బిత్తరపోయింది.
పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. గిరీష్,రంజని ఫోన్లు తనిఖీ చేసిన పోలీసులకు.. అతడు చెప్పిందంతా నిజమేనని అర్థమైంది. రాజు హత్య ప్లాన్ వెనుక రంజని తల్లి హస్తం కూడా ఉన్నట్టు తేలింది. వారిని ప్రశ్నించగా.. రాజును హత్య చేయడానికి నియమించుకున్న నిందితుల పేర్లు బయటపడ్డాయి. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కొసమెరుపు: ఇంత జరిగినా.. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ అని, ఆమెను తాను క్షమిస్తానని.. ఆమెను అరెస్టు చేయొద్దని రాజు పోలీసులకు విజ్ఞప్తి చేసాడు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు.
నోట్ .. పేర్లు మార్చడమైనది.