రమణ కొంటికర్ల……………………………………
Great friendship………………………..
ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు.
భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను మంచి స్నేహితులతో పంచుకుంటాం. అలాంటి ఓ మంచి స్నేహితుడే వివేకానందుడి షికాగో పర్యటన వెనకున్నారు.
ఆయన మరెవరో కాదు రాజా అజిత్ సింగ్ బహదూర్.రాజస్థాన్ లో జుంజుని జిల్లాలోని ఖేత్రీ సంస్థానాన్ని పాలించింది ఈయనే.యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వివేకానందుడి షికాగో చారిత్రాత్మక ప్రసంగం వెనుక… అజిత్ సింగ్ బహదూర్ సహకారం.. ఖేత్రీ రాజభవన సంస్థానం పోషించిన పాత్ర ఎనలేనిది.
ఇది బహు కొద్దిమందికి మాత్రమే తెలుసు. దాదాపు ఇరవై ఏళ్ల పాటు షెఖావత్ రాజవంశాన్నీ, ఖేత్రీ సంస్థానాన్ని పాలించిన అజిత్ సింగ్ బహదూర్… 1888లో మౌంట్ అబూలో వివేకానందుణ్ని కలిసారు. వివేకానంద ప్రభావానికి గురయ్యారు.తరువాత వారిద్దరి మధ్యా స్నేహం చిగురించింది.
ఇద్దరూ పలు ఆధ్యాత్మిక అంశాలు, యోగా, ప్రపంచశాంతి… ఇతర సార్వత్రిక అంశాలపై చర్చించే వారు.తలపాగా లేకుండా ఊహించుకోలేని వివేకానందుడి పాగా వెనుకాల కూడా రాజా అజిత్ సింగ్ బహదూర్ ప్రేరణే ఉందంటారు. రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉండే దుమ్మూ, ధూళి నుంచి కేశాలను రక్షించుకునేందుకు.. బహదూరే వివేకానందుడికి ఆ తలపాగా బహుకరించారు.
అదే తర్వాతి రోజుల్లో వివేకానందుడి వస్త్రధారణలో ఒక భాగమైపోయింది. ఈ అంశాలన్నీ చతుర్వేది బద్రీనాథ్ రచించిన ‘లివింగ్ వేదాంత’ అనే పుస్తకంలో ఉన్నాయి. నరేంద్రుడి పేరు వివేకానందుడిగా మార్చింది కూడా రాజా అజిత్ సింగ్ బహదూరేనని ఆ పుస్తకంలో రాశారు.
ఒక మాంక్… ఒక మహారాజ్ మధ్య ఏర్పడ్డ ఈ మైత్రిబంధం…ఇద్దరినీ ప్రాణ స్నేహితులుగా మార్చేసింది. ఖేత్రీ సంస్థానంలో కొన్నాళ్ల పాటు వివేకానందుడు ఉండటంతో వారివురి స్నేహం మరింత బలపడింది. తర్వాత రోజుల్లో వారు కలిసిందీ తక్కువే. అయినా వారి మధ్య విడదీయరాని ఆత్మీయ స్నేహబంధం లేఖల రూపంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యమై నిలిచిపోయింది.
‘మీరే నా జీవితంలో నన్ను అత్యంత ప్రభావితం చేసిన ఏకైక స్నేహితుడు’ అంటూ అజిత్ సింగ్ బహదూర్ లేఖలు రాశారు. ఇందుకు బదులుగా ‘మీరే నిజమైన స్నేహితులు’ అంటూ స్వామి వివేకానంద కూడా అజిత్ సింగ్ బహదూర్ కు స్వీయదస్తూరితో లేఖలు రాశారు. ఈ లేఖలన్ని ఇప్పటికీ పశ్చిమబెంగాల్ బేలూర్ లోని రామకృష్ణ మిషన్ లోను … ఖేత్రీ మ్యూజియంలోనూ ఉన్నాయి.
ముఖ్యంగా షికాగో పర్యటన అనంతరం భరతజాతి ఖ్యాతిని దిగంతాలకు చాటడమే కాకుండా… వివేకానందుడి ప్రసంగాన్ని కొనియాడుతూ అజిత్ సింగ్ బహదూర్ లేఖ రాయడం.. అందుకు కృతజ్ఞతగా తానక్కడికి వెళ్లేందుకు కారణమైన అజిత్ సింగ్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానందుడు రాసిన లేఖలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకలు.
1898 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కాలంలో వివేకానందుడి ఆరోగ్యం దెబ్బ తిన్నది. అదే సమయంలో అజిత్ సింగ్ ‘ఉభయకుశలోపరి’ అంటూనే ఆయన ఆరోగ్యాన్ని ఆరా తీస్తూ రాసిన లేఖలు…వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహాన్ని రుజువు చేసేవి అంటారు. ‘తనకు అమెరికాలో స్నేహితులున్నప్పటికీ… వారు సాయం చేయడానికీ సిద్ధంగా ఉన్నారని తెలిసినా… వారిని అడిగేందుకు తాను సిగ్గుపడతా’నంటూ వివేకానందుడు తన మనసులో మాట బయట పెట్టారు.
అలాగే తను అనారోగ్యంపాలైన రోజుల్లో వివేకానందుడు రాజా అజిత్ సింగ్ కు లేఖ రాశాడు. ‘అనారోగ్యం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనేవరినైనా అడుక్కోవాల్సి వస్తే… అది మీరే’నంటూ అజిత్ సింగ్ కు వివేకానందుడు లేఖ రాశారు.అది చదివి చలించిపోయిన రాజు వెంటనే అప్పట్లో 500 రూపాయల మనియార్డర్ చేశారట.
అంతేకాదు వివేకానందుడి తల్లి ఆరోగ్యం క్షీణించినపుడు కూడా రాజా అజిత్ సింగ్ బహదూరే… నెలకు వంద రూపాయల స్టైఫండ్ కేటాయించారట. అలా మాంక్ వివేకానంద.. కింగ్ అజిత్ సింగ్ బహదూర్…అప్పట్లో అపూర్వ స్నేహానికి కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన ఈ కథ హిస్టరీలో ఓ స్ఫూర్తిదాయక పేజీగా నిలిచి పోయింది.