Lowest Temperatures………………………..
మామూలు చలిగాలుల వీస్తేనే మనం గజగజా వణికిపోతాం. రగ్గులు కప్పుకుంటాం.స్వెట్టర్లు ధరిస్తాం.శీతాకాలంలో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు నగరాలలో, గ్రామాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి.
మరీ గడ్డకట్టి పోయే చలి అయితే వామ్మో ఇక చెప్పనక్కర్లేదు. అలా గడ్డ కట్టి పోయే చలి ఉండే ..మంచు పడే ప్రదేశాలు ఉన్నాయా ? అవును. ఉంది .. ప్రపంచంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే గ్రామం ఒకటుంది. అదే ఓమ్య కోన్.
ఇది రష్యాలోని సైబీరియాలో ఉంది. ఇది అంటార్కిటికా వెలుపల ప్రపంచంలో అతి శీతల ప్రదేశంగా పేరు గాంచింది. కోలిమా హైవేపై టామ్‌టోర్‌కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండిగిర్కా నది పక్కనే ఈ గ్రామం ఉంది. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -50 డిగ్రీలు.1924 సంవత్సరంలో ఇక్కడ అత్యల్పంగా -71.2 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది.
2018 గణాంకాల ప్రకారం 500 నుంచి 900 మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఒకప్పుడు 2500 మంది నివసించేవారు.ఇక్కడ చలిని తట్టుకోలేక కొన్ని కుటుంబాలు వలస పోయాయి.ఈ గ్రామం పక్కనే రెండు లోయలు ఉన్నాయి. ఈ లోయల కారణంగా గాలి అక్కడ చిక్కుకుని వాతావరణం చల్లగా మారుతుంది అంటారు.
ఈ లోయలోనే వాతావరణ స్టేషన్ కూడా ఉంది.ఇక గ్రామంపై మంచు తుఫాను లేదా మంచు పడే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.ఇక్కడ శీతాకాలం ఎక్కువరోజులు ఉంటుంది. వేసవికాలం లో వాతావరణం తేలికపాటి నుండి వెచ్చగా ఉంటుంది. అరుదుగా కొన్నిసార్లు వేడిగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సంవత్సరంలో చాలా వరకు చల్లగానే ఉంటాయి.. వసంత ఋతువు, శరదృతువులలో మంచు విపరీతంగా కురుస్తుంది.
ఇక్కడి గ్రామస్తులు కఠినమైన శీతాకాలాన్ని ఎదుర్కోవటానికి అలవాటు పడిపోయారు. పగలు రాత్రిళ్ళు స్వెట్టర్లు,కోట్లు, చేతులకు సాక్స్,స్పెషల్ షూస్,తల.. మొహం కవర్ చేసే ఊలు టోపీలు ధరిస్తారు. ఇక్కడ పిల్లలు మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పాఠశాలకు కూడా వెళతారు. ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభం కాగానే స్కూళ్లను మూసివేస్తారు. ఇక్కడ డిసెంబర్ నెలలో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
ఇక్కడ శీతాకాలంలో పంటలు వేయరు. ప్రజలు ఎక్కువగా వివిధ రకాల మాంసాన్నిఆహారంగా ఉపయోగిస్తారు. రైన్డీర్, హార్స్ మాస్‌తో పాటు ప్రజలు స్ట్రోగనినా చేపలను పుష్కలంగా తీసుకుంటారు. ఈ ప్రాంతానికి అపుడపుడు పర్యాటకులు కూడా వస్తుంటారు. అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి, ఫోటోలు దిగి వెళుతుంటారు.