శ్రీకృష్ణ దేవరాయల వారి సమాధి ఇదేనా?

Sharing is Caring...

 Siva Racharla …………………………………

అవును రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి?, పులకేశికా ?, రాజరాజ 2 కా?, అమోఘవర్షుడికా?వీర భల్లాలదేవుడికా?, బిజ్జలదేవుడికా?, గణపతిదేవుడికా?రుద్రమదేవికా?, అనుగురాజుకా లేక బ్రహ్మనాయుడికా?రాచ వేమారెడ్డికా?, శ్రీకృష్ణదేవరాయలకా?

చాలా చారిత్రిక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ?ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?.
కొంత చరిత్ర చదివినా పైన ఉదహరించిన రాజుల సమాధుల గురించి చాలాసార్లు వెతికాను, కాని అసలు సాంప్రదాయం ప్రకారం హిందూ రాజులకు సమాధులు కడతారా?, కట్టారా?, ఈ చర్చ ఆ మధ్య హంపీ వెళ్ళినప్పుడు జరిగింది.

హంపిలో ఉన్నాను సార్ ,శ్రీకృష్ణదేవరాయల సమాధిగా చెప్పే ప్రదేశం ఎక్కడ ఉంది అని మోదుగుల రవికృష్ణ గారిని అడిగాను.. దానికి సమాధానంగా అసలు హిందూ రాజులకు సమాధులు కట్టారా ?అని ఎదురు ప్రశ్న వేశారు ఆయన . 

ఆలోచిస్తే ఏ చక్రవర్తి లేదా రాజుకి  సమాధి కట్టిన ఆధారం లేదు .. కృష్ణదేవరాయలకు  తప్ప మరో రాజు సమాధి అని ఏ ప్రదేశాన్ని గుర్తించలేదు. 8వ శతాబ్దం ముందు వరకు హిందూ రాజులకు సమాధి కట్టే ఆచారం ఉన్నట్లు ఎలాంటి ఆధారం లేదు. ఆ తరువాత అంటే శైవ వైష్ణవ ప్రచారాలు మొదలైన తరువాత కొంత సాంప్రదాయ వైవిధ్యాలు ఏర్పడ్డాయి.

కొందరు శైవ రాజులకు సమాధులు కట్టినట్లు అక్కడక్కడ ప్రస్తావన ఉంది కానీ చనిపోయేనాటికి శైవులుగా ఉన్న గణపతిదేవుడు ,రుద్రమ సమాధుల ప్రస్తావన లేదు. సూర్యాపేట సమీపంలోని చందుపట్ల వద్ద రుద్రమదేవి మరణాన్ని, వినుకొండ సమీపంలోని ఈపూరు వద్ద ఆమె సైన్యాధిపతి మరణాన్ని నిర్ధారించే శాసనాలు ఉన్నాయి కానీ ఎక్కడ చనిపోయింది,సమాధి కట్టిన విషయం మాత్రం ఏ శాసనంలో లేదు.

కొందరు చరిత్రకారులు రుద్రమ దేవి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద చనిపోయిఉండొచ్చని,ఇప్పుడు అమ్మ వారి గుడి వెనుకవైపున్న రెండు నంది స్థూపాలు రుద్రమ దేవి సమాధి అయ్యుండొచ్చని భావిస్తారు.
శైవ ఆచారంలో సమాధి కన్నా ముందే నంది వేయటం వచ్చినట్లుంది.

ఆ తరువాత కాలంలో శైవ సాంప్రదాయంలో చనిపోయినవారిని సమాధిలో పద్మాసనంలో కూర్చోబెట్టి సమాధి పైన ఒక లింగం లేదా నందిని పెట్టటం లేదా సమాధి మీద లింగం పెట్టి సమాధి ఎదుట నంది శిలను వేయటం సాంప్రదాయంగా స్థిరపడింది. వైష్ణవ సాంప్రదాయంలో మాత్రం మొదటి నుంచి ఉన్నట్లే ఖననం చేయటం కొనసాగుతుంది.

ఆ మధ్య సన్నిహిత మిత్రుడు… ఒక శైవ భక్తుడికి శ్రీశైలం గురించి చెప్పాను.. ఆ విషయం ఇక్కడ వివరంగా రాస్తే పెద్ద దుమారమే లేస్తుంది.ఈ పోస్ట్ రాయటానికి కారణం అయిన శ్రీకృష్ణదేవరాయల సమాధి నిజంగా ఉందా?, దేవరాయలు వైష్ణవుడు .. సమాధి కట్టే ఆచారమే లేదు. అయితే విజయనగర సామ్రాజ్య తొలి రాజధాని అనెగొందిలో తుంగభద్ర నది ఒడ్డున శ్రీకృష్ణ దేవరాయలను ఖననం చేసిన స్థలంగా భావించే చోట 64 స్తంభాల మండపం ఉంది.

ఇదే శ్రీకృష్ణ దేవరాయల సమాధి అని ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయల మరణించిన 1529 నాటికి హంపి పూర్తిస్థాయి రాజధానిగా ఉంది. రాయల నివాసం, పాలన మొత్తం హంపి నుంచే. మరి హంపికి 20 కిమీ దూరంలో ఉన్న ఆనెగొందిలో ఎందుకు శ్రీకృష్ణ దేవరాయలను ఖననం చేశారు?. ఒక వేల తుంగభద్ర ఒడ్డున ఖననం చెయ్యాలి అనుకుంటే హంపికి సమీపంలోనే తుంగభద్ర ఉంది. అనెగొంది వరకు తీసుకురావలసిన అవసరం లేదు.

1520లో రాయచూర్ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు  విజయం సాధించారు కానీ గాయపడ్డారు, అప్పటి నుంచి ఆయనను అనారోగ్యం వెంటాడింది. తన కుమారుడి అనుమానాస్పద మరణం తరువాత శ్రీకృష్ణదేవరాయల మానసిక పరిస్థితి మీద నాకు అనుమానమే. వారసుడి మరణం,తన అనారోగ్యం .. అంతఃపుర కుట్రలు.. వెరసి తన గత చరిత్రకు మనస్తత్వానికి భిన్నంగా కొన్ని తప్పులు చేశాడు. 

అందులో ప్రధానమైనది తిమ్మరుసు ,ఆయన కుమారుడు.  తిమ్మరుసు తమ్ముడు ముగ్గురి కళ్ళు పెకిలించి చెరసాలలో వెయ్యటం..అనెగొందిలోనే శ్రీకృష్ణ దేవరాయలను నిజంగా ఖననం చేసి ఉంటే రాయలు చివరి సంవత్సరాలు హంపిలో కాకుండా అనెగొందిలోనే గడిచి ఉండాలి. శ్రీష్ణదేవరాయల మరణంలో ఎలాంటి మిస్టరీ లేదు. ఆయన రాచపుండుతో చనిపోయారని చరిత్రకారులు రాశారు.. నా ఉద్దేశ్యంలో రాచపుండు అంటే క్యాన్సర్.. పని ఒత్తిడి తగ్గించటం స్థల మార్పు తదితర కారణాలతో శ్రీకృష్ణ దేవరాయల చివరి సంవత్సరాలు ఆనెగొంది లోనే గడిచి ఉండొచ్చు.

మరొక కారణం అనెగొందిలో ఉన్న మద్వాచారానికి చెందిన “నవబృందావనం” కూడా కావొచ్చు. శ్రీపాద్మనాభ తీర్ధతో పాటు మరో ఎనిమిది మంది బృందావనాలు (సమాధులు) అనెగొందిలోనే ఉన్నాయి,రాఘవేంద్రస్వామి ఈ పరంపరలోని వారే.హిందూ రాజులకు సమాధులు లేవు అనేది చరిత్ర,దీనికి అతి కొద్దిమంది మినహాయింపు.
ఉప కథ
వాలి సుగ్రీవుల యుద్ధం ఇక్కడే ఆనెగొందిలోనే జరిగిందని నమ్ముతారు ,ఒక ఉత్తరాది ఆశ్రమం కూడా ఉంది,దాన్ని చూడటానికి నార్త్ నుంచి పర్యాటకులు బాగానే వస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!