డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు………………………………………………..
నేను నేరుగా బంజారాహిల్స్ లోని మా ఇంటికి వచ్చేసరికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు మా ఇంటి వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు నేను ఒక గదిలోకి వెళ్ళాము. చంద్రబాబు చెప్పిన ప్రపోజల్ తను సీఎం అని, నేను డిప్యూటీ సిఎం అని, హరికృష్ణ పార్టీ జనరల్ సెక్రటరీ అని, అధ్యక్షుడు కూడా తానేనని చెప్పాడు. నేను ఎమ్మెల్యేలతోపాటు ఉండాలని ముందే నిర్ణయించుకున్నాను కాబట్టి సరే అన్నాను. చంద్రబాబు వెళ్ళిపోగానే నేను రూం నుండి బయటకు వచ్చాను. లక్ష్మీప్రసాద్, విజయ ఎలక్ట్రికల్స్ రమేష్ , చలమేశ్వర్ గార్లు నన్ను చుట్టు ముట్టారు. లోపల ఏమి జరిగిందని అడిగారు . నేను విషయం అంతా చెప్పాను. వెంటనే వారు హరికృష్ణ కూడా కేబినెట్లో ఉండాలన్నారు.
వెంటనే నేను దానికి స్పందించి అలాగైతే హరికృష్ణ కే డిప్యూటీ సీఎం పదవిని అడగండి, నేను కేబినెట్ లోకి రాను మనలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండటానికి హరికృష్ణ ఉన్నా, నేను ఉన్నా ఒకటేనని చెప్పాను. అయితే నేను విరమించుకున్న విషయం చంద్రబాబుకు చెప్పవద్దు, చంద్రబాబు నన్ను అడిగినప్పుడు నేనే చెప్తానని చెప్పాను. వారు సంతృప్తి చెంది వెళ్ళిపోయారు. ఈ విషయం అప్పటికి చంద్రబాబుకి తెలియదు. అదే రోజు రాత్రి వైశ్రాయ్ హోటల్లో అందరము చేరాము. చంద్రబాబును లీడర్ గా ఎన్నుకొనే కార్యక్రమం ప్రపోజ్ చేయమని చంద్రబాబు నన్ను అడిగారు.ఇంకొకటి కూడా అడిగాడు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ముందు హరికృష్ణ, బాలకృష్ణ లకు రామారావు గారిని దించి చంద్రబాబు ఎన్నుకునే విషయం గురించి నన్నే చెప్పమన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. మరి వారికి ఏమి చెబితే నీతో వచ్చారని అడిగాను. చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబించారు.
ఎన్నిక ప్రక్రియ అయిన వెంటనే చంద్రబాబు రామోజీ రావు గారి ని కలవటానికి వెళ్లారు. ఆ సంప్రదింపుల్లో రామోజీరావు గారు చంద్రబాబు తో నీకు వెంకటేశ్వరరావుతో రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది ( గతంలో తనకు జరిగిన అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని ) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోవద్దని రామోజీరావు సలహా ఇచ్చారు. అదే విషయాన్ని రెండోరోజు ఈనాడు పత్రిక ఎడిటోరియల్ లో కూడా రాశారు. నేను ముందే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మిన్నకుండిపోయాను. అయితే చంద్రబాబు తాను నాయకుడిగా ఎన్నికైన మరు క్షణం నుండి నాతో సంప్రదింపులు మానేశాడు. కనీసం ప్రకాశం జిల్లాలో ఎవరు మంత్రిగా ఉండాలని కూడా సంప్రదించలేదు. అంతకు ముందు నాకు చెప్పిన విషయం ….ఏ విషయంలోనూ నాతో సంప్రదించకుండా ఏ పని చేయని చెప్పిన వ్యక్తి. అంతటితో ఆగకుండా నాతో ఎవ్వరూ కలవ నీయకుండా పూర్తిగా నియంత్రణ చేయడం మొదలుపెట్టాడు. హరికృష్ణ కూడా మంత్రి పదవి దక్కిన తర్వాత నాతో సంప్రదింపులు ఆపేశాడు.
ఇక్కడ రెండవ వైపు రామారావు గారి దగ్గర కేవలం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. పురంధరేశ్వరి గారి పాత్ర గురించి కథనాలు వచ్చాయి. ఆనాటి సంఘటన లో ఆమె నన్ను ప్రోత్సహించారని….ఇది ముమ్మాటికీ నూటికి నూరుపాళ్లు అవాస్తవం, కల్పితం. ఎందుకంటే నేను వైస్రాయ్ హోటల్ కి వెళ్ళగానే పురంధరేశ్వరి వారి నాన్నగారి దగ్గరకు వెళ్ళింది వాస్తవానికి నా చర్యలను నిలువరించిందింది. నన్ను వద్దని చెప్పింది. నేను మాట వినక పోయేసరికి మరుసటి రోజు ఉదయం ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళింది . ఆవిడ నన్ను ప్రోత్సహించి ఉండినట్లైతే అలా వెళ్లగలిగేదేనా ? ఇక్కడ ఒక మాట చెప్పాలి అప్పుడు రామారావు గారు పురందేశ్వరిరితో అన్న మాటలు తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నాకు కడుపులో దేవినట్లు ఉంటుంది . “ఎప్పుడూ కలవని చంద్రబాబు వెంకటేశ్వరరావులు ఇద్దరూ ఈ ముసలివాడిని దించేందుకు కలిసారా అమ్మ … చంద్రబాబు చేశాడు సరే వెంకటేశ్వరరావు అలా కాదు కదా ” ఆ మాటలు తలచుకుంటే ఈ రోజుకీ, ఈ రాసే సమయంలో కూడా కంట్లో తడి అవుతుంది.
ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు. నా పరిస్థితి అక్కడ నన్ను ఒంటరిని చేశారు . 20 రోజులు కాకుండానే నేను తిరిగి రామారావు గారి వద్దకు చేరుకున్నాను. నేను ఎవ్వరినీ కోరక పోయినా నాతో పాటు 16 మంది శాసనసభ్యులు వచ్చారు . చివరి రోజుల్లో రామారావు గారి దగ్గర ఉండే భాగ్యం నాకు కలిగింది. మళ్ళీ పార్టీ పని అప్పజెప్పారు. జనరల్ సెక్రటరీగా బాధ్యత అప్పజెప్పారు. సింహగర్జన ఏర్పాట్లు జరుగుతున్న సమయం. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాము. అంతలోనే ఆయన మరణం సంభవించింది ….
చివరిగా సారాంశం ఏమిటంటే లక్ష్మీప్రసాద్ ప్రమేయం లేకుంటే, బాలకృష్ణ హరికృష్ణ లు ఆ రోజు అక్కడకు రాకుంటే ఈ దుర్ఘటన సాధ్యమయ్యేది కాదు. చంద్రబాబు fail అయ్యవారు. రామారావు గారు అంత మానసిక వత్తిడికి గురి అయ్యేవారు కాదు బ్రతికి ఉండేవారు.. ప్రధాని అయ్యేవారు.
ఇప్పుడు ఇది ఎందుకు రాస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ కోణపు కథనం నేను ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో రాయలేకపోయాను. ఆ నాటికి నాకు పూర్తిగా సమాచారం తెలియదు. లక్ష్మీ ప్రసాదు చంద్రబాబు తో మాట్లాడిన ఉదంతం , ఎన్టీ రామారావు గారు నెహ్రూ వచ్చినప్పుడు హరికృష్ణ ను సపోర్ట్ చేయమని చెప్పినటువంటి విషయం నాకు గతంలో తెలియదు. తరువాతి రోజుల్లో లక్ష్మీప్రసాద్ చెప్పడం వల్లే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి.నాకే కాదు చాలామందికి ఆయనే చెప్పాడు.లక్ష్మీ ప్రసాద్ నాతో ఇప్పటి కీ సఖ్యాత్తతోనే ఉంటాడు. ఇలా వ్రాస్తున్నందుకు లక్మీ ప్రసాద్ అన్యధా భావించ వద్దని ప్రార్ధన. ఈ నిజాలను బాధ్యతతో తెలియజేయటం నా కర్తవ్యమని తెలియజేస్తున్నాను.
ఇకపోతే కొంతమంది ఈ రెండు రోజులు నేను అసూయ అక్కసుతోనే రాస్తున్నానని కూడా వ్యక్తపరిచారు. దానికి కొంత వివరణ.
నా వయస్సు 68 సంవత్సరాలు. నేను జీవితంలో అన్నీ చూశాను. సహజంగా 70 సంవత్సరాల తర్వాత జీవించిన ప్రతి సంవత్సరం బోనస్ క్రింద లెక్క వేసుకోవాలనేది నా అభిప్రాయం. పిన్న వయస్సులోనే భగవంతుడు అన్నీ ఇచ్చాడు. పదవీ, అధికారం , మంచి కుటుంబం, జీవించడానికి సరిపడా ఏర్పాట్లు ఇచ్చాడు. నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం లో చాలా మంది ప్రధాన మంత్రులును, ముఖ్యమంత్రు లను చూశాను. దేశ, ప్రపంచ చరిత్రలను కూడా క్షుణ్ణంగా చదివాను. ప్రస్తుతం కరోనా సమయం లో పుస్తకం కూడా వ్రాశాను. ప్రచురణకు సిద్ధంగా ఉంది. చరిత్రలో మేసిడోనియా కింగ్ అలెగ్జాండర్ దగ్గరనుంచి.. జూలియస్ సీజర్. ఫ్రాన్సు కింగ్ లూయిస్, ఇంగ్లాండ్ కింగ్ హెన్రీ లు… నెపోలియన్ , ఫ్రెంచ్ రెవల్యూషన్, బోల్షివిక్ విప్లవం , రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్, ముస్సోలిన్, ఆ తర్వాత రోజుల్లో మావో ఇవన్నీ చదివిన వాడిని. విషయం ఏమిటంటే చరిత్రలో ఎవరూ కూడా శాశ్వతం కాదు. కాకపోతే ఒక రోజు ముందు.. ఒకరోజు వెనక.. పోవలిసిందే.
నా ఉద్దేశం…. జీవితంలో చివరి దశలో ప్రతిరోజు మనకు దేవుడు ఇచ్చిన వరం మే. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ,మరీ ఈ కరోనా సమయంలో. వీలైనంతవరకు అది లేదు.. ఇది లేదు.. అనుకోకుండా ఉన్న సమయాన్ని సుఖంగా, సంతోషంగా గడపటం అనేది ముఖ్యమని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్లీ ఈ మానవ జన్మ ఉంటుందో, లేదో తెలియదు. నా అభిప్రాయంలో జన్మ ఒక్కటే. దీనిని గ్రహించకుండా నాకు ఇంకా పదవులు కావాలి, పెత్తనం చేయాలి అనుకోవడం సమంజసం కాదని.. అందరూ ముఖ్యమంత్రులు అవ్వాలంటే సాధ్యమా..? మొన్న ఎన్నికలలో నేను ఓడిపోయాను. అందుకు నేను సంతోషంగా ఉండాలా, సుఖంగా ఉండాలా అనుకుంటే దేవుడు నన్ను ఇప్పటివరకు నువ్వు చేసిన సేవ చాలు ఇక పై నీవు అనుభవించవలసిన ఇంకొక జీవితం ఉంది, భార్య పిల్లలు కుటుంబం తో కాలం గడపమని నాకు దేముడు చెప్పినట్లుగా గోచరిస్తుంది.
గతంలో నేను నా పిల్లల గురించి పట్టించుకునే వాడిని కాదు. వారితో గడిపిన సమయం కూడా చాలా తక్కువ. చివరికి వారు ఏ క్లాసు చదువుతున్నారు కూడా నాకు తెలిసేది కాదు. అయితే గత ఐదారు సంవత్సరాలుగా నేను ఇది తెలుసుకొని నా స్నేహితులతో టి కుటుంబం తోటి సమయం గడుపుతున్నాను. ఈ కోవిద్ సమయంలో నా మనవళ్లు, మనవరాళ్లకు రామాయణం మహాభారతం గురించి తెలియ చెప్తూ,వాళ్ళకు రామారావు గారి పౌరాణిక సినిమాలు చూపిస్తూ వారితో చెస్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నాను. ఇదే నాకు దేవుడు చెప్పిన పని, నేను గతంలో కోల్పోయిన
నాకు సంతోషకరమైన అటువంటి పని ఇది.. వీలైతే మీరు కూడా ఆలోచించండి…
ఇక ఇంతటితో ముగిస్తాను.