ఆ ఇద్దరి నడుమ వైరమే.. ఎన్టీఆర్ పదవీచ్యుతి కి కారణం !

Sharing is Caring...

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు …………………………………………………..

లక్ష్మీ ప్రసాద్, హరికృష్ణ , బాలకృష్ణ చంద్రబాబు, నా విషయాలకు వద్దాం. రామారావు గారిని దించటం సాధారణ పరిస్థితులలో అయితే రామోజీరావుగారి కి గానీ, లక్ష్మీపార్వతి కి గానీ సాధ్యపడే విషయం కాదు. ఎందుచేతనంటే 270 మంది శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు. చంద్రబాబు కు కూడా రామారావు గారిని దించే ధైర్యం , సాహసం లేదు . అయితే ఇది ఎలా సంభవించింది…లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ల మధ్య వైరం ఈ పరిస్థితికి దారితీసిందనేది ఈ కథనంలో సారాంశం. అది ఎట్లా అంటారా ?

1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత లక్ష్మీప్రసాద్ రామారావు గారికి చేరువయ్యారు . అంతకు ముందు వరకు అంత పెద్దగా పరిచయం లేదు. రామారావు గారు ఎక్కువ సమయం ఖాళీగా ఉండేవారు. ఆ సందర్భంలో లక్ష్మీప్రసాద్ తో సాహిత్య చర్చలు ఇతరత్రా మాటామంతీ చేస్తోఉండేవారు. ఈ విషయాలలో లక్మీ ప్రసాద్ దిట్ట. హిందీ భాష లో నిష్ణాతుడు. రామారావు గారు హిందీ లో సినిమా తిసేటప్పుడు రామారావుగారి తో ఎక్కువ సమయం గడపటానికి సాద్యపడేది.

1993 తర్వాత లక్ష్మీపార్వతి ప్రవేశంతో ఈ అవకాశం లక్ష్మీప్రసాద్ కు తగ్గిపోయింది. 1994 లో ఎన్నికల అయిన తర్వాత మరింత గా … లక్మీపార్వతి కూడా సాహిత్య ప్రవేశం ఉన్న మనిషి. సహజంగా రామారావు గారికి అంత సన్నిహితంగా ఉన్న లక్మీ ప్రసాద్ ఒక్కసారిగా రామారావు గారికి దూరం కావడం మూలాన లక్ష్మీపార్వతి మీద సహజంగానే ద్వేషం పెరిగింది. అది ఎక్కడి వరకూ వెళ్ళిందంటే 1995లో రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసేవరకు వెళ్ళింది.

రామారావు గారు రాజీనామా చేసిన టెక్కలి సీటును మొదట లక్ష్మీపార్వతి కి అనుకోవడం జరిగింది. అయితే లక్ష్మీప్రసాద్ ప్రోద్బలంతో హరికృష్ణ దీనిని వ్యతిరేకించి తనకు ఈ సీటు కావాలని అడగడం జరిగింది. లక్ష్మీప్రసాద్ హరికృష్ణకు చాలా దగ్గరగా ఉండేవాడు . లక్ష్మీప్రసాద్ ఎలాగైనా లక్ష్మీపార్వతి ని నిలువరించాలనే నిశ్చయంతో ఉన్న వ్యక్తి. చివరికి అప్పయ్య దొరను టెక్కలి సీటుకు ఎంపిక చేయడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అయితే లక్ష్మీప్రసాద్ – లక్ష్మీపార్వతి ల మధ్య వివాదం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా బహిరంగ సభలు పెట్టాలని హరికృష్ణకు ఉద్భోదించడం తో రామారావు గారిని పదవీచ్యుతుడ్ని చేసే ఘట్టానికి నాంది పడింది.మొదట నిజామాబాద్, తెనాలి సభలు విజయవంతం అయ్యాయి. సభలో ముఖ్య సారాంశం, టార్గెట్ లక్ష్మీపార్వతి. ఇదే చంద్రబాబు కు రామారావు గారిని దించటానికి ధైర్యం కలిగించిన అంశం. తర్వాత సభ గా విజయవాడను ఎన్నుకోవడం జరిగింది. రామారావు గారు ఈ సభలను నిలువరించలేదు.

పై పెచ్చు నాటి విజయవాడ శాసనసభ్యులు , మంత్రిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ రామారావు గారి వద్దకు వచ్చి హరికృష్ణ సభను విజయవంతం చేయడానికి తన సహాయం కోరాడని, తన కర్తవ్యం ఏమిటని అడగగా రామారావు గారు ఆ సభకు తోడ్పడమని ప్రోత్సహించారు . ఈ విషయాన్ని నెహ్రూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అంతే కాకుండా రాబోయే కాలంలో హరికృష్ణ మీకు నాయకుడు అని కూడా రామారావు గారు నెహ్రూతో చెప్పారు.

ఈ విషయాన్ని నెహ్రూ లక్ష్మీప్రసాద్ తో చెప్పగా , ఇద్దరూ కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. ఈ విషయమై చంద్రబాబు స్పందనను నెహ్రూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో స్పష్టంగా చెప్పారు. హరికృష్ణ నాయకుడు అనే మాట రుచించక రామారావు గారిని, హరికృష్ణను చంద్రబాబు దూషించాడు.ఆ దూషణలు వ్రాయటానికి అనువైన భాష కాదు. చాలామంది నెహ్రూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చూసి ఉంటారు. విజయవాడ సభ విజయవంతమైంది.

ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే రామారావు గారి కి తన కుమారులలో ఎవరైనా జనసామాన్యంలో కి వెళ్లే సామర్ధ్యం  ఉండి సక్సెస్ అయితే వారిని ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారనేది విస్పష్ట్టం. అయితే రామారావు గారు చెప్పిన ఈ విషయాన్ని హరికృష్ణకు తెలియనివ్వలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే రామారావు గారు తన కుమారుల్లో ఎవరైనా సమర్థులు ఉంటే తన తరువాత చంద్రబాబు, వెంకటేశ్వరరావు , లక్ష్మీ పార్వతులు కాకుండా కుమారులకే అప్పజెప్పడానికి సుముఖంగా ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

సరిగ్గా ఇంచుమించు అదే సమయంలో గత ఎపిసోడ్ లో చెప్పిన విధంగా సెంట్రల్ బ్యాంక్ ఎన్నికలు రావడం, జిల్లాల్లో అధికారిక అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. ఎనిమిది మంది మీద సస్పెన్షన్ వేటు పడటం, ఇంకా కొంత మంది ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయని ఈనాడులో రావడం జరిగింది. ఇంతజరిగినప్పటికి రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుండి దించే సాహసం చంద్రబాబు చేయగలుగుతాడా అనేది సందేహం . చంద్రబాబు అంత ధైర్యశాలి కాదు. అయితే ఎమ్మెల్యేలను సంప్రదించి సస్పెన్షన్ విషయం పై చర్చించడం మొదలుపెట్టాడు .

1995 ఆగస్ట్ 20 ప్రాంతంలో వైజాగ్ లో రామారావు గారు ప్రజల వద్దకు పాలన కార్యక్రమం నిర్వహించడానికి వెళ్లారు. వారితో పాటు చంద్రబాబు కూడా అధికారికంగా అక్కడే ఉన్నారు. ఉదయం పూట రామారావుగారితో చంద్రబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మిగతా సమయంలో ఎమ్మెల్యేలతో చర్చించటం మొదలుపెట్టారు. మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి,విద్యాధరరావు , ఇతరులు చంద్రబాబుకు సహాయపడ్డారు. ఇంటలిజెన్స్ ఈ ఉదంతాన్ని రామారావు గారికి చేరవేస్తున్నారు. రామారావు గారు మాత్రం మొదట పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.

ఇక్కడే లక్ష్మీప్రసాద్ పాత్ర ప్రధానం . చంద్ర బాబు దగ్గరకు వెళ్లి లక్ష్మీప్రసాద్ అన్నమాట ” మీరు పామును తట్టి లేపారు. బుసకొట్టిన పాము కాటు వేస్తుంది . అందుచేత మీరు పాము పడగను- కాటు వేయక ముందే పట్టుకొని నలిపివేయాలి” . అంటే రామారావు గారు పాము అనుకుంటే రామారావు గారిని దించే చర్యను వెంటనే ఉపక్రమించమని అప్పటికే ఎమ్మెల్యేలతో ముందే చర్చలు జరుగుతున్న సందర్భంలో పైకి చెప్పకపోయినా లోపల రామారావు గారిని దింపాలని ప్లాన్ వేసుకొనే కార్యక్రమం చేయాలి అని . దీనిని సాధించడం ఎలా అంటే మొదటి అస్త్రం బాలకృష్ణ .

August 24 న వైజాగ్ షూటింగ్ లో ఉన్న బాలకృష్ణను కన్విన్సు చేసి లక్ష్మీ ప్రసాద్ వెంటబెట్టుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చారు. అప్పటి కే ఒకవైపు చంద్రబాబు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ఉన్నారు. లక్ష్మీ ప్రసాద్ బాలకృష్ణను నేరుగా సెక్రటేరియట్ లో చంద్రబాబు పేషీ కి తీసుకొచ్చి కూర్చోపెట్టడం జరిగింది . అక్కడ నుండే హరికృష్ణకు కబురు చేసి రప్పించడం జరిగింది. మధ్యాహ్నం నాటికి ఎమ్మెల్యేలు రావటం మొదలయింది .

వచ్చిన వారికి హరికృష్ణ, బాలకృష్ణ లను చూపిస్తూ కార్యక్రమం తీవ్రతరం చేయడం జరిగింది. మొత్తానికి 60,70 , మంది దాకా ఉండి, మిగతా వారిని ఫోన్ ద్వారా సంప్రదింపులు చేస్తూ పోయారు. ఇంతకీ హరికృష్ణ , బాలకృష్ణ లను ఏమి చెప్పి తీసుకొచ్చారని ప్రశ్నించుకుంటే తన తండ్రిని పదవీచ్యుతుడిని చేస్తున్నారని బహుశా చెప్పిఉండకపోవచ్చు. లక్ష్మీపార్వతిని నిలువరించడం వరకే పరిమితమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాలు తర్వాత రోజుల్లో నేను బాలకృష్ణను  అడగగా ఇదే అభిప్రాయాన్ని నాకు చెప్పటం జరిగింది.

ఇక నా పాత్ర అంటారా…
సరిగ్గా ఈ సంఘటన జరుగుతున్న సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ఆగస్టు 19, 20 తేదీలు. ఆ రెండు మూడు రోజులు నా ఫోన్ మోగుతూనే బిజీగా ఉంది. దాదాపు 120 నుండి 150 మంది వరకు ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అప్పటికే చాలామంది ని చంద్రబాబు వర్గం సంప్రదించిందని చెబుతూ ఉన్నారు. ఎమ్మెల్యే ల మాటలను బట్టి వారు చంద్రబాబు వర్గంలోకి పోవాలని భావిస్తున్నట్లు గా నాకు గోచరించింది.

ఎమ్మెల్యేలు ఎందుకలా వ్యతిరేకమవ్వాలి అనుకుంటున్నారంటే నాకు అనిపించింది 1994లో చంద్రబాబు దగ్గర రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఉండేవి. ఒకటి రెవెన్యూ, రెండవది ఫైనాన్స్. ఎమ్మెల్యేలకు చిన్నాచితకా లాభదాయకమైన పనులను చంద్రబాబు చేసి పెడుతూ ఉండేవాడు. రామారావు గారి వద్ద అవి సాధ్యపడేవి కావు .

ఇక్కడ పరిస్థితి చూస్తే బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ అక్కడే ఉన్నారని ధైర్యం ఎమ్మెల్యేలకు కలిగింది.may 24 ఉదయం చంద్రబాబు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటానని మాత్రమే చెప్పాను. సాయంత్రం వచ్చే వరకూ కూడా నేను ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఎమ్మెల్యేల మొగ్గు వ్యతిరేక వర్గం వైపే కనబడుతుంది.

ఇక అప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అంతిమంగా శాసనసభ్యుల నంబరే ముఖ్యమంత్రిని చేసేది. ఇంత మంది అనుకూలంగా ఉన్న వారితో నేను ఉంటేనే కదా తర్వాత నేను ఏమైనా చేయగలిగేది. గతంలో 1989 లో జరిగిన ఉదంతం తో నా పాత్ర పైన నాకే విశ్వాసం ఉంది . ( 30 మంది మంత్రులను తీసివేసినప్పుడు నేను mla లను కట్టడి చేసి విజయం పొందానన్న విషయం ). 

ఎలాగైనా తర్వాత రోజుల్లో నేను మళ్లీ ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకు రావచ్చునని అనుకున్నాను. సాయంత్రం నేను హైదరాబాద్ రాగానే విమానాశ్రయానికి చాలా మంది ఎమ్మెల్యేలు పెద్దఎత్తున వచ్చారు. అందరూ నా ద్వారా పార్టీలో పదవులు పొందిన వారే . అయితే విమానాశ్రయంలో సంప్రదింపుల నేపథ్యంలో నాకు అర్థమయ్యిందేమిటంటే అందరూ నన్ను కూడా తమతోపాటు వ్యతిరేక వర్గం వైపు నిర్ణయం తీసుకోమన్నట్లు గా ఉంది.

READ IT ALSO  …………………………… అలా …. ఎన్టీఆర్ నిష్క్రమించారు 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!